అడవితల్లి మురిసిపోతున్నది.. తన ఒడిలో పుట్టిపెరిగిన బిడ్డను ఇప్పుడు అందరూ డాక్టరమ్మా అని పిలుస్తున్నారు. గూడెం పెద్ద.. మీసాలు దువ్వుతున్నాడు.. బాల్యంలో పొక్కిలి వాకిట్లో ఆడుకున్న ఆడకూతురు వైద్యురాలిగా కండ్లముందు నిలబడింది.
ఒకప్పుడు వైద్య విద్య పెద్దింటి పిల్లలకే సొంతం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన గురుకులాల పుణ్యాన అడవితల్లి ముద్దుబిడ్డలు, గూడెం ఆడకూతుళ్లు, కూలీల పిల్లలు వైద్యవిద్యకు దగ్గరవుతున్నారు. చదువుకునే ఆసక్తి, తెలివితేటలు ఉన్నా.. సరైన ప్రోత్సాహం లేక పెద్ద చదువుల ఆశలను మొగ్గలోనే తుంచుకున్న విద్యార్థులు ఎందరో! అలాంటిది ఇప్పుడు అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ఏర్పాటైన గురుకుల విద్యాలయాల అండతో పేద విద్యార్థులు చదువుల్లో రాణిస్తున్నారు. వందల సంఖ్యలో వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. వైద్యులుగా పేరు తెచ్చుకుంటున్నారు. ఏప్రాన్ తొడిగి, స్టెత్ ధరించి సాక్షాత్తూ అశ్వినీ దేవతల్లా దర్శనమిస్తున్నారు.
ఒకప్పుడు సిరిగలవారి పిల్లలకే వైద్య విద్య. మధ్యతరగతి బిడ్డలకు అది అందని ద్రాక్ష. ఇక నిరుపేదలకైతే బ్రహ్మపదార్థమే. గతంలో గిరిజన కూతుళ్ల చదువులు పాఠశాల విద్య దాటితే గొప్ప అనుకునేవాళ్లు. చదువుకోవాలని ఎంత ఉన్నా.. అందుకు అవకాశాలు ఎక్కడివి? కానీ, రోజులు మారాయి. పాలకుడు ప్రజల మనిషైతే కలలు సాకారం కాకుండా ఎలా ఉంటాయి? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన గురుకుల విద్యాలయాలు నేడు పేదింటి వైద్యులకు చిరునామాగా నిలుస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల్లోని పేదింటి ఆడబిడ్డల వైద్యవృత్తి కలలను సాకారం చేస్తుండటంతోపాటు వారి తలరాతలను మార్చేస్తున్నాయి.
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 981 గురుకులాలు ఏర్పాటు చేసి ఇంటర్ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నది. ఆ తర్వాత మెడిసిన్ చదవడానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. అందుకోసం ప్రత్యేకంగా ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటుచేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలన్నీ సత్ఫలితాలను ఇస్తు న్నాయి. ఏటికేడు గురుకులాల నుంచి ఎంబీబీఎస్ సీట్లను సొంతం చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మెడిసిన్‌తోపాటు డెంటల్, ఫార్మా, వెటర్నరీ, హోమియోపతి తదితర కోర్సుల్లోనూ గురుకుల విద్యార్థినులు సత్తా చాటుతున్నారు. గడచిన ఆరేండ్లలో ఒక్క సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచే 513 మంది ఎంబీబీఎస్ సీట్లను సాధించగా, అందులో సగానికిపైగా ఆడబిడ్డలే ఉండటం విశేషం. గిరిజన, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల నుంచి కూడా బాలికలు అత్యధిక సంఖ్యలో మెడిసిన్ సీట్లు సాధిస్తుండటం విశేషం.
వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన మౌనికది నిరుపేద కుటుంబం. తండ్రి మహిపాల్ పాత్రికేయుడిగా కొనసాగుతూనే ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి అరుణ బీడీ కార్మికురాలు. వీరికి ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కూతురు మౌనిక, రెండో కూతురు అర్చన ఇద్దరూ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలోనే ఇంటర్ పూర్తిచేశారు. తర్వాత అక్కడే నీట్ శిక్షణ పొందారు. గతేడాది మౌనిక పటాన్‌చెరువులోని మహేశ్వర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటును దక్కించుకుంది. ఈ ఏడాది నిర్వహించిన నీట్లో అర్చన కూడా ర్యాంక్ సాధించి, గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సొంతం చేసుకుంది.
హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన సంధ్య డాక్టర్ కావాలనుకుంది. ఇంటర్ పూర్తయ్యే సమయానికి తండ్రి కోటేశ్వర్రావు అనారోగ్యంతో కన్నుమూశాడు. దాంతో ఆమె కలలన్నీ కరిగిపోయాయి. సరిగ్గా అప్పుడే 2015లో తెలంగాణ ప్రభుత్వం గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో నీట్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది. అందులో చేరింది సంధ్య. నీట్లో 2000, ఎంసెట్‌లో 5000 ర్యాంక్ సాధించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని భాస్కర్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది. మరో నెల రోజుల్లో డాక్టర్ పట్టా అందుకోనుంది. గౌలిదొడ్డి కళాశాల లేకపోయి ఉంటే తన కల సాకారమయ్యేదే కాదని అంటున్నది సంధ్య.
మాది మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెం. నాన్న నాగయ్య ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. అమ్మ మహేశ్వరి గృహిణి. పదో తరగతి వరకు చర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదివా. తర్వాత ‘బెస్ట్ అవైలబుల్ స్కీమ్’ స్కాలర్షిప్ ద్వారా ఖమ్మంలోని రెజోనెన్స్ కాలేజీలో ఇంటర్ చేశా. గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా. నీట్లో ఆలిండియా ఎస్సీ కేటగిరీలో 949 ర్యాంకు సాధించా. ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు వచ్చింది. నన్ను ప్రోత్సహించిన అధ్యాపకులకు, గురుకులాలను గొప్పగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాను.
– స్పందన, ఉస్మానియా వైద్య కళాశాల
మాది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేశారం గ్రామం. వ్యవసాయ కుటుంబం. నాన్న అనంతయ్య, అమ్మ శ్యామల. పదో తరగతి వరకు శివారెడ్డిపేట్‌లో చదువుకున్నా. గౌలిదొడ్డి గురుకులంలో ఇంటర్ పూర్తి చేశా. అక్కడే నీట్ కోచింగ్ తీసుకున్నా. అధ్యాపకుల ప్రోత్సాహం వల్లే నార్కెట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్లో మెడికల్ సీటును సాధించగలిగా. నెల రోజుల్లో నా ఎంబీబీఎస్ పూర్తవుతుంది. సర్జన్ కావాలన్నదే నా ఆశయం.
– కృప, కామినేని వైద్య కళాశాల
మాది నాగర్‌కర్నూల్ జిల్లా సింగోటం. నాన్న కండక్టర్‌గా పనిచేసేవారు. నా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. దీంతో అమ్మే కూలీ పనులు చేస్తూ అక్కను, నన్ను, తమ్ముడిని చదివించింది. ఐదు నుంచి పదో తరగతి వరకు తెల్కపల్లి గురుకులంలో చదివా. ఇంటర్ గౌలిదొడ్డి గురుకులంలో పూర్తి చేశా. అక్కడే నీట్ శిక్షణ తీసుకున్నా. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో సీటు సాధించగలిగా. కార్డియాలజిస్ట్‌గా పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం.
– నేహ, కాకతీయ మెడికల్ కాలేజీ
– మ్యాకం రవికుమార్
“తైక్వాండోలో దూసుకెళ్తున్న తెలంగాణ ఆడబిడ్డ.. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడమే లక్ష్యం!”
“మోడల్ అంటే అందంగానే ఉండాలా?”
“కార్పొరేట్ జాబ్ వదిలేసి.. రైల్వే స్టేషన్లకు పెయింటింగ్‌లు వేయిస్తున్నాడు.. ఎందుకో తెలుసా”
Sangeetha Kala Sisters | ఆ సిస్టర్స్‌కి రామకథలే అన్నపానీయాలు”