senior actress prabha | ‘నీడలేని ఆడది’ సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టారు నటి కోటి సూర్యప్రభ. నాలుగు భాషల్లో శతాధిక చిత్రాల్లో కథానాయికగా అలరించి అందరి ప్రభగా వెలుగొందారు. మరోవైపు సంప్రదాయ నృత్యంతో ‘కళారత్న’గా నిలిచారు. ఒకప్పుడు వెండితెరపై వెలుగులీనిన ఈ తార ఇప్పుడు చిన్నతెర ద్వారా ‘కలిసుంటే కలదు సుఖం’ అంటూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నారు. ‘స్టార్ మా’ ద్వారా సరికొత్త ప్రయాణం మొదలుపెడుతున్నానని చెబుతున్న సీనియర్ నటి ప్రభను ‘జిందగీ’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
మాది గుంటూరు జిల్లాలోని తెనాలి. చిన్నప్పుడు హరిశ్చంద్ర, నటనాలయం వంటి నాటకాల్లో నటించేదాన్ని. ఏడో తరగతిలో ఉండగా ‘నీడలేని ఆడది’ సినిమాకోసం హీరోయిన్ కావాలని పేపర్లో ప్రకటన చూసి ఆడిషన్స్‌కి వెళ్లా. అప్పటికే మూడు సెట్లలో ఆడిషన్స్ పూర్తయ్యాయి. ఒక అమ్మాయిని ఎంపిక చేశారు కూడా. కానీ, చివర్లో నన్ను ఎంపిక చేశారు. పద్నాలుగేండ్లకే హీరోయిన్గా మంచి విజయం అందుకున్నా. తర్వాత వరుసగా సినిమా అవకాశాలు రావడంతో నా చదువు ఆగిపోయింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్గా వందకుపైగా సినిమాల్లో నటించాను. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు వంటి పెద్ద హీరోల సరసన నటించాను. ఇప్పుడు యువ హీరోలకు తల్లిగా చేస్తున్నా.
చిన్నప్పుడే సంప్రదాయ నృత్యం నేర్చుకున్నా. నటన, నాట్యం నాకు రెండు కండ్లు. సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లోనే దేశవిదేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. ఉత్తమ నృత్యకారిణిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ‘కళారత్న’ పురస్కారాన్ని అందుకున్నా. ఏడేండ్ల కిందటి వరకు ప్రదర్శనలు ఇచ్చా. ప్రత్యేకంగా నృత్య పాఠశాల పెట్టలేదు కానీ, ఎవరైనా ఆసక్తితో సంప్రదిస్తే నాట్యం నేర్పిస్తాను. కొన్ని పాటలకు నృత్యరీతులు కూడా కూర్చాను.
నేను సినిమాల్లోకి వచ్చి 40 ఏండ్లు దాటిపోయింది. ఎన్నో మంచి పాత్రలు పోషించా. నెగెటివ్ షేడ్స్ ఉన్నవి తప్ప అన్ని రకాల పాత్రలు చేశా. కొన్ని సినిమాల్లో హాస్యరస ప్రధాన పాత్రల్లోనూ కనిపించా. నటుడు చంద్రమోహన్, నాది హిట్ కాంబినేషన్. మేమిద్దరం 12 సినిమాలు చేస్తే అందులో తొమ్మిది చిత్రాలు వందరోజులు ఆడాయి. ‘దత్త దర్శనం’, ‘అష్టలక్ష్మీ వైభవం’ వంటి భక్తిరస చిత్రాలతోపాటు దర్శకుడు విఠలాచార్య సినిమాలూ చేశా. ‘తాండ్రపాపారాయుడు’, ‘రాణీ రుద్రమదేవి’ వంటి చారిత్రక సినిమాలే కాకుండా కౌబాయ్ చిత్రంలోనూ నటించా. ‘ఇదెక్కడి న్యాయం’ సినిమాకి తెలుగుతోపాటు తమిళంలో కూడా స్టేట్ అవార్డు దక్కింది. సితార, సినీహెరాల్డ్ వంటి చాలా అవార్డులు వచ్చాయి. ప్రతిష్టాత్మకంగా భావించే నంది పురస్కారాలు మూడుసార్లు అందుకున్నా.
స్టార్ మాలో ప్రసారం కాబోతున్న ‘కలిసుంటే కలదు సుఖం’ సీరియల్ ద్వారా కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా. ప్రస్తుతం సీరియళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇదివరకు తమిళంలో రాడాన్ ప్రొడక్షన్లో ‘ఆనందం’ అనే సీరియల్లో నటించాను. తెలుగులో ఇదే నా మొదటి సీరియల్. ‘కలిసుంటే కలదు సుఖం’ కథ నాకు బాగా నచ్చింది. ఇందులో గీతగా ప్రధాన పాత్రలో కనిపిస్తా. భర్తను పోగొట్టుకున్న ఒంటరి మహిళ ఆరు పదుల వయసులో కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు, మనవలు, మనవరాళ్లతో కూడిన పెద్ద కుటుంబంలో మనస్పర్ధలు రాకుండా ఎలా నియంత్రిస్తుందనేదే ఈ సీరియల్ కథ. ఎన్నో మలుపులు, భావోద్వేగాలతో సాగే కథనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నా.
మా వారి పేరు రమేష్. మాది షిప్పింగ్ క్లియరింగ్ బిజినెస్. మాకొక అబ్బాయి. అమెరికాలో స్థిరపడ్డాడు. పరిశ్రమలో నాకు బాగా సన్నిహితులంటే జయప్రద, జయసుధ. రాధిక కూడా మంచి స్నేహితురాలు. దాసరి నారాయణరావుగారు ఉన్నంతకాలం మా కుటుంబాన్ని ఎంతో ఆదరించారు. ప్రస్తుతం సుమంత్ హీరోగా వస్తున్న ‘అనగనగా ఓ రౌడీ’ సినిమాలో నటిస్తున్నా. సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో చేయమని చాలామంది అడుగుతున్నారు. ఇంతమంది అభిమానాన్ని పొందగలగడం నా అదృష్టంగా భావిస్తా.
చాలా మారింది
అప్పటితో పోలిస్తే ఇప్పుడు సాంకేతికంగా చాలా మార్పులొచ్చాయి. టెక్నాలజీ బాగా పెరిగింది. అప్పుడు ఇవేవీ లేకున్నా కష్టపడి మంచి మంచి సినిమాలు తీశారు. ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో నిర్మించిన ‘మాయాబజార్’ని ఇప్పటితరం కూడా చూస్తుంది. నేటి దర్శకులకు అదొక పాఠ్యపుస్తకం లాంటిది. ఇప్పుడు టెక్నాలజీతో చాలా పాత్రల్ని సృష్టిస్తున్నారు. ‘అష్టలక్ష్మీ వైభవం’లో తొమ్మిది పాత్రల్లో నటించా. ‘దాన వీర శూర కర్ణ’లో విభిన్నమైన పాత్ర పోషించాను. అప్పట్లో నిబద్ధతకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎంత పెద్ద హీరో అయినా చెప్పిన సమయానికి సెట్లో ఉండేవారు. ఇప్పటి తరం హీరోలు కూడా చాలా కష్టపడుతున్నారు. డ్యాన్స్, ఫైట్స్ ప్రాణం పెట్టి చేస్తున్నారు. తరం మారింది. జనం మారారు. మనం కూడా మారాలి.
✍ ప్రవళిక వేముల
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పిల్లలను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..
భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడిన దుర్గవ్వ ఎవరో తెలుసా
విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు : ఇండియన్ ఐడల్ సింగర్ షణ్ముఖ ప్రియ
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..
gongadi trisha | క్రికెట్లో యువ సంచలనం మన తెలంగాణ అమ్మాయి త్రిష..
Matilda Kullu | వ్యాక్సిన్లు వేసే ఆశావర్కర్ ఫోర్బ్స్ జాబితాలోకి.. ఎలా సాధ్యమైంది?