Sudharani Khanderao | బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆ ఒంటరితనం ఆత్మహత్యకు పురిగొల్పింది. అయితే, అనుకోని సంఘటన జీవితాన్ని మలుపుతిప్పింది. ఆలోచనలను సామాజిక సేవ వైపు నడిపింది. జాతీయ యువజన అవార్డుకు అర్హురాలిని చేసింది. తనలాంటి ఎందరో అభాగ్యుల కోసం ఓ ఫౌండేషన్ స్థాపించేలా చేసింది. ఖండేరావు సుధారాణి జీవితం ఒక స్ఫూర్తి పాఠం.
ఖండేరావు సుధారాణి.. పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా కట్టా రాంపూర్‌లో. తొమ్మిదేండ్ల వయసులోనే తల్లిదండ్రులు మరణించారు. అయినవారెవరూ ఆదరించలేదు. ఆ నిరాశ జీవితంమీద విరక్తిని కలిగించింది. ఆత్మహత్యకు పురిగొల్పింది. ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ కరీంనగర్ నుంచి కాజీపేట రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. పట్టాలపై దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్తున్న సమయంలో.. తనను ఎవరో పిలిచినట్లు అనిపించింది. వెనుదిరిగి చూసింది.. ఓ దివ్యాంగురాలు. కాళ్లూ చేతులూ లేకపోయినా బతుకుపోరాటం చేస్తున్న ఆ మహిళను చూడగానే.. చర్నాకోల ఝళిపించిన భావన. అన్నీ ఉన్నా తానెందుకు వైఫల్యాన్ని అంగీకరించాలని మనస్సాక్షి తిరగబడింది. అంతే, ఆత్మహత్య ఆలోచనను విరమించుకుంది. బతకాలని సంకల్పించింది. నలుగురినీ బతికించాలని తీర్మానించుకుంది.
తను ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశంతో ఒక వైపు చదువుకుంటూనే ఖాళీ సమయంలో బుక్ బైండింగ్ పనులు చేసేది. అప్పుడే, కేంద్ర యువజన సంక్షేమ శాఖలో ఓ కీలక విభాగమైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ పరిచయమైంది. అందులో వలంటీర్‌గా చేరింది. క్రమంగా సుధారాణి సామాజిక సేవ వైపు అడుగులు వేసింది. అదే సమయంలో నేషనల్ యూత్ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకునే అవకాశం వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సౌరశక్తి, ప్రత్యామ్నాయ ఇంధనం, సామాజిక సమస్యల పట్ల అవగాహన, బాలికా విద్య, అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ తదితర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఆ అంకితభావానికి గుర్తింపుగా అవార్డులూ అందుకున్నది.
పెండ్లి తర్వాత హైదరాబాద్ చేరుకున్న సుధారాణి తన సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించింది. ‘చేయూత వెల్ఫేర్ సొసైటీ’ అనే సామాజిక సంస్థను స్థాపించింది. ఆ ఛత్రం కింద అనాథలకు, పేదలకు విద్యా సేవలు అందిస్తున్నది. ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నది. న్యాయ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నది. కరోనా సమయంలో మలాజిగిరి చౌరస్తాలో మూడు నెలల పాటు వలస కూలీలకు ఉచిత భోజనం అందించింది. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వలంటీర్‌గా.. పర్యావరణ పరిరక్షణ, చెరువుల రక్షణ కోసం కృషిచేసింది. హయత్‌నగర్ మండలంలోని లెప్రసీ కాలనీలో కుష్ఠువ్యాధి పీడితుల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఫ్యామిలీ కౌన్సెలర్‌గా భార్యాభర్తల మధ్య తగాదాలను పరిషరించి ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది, ఎంతోమంది పసి పిల్లలు తనలా అనాథలు కాకుండా ఆదుకున్నది సుధారాణి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం, పోషక విలువల ఉద్యమాన్ని తలకెత్తుకున్నది. ఔషధాలతో పనిలేని జీవనశైలి గురించి చైతన్యం కల్పిస్తున్నది. యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద సుధారాణి జపాన్‌లో మహిళా సాధికారతపై 20 రోజులు శిక్షణ తీసుకున్నది.
సుధారాణి అనేక పురసారాలు అందుకొన్నది. నగదు పారితోషికాలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఆ మొత్తాలను తిరిగి సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తుందామె. జాతీయ యువజన అవార్డు కింద వచ్చిన రూ. 50 వేలను అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఏడేండ్ల చిన్నారి సంధ్య కంటి ఆపరేషన్‌కు ఇచ్చింది. మరో అవార్డు రూపంలో వచ్చిన రూ. 50 వేలను మహబూబాబాద్‌కు చెందిన ఓ బాలుడి గుండె సర్జరీకి అందజేసింది. ‘చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన నేను నలుగురికీ సేవ చేసే స్థాయికి చేరానంటే దానికి కారణం నాలోని కసి, పట్టుదల. ఎన్నో కష్టాలను ఓర్చుకుని ఇకడి వరకూ వచ్చాను. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒక అనాథాశ్రమం, వృద్ధాశ్రమం స్థాపించాలనేది నా జీవిత లక్ష్యం’ అంటూ
భవిష్యత్ ప్రణాళికను వివరిస్తున్నది సుధారాణి.
– మధుకర్ వైద్యుల
రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా
రతన్ టాటా భుజాలపై చేయి వేసి మరీ మాట్లాడగలిగే ఈ వ్యక్తి గురించి తెలుసా
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఉన్న గంగిరేగు చెట్టు ప్రత్యేకత ఏంటి?
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !