న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలో నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ ప్రకటించింది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో కూడా ఒక దశలో ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది. పశ్చిమబెంగాల్‌కు మాత్రం రెండు విడతల్లో ఏప్రిల్ 23, 29న ఎన్నికలు జరుగనున్నాయి. మే 4న అన్ని రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఐదు రాష్ర్టాలు, యూటీల్లోని మొత్తం 824 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, 17.4 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారని వెల్లడించారు. ఎన్నికల్లో పారదర్శకత పెంచేందుకు గత ఏడాది కాలంలో ఈసీ అనేక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అందులో భాగంగానే, అర్హుడు కాని ఏ ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితాలో ఉండకుండా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టినట్టు వివరించారు. అలాగే మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాల వెలుపల ఉంచుతామని, ఓటింగ్ తర్వాత వాటిని తీసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఈ రాష్ర్టాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఓట్ల కౌంటింగ్‌లో పారదర్శకత పెంచేందుకు పలు చర్యలు చేపట్టినట్టు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఈవీఎం కౌంటింగ్ పూర్తయ్యే రెండు రౌండ్లకు ముందే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి చేస్తామని చెప్పారు. కౌంటింగ్ పూర్తయిన 72 గంటల్లోగా, ఎన్నికలకు సంబంధించిన మొత్తం గణాంకాలను ఈసీఐనెట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ బూత్‌లలో 100 శాతం వెబ్‌కాస్టింగ్ ఉంటుందని చెప్పారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ గడువు మే 7న, తమిళనాడు మే 10, అస్సాం మే 20, కేరళ మే 23, పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15న ముగియనున్నది. బెంగాల్లో 6.4 కోట్ల మంది , తమిళనాడులో 5.67 కోట్లు, కేరళలో 2.7 కోట్లు, అస్సాంలో 2.5 కోట్లు, పుదుచ్చేరిలో 9.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ఈ ఐదు రాష్ర్టాల ఎన్నికలతోపాటే పలు రాష్ర్టాల్లో శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ తెలిపారు. గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపురలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలోని మూడు శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనున్నట్టు చెప్పారు. మే 4న ఫలితాలు ప్రకటించనున్నట్టు వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తే, మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టిస్తారు. ఇంతకుముందు దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఐదుసార్లు సీఎంగా ప్రమాణం చేశారు. అయితే ఆమె 1991-2006 మధ్య వేర్వేరు సమయాల్లో సీఎంగా ఉన్నారు. వరుసగా ముఖ్యమంత్రిగా లేరు. మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నది. సర్‌తో ఓట్లను తొలగిస్తున్నారని, రాష్ర్టానికి నిధులు విడుదల చేయట్లేదని, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎగదోస్తున్నారని, గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని బీజేపీపై మమత విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నది. వామపక్షాలు, కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతున్నాయి.
గత 60 ఏండ్లలో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అధికారంలోకి రాని ఏకైక రాష్ట్రం ఇది. ఇప్పటివరకు డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ప్రధాన పోటీ సాగుతుండగా, తాజాగా నటుడు విజయ్ రంగ ప్రవేశంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. జయలలిత నెచ్చెలి శశికళ కూడా కొత్త పార్టీ పెట్టారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ధీమాగా ఉన్నారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వంను పార్టీలోకి చేర్చుకున్నారు. మరోవైపు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని అన్నాడీఎంకే భావిస్తున్నది. ప్రత్యామ్నాయ శక్తిగా మారుతామంటూ రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్.. ఏ మేరకు ప్రభావం చూపుతాడో చూడాలి. విజయ్ను ఎన్డీయే కూటమిలోకి చేర్చుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. ఇందులో భాగంగా ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసినట్టు సమాచారం.
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో గత పదేండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నది. హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మూడోసారి అధికారంలోకి రావాలని పార్టీ భావిస్తున్నది. ఈసారి 100కుపైగా సీట్లలో నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రధాని మోదీ గత ఆరు నెలల్లో మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీ.. తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, బహిష్కరణలు, సరిహద్దు భద్రత వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అయితే పార్టీ ఫిరాయింపులు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి.
దేవభూమి కేరళలో ఇదివరకు ప్రతి ఐదేండ్లకొకసారి ప్రభుత్వం మారే సంప్రదాయం ఉండేది. అయితే 2021లో సీఎం విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రండ్(ఎల్డీఎఫ్) ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేసింది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ఉవ్విళ్లూరుతున్నది. పదేండ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)కు ఈ ఎన్నికలు చావోరేవోగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నది. మరోవైపు, బీజేపీ ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ సీటులో కూడా విజయం సాధించలేదు. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం త్రిసూర్ స్థానంలో గెలుపొందింది.
2021లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, ఏఐఎన్ఆర్సీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్ రంగస్వామి మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వంలో బీజేపీ నేరుగా భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి. డీఎంకేతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని పట్టుదలగా ఉన్నది .