Sangeetha Kala Sisters | ఆ సిస్టర్స్‌కి రామకథలే అన్నపానీయాలు
Sangeetha Kala Sisters | ఆ సిస్టర్స్‌కి రామకథలే అన్నపానీయాలు. రామదాసు కీర్తనలే ఉచ్ఛాస నిశ్వాసలు. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటారు. అయితేనేం, ‘తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు’ అన్న నిశ్చింత. సిఫారసులు, ప్రచార ఆర్భాటాలు తెలియవు. ‘చరణములే నమ్మితి. నీ దివ్య చరణములే నమ్మితి’ అనగలిగేంత ప్రపత్తి. బతుకు భయం అసలే లేదు. ‘రామునివారము మాకేమి విచారము’ అంటూ చిద్విలాసంగా విద్యార్థులకు సంగీతం నేర్పుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు సంగీత కళ సిస్టర్స్.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సంగీత కళ సిస్టర్స్‌ది ఆరుతరాల సరిగమల వారసత్వం. తెలంగాణ వాగ్గేయకారులు కిడాంబి కోదండపాణి మనుమరాళ్లు వారు. కిడాంబివారు 72 మేళకర్త రాగాల్లో కీర్తనలు రాశారు. సోదరీమణులు ఇద్దరూ తాత దగ్గరే పెరిగారు. రెండేండ్ల వయసులో సాధన మొదలుపెట్టింది అక్క సంగీత కళ. చెల్లె రాజ్యలక్ష్మి మాత్రం నాలుగేండ్ల ప్రాయం నుంచీ సాధన ఆరంభించింది. ఇంకో చెల్లెలు వీణాధరి మృదంగ విద్వాంసురాలు. కర్ణాటక సంగీత దిగ్గజం నేదునూరి కృష్ణమూర్తి వద్ద శిష్యరికం చేశారు సంగీత, రాజ్యలక్ష్మి. ఆంధ్రులు అన్నమయ్య కీర్తనలను కండ్లకద్దుకుంటారు. తమిళులకు త్యాగయ్య దైవ సమానం.

తెలంగాణలో మాత్రం రామదాసు కీర్తనలకు పెద్దగా ఆదరణ లేదు. ఆ సంకీర్తనా భాండాగారం కనుక మరుగున పడితే భద్రాద్రి రాముడి వైభవమూ మసకబారినట్టే. ఆ పరిస్థితి రాకూడదనే రామదాసు కీర్తనలను పామరులతోనూ పాడిస్తున్నారు సంగీత కళ సిస్టర్స్. గోపన్న భక్తితో కొలిచిన, ఆర్తితో పిలిచిన రాముడి పేరు మీద.. ‘శ్రీ కోదండపాణి సంగీత విద్యా సంస్థ’ను స్థాపించారు. తెలంగాణలోని విద్యాసంస్థల్లో రామదాసు కీర్తనల పోటీలు నిర్వహించారు. ‘రామదాసు కీర్తనల ప్రచార యాత్ర’ చేపట్టారు. ‘నను బ్రోవమని చెప్పవే..’ అని రామదాసు సీతమ్మవారిని వేడుకున్నట్టు, ఈ సోదరీమణులు కూడా మనదైన సంగీత వారసత్వాన్ని కాపాడమని తెలంగాణ ప్రజలకు విన్నవిస్తున్నారు. మేలిమి బంగారం లాంటి కళాకారులను గుర్తించి ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై ‘శత గళార్చన’ చేయించారు. రామదాసు కీర్తనలు ఇంటింటికీ చేరాలంటే డిజిటల్ మాధ్యమాలతోనే సాధ్యమని భావించి.. టీ శాట్ ద్వారా ‘రామదాసు కీర్తనల డిజిటల్ శిక్షణ తరగతులు’ ప్రారంభించారు.

సాహితీ స్వరాలు
సంగీత కళ సిస్టర్స్ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటారు. ‘తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు’ అన్న పలుకు వాళ్లకు ఆదర్శం. ఆ ఇద్దరితోపాటు శ్రీకోదండపాణి సంగీత విద్యా సంస్థ చిరునామా కూడా మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం పాతబస్తీలోని ఫలక్‌నుమాలో ఉంటున్నారు. శిష్యప్రశిష్యులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించే పాఠశాలల్ని పర్యవేక్షిస్తూ సంగీత సేవ చేస్తున్నారు. ‘స్త్రీ విముక్తి పయనం’ అనే నృత్య రూపకానికి, ‘మా బడి వైభవం’ అనే టెలిస్కూల్ కార్యక్రమానికి స్వరకల్పన చేశారు. నిర్భయ ఘటన నేపథ్యంలో ‘ఓ భారత మహిళ..’ పాటకు స్వరాలు కూర్చి స్త్రీ చైతన్య ఉద్యమానికి ఓ గీతాన్ని అందించారు. యాదగిరి గుట్ట నరసింహస్వామి గీతాలు, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి పాటలను స్వరపరిచి హృద్యంగా
ఆలపించారు. సుబ్రహ్మణ్య భారతి 125వ జయంతి సందర్భంగా దేశభక్తికి ఉత్ప్రేరకంగా పనిచేసిన పాటలను ఈ తరానికి పరిచయం చేస్తూ ‘స్వాతంత్య్ర స్వరం’ పేరుతో ఓ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. ఈ సోదరీమణుల కృషిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఉమెన్ అచీవర్స్’ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

అందరి కీర్తనలు
‘ఇప్పటికీ రామదాసు కీర్తనలు పాడేవాళ్లు తక్కువ. టీటీడీ ప్రాజెక్ట్ చొరవతో అన్నమాచార్యులు ప్రాచుర్యంలోకి వచ్చారు. అదే పద్ధతిలో మేం కూడా భక్త రామదాసు కీర్తనలను వెలుగులోకి తెస్తున్నాం. రామదాసు ఆరువేలకుపైగా కీర్తనలు రచించారు. దేనికదే ఆణిముత్యం. సంగీత శిక్షణలో భాగంగా విద్యార్థులకు 108 కీర్తనలు నేర్పిస్తున్నాం. శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేనివారు కూడా పాడుకోగలిగినంత సరళంగా రాశాడా మహానుభావుడు. రామదాసు కీర్తనల్లో చాలావరకు భజన సంప్రదాయంలో ఉన్నాయి. పిల్లలు, పెద్దలకు ఆ పాటల్ని చేరువ చేయాలన్నదే మా ప్రయత్నం’ అంటారు సంగీత కళ. ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లకు రామదాసు శరణాగతి సాహిత్యంలో పరిష్కారం ఉందంటారు ఆ సోదరీమణులు.
– నాగవర్ధన్ రాయల
Read More :
సపోట నుంచి తేనె దాకా అన్నింటితో వైన్.. మరాఠా అమ్మాయి ఆలోచన అదుర్స్”
అప్పుడు ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది.. ఇప్పుడు అవార్డులు అందుకుంటుంది”
“Telu Vijaya | రెండు పీజీలు చేసినా రాని గుర్తింపు ఒక్క పాటతో వచ్చింది”
“Mumbai Cafe Bambai Nazariya | ముంబైలోని ఈ కెఫేలో సిబ్బంది అంతా ట్రాన్స్‌జెండర్సే!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- inspiration
- Lord Rama
- Music
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

