Delhi’s Uttam Nagar : హోలీ సందర్భంగా ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఇటీవల తరుణ్ (26) అనే యువకుడి హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు తమపై దాడికి పాల్పడినట్లు మృతుడి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ హత్యను వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు శుక్రవారం ఆందోళన బాట పట్టాయి.
భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సహా పలు సంఘాలు ఉత్తమ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద నిరసన చేపట్టాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకారులు స్థానిక రోడ్లను బ్లాక్ చేసి, నినాదాలు చేశారు. దీంతో గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఆందోళన విరమించాలని కోరినా వినకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులపై బలప్రయోగం చేసి అక్కడినుంచి చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు ఉత్తమ్ నగర్ జేజే కాలనీ పరిధిలో ఒక కారు, బైకులను తగలబెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆపేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
మరోవైపు ఇంకా ఉద్రిక్తతలు పెరగకుండా, ఘర్షణలు జరగకుండా అదనపు భద్రతా బలగాల్ని మోహరించారు. పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే, డ్రోన్లను కూడా వినియోగిస్తూ శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ఆందోళనల్లో హింసకు పాల్పడ్డ నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్తితి అదుపులోనే ఉంది. ఇక.. తరుణ్ అనే యువకుడి హత్యకు కారణమైన వారిలో నలుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు.