Trisha | దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలు మరోసారి తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారాయి. మదురై నగరంలోని పలు ప్రాంతాల్లో త్రిష రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టర్లు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, కోలీవుడ్‌తో పాటు తమిళ రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి. మదురైలో వెలిసిన పోస్టర్లలో త్రిషను ప్రజాసేవలోకి రావాలని కోరుతూ ఆసక్తికర సందేశాలు ముద్రించారు. ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావానికి తొలి వేదిక మదురై. మీనాక్షి అమ్మవారి ఆశీస్సులతో తమిళ చరిత్రలో తొలిసారిగా మా అక్క త్రిష కోసం ‘మదురై జిల్లా త్రిష నర్పణి మండ్రం’ ఏర్పాటైంది అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.
అంతేకాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకురాలిగా త్రిషను చూడాలని ఆకాంక్షిస్తూ అభిమానులు తమ మద్దతును తెలియజేశారు. ఈ పోస్టర్లు వెలుగులోకి రావడంతో త్రిష త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై త్రిష గానీ, ఆమె ప్రతినిధులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇవి అభిమానులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన పోస్టర్లా? లేక భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతమా? అనే చర్చ కొనసాగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ విజయ్‌తో త్రిషకు ఉన్న సన్నిహిత స్నేహం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. విజయ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి త్రిష పేరు పలుమార్లు రాజకీయ చర్చల్లో వినిపించింది.
ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష సోషల్ మీడియాలో చేసిన ప్రత్యేక శుభాకాంక్షల పోస్టు కూడా వైరల్ కావడంతో, వీరిద్దరి స్నేహంపై మరోసారి చర్చ మొదలైంది.త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు కొత్తవి కావు. గతంలో కూడా ఇలాంటి ప్రచారం జరిగినప్పటికీ, ఆమె ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు మదురైలో వెలిసిన పోస్టర్లతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుతం త్రిష రాజకీయ అరంగేట్రంపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోవడంతో, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఆమె లేదా ఆమె బృందం నుంచి వచ్చే ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.