నిజామాబాద్, మార్చి 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుభరోసా అమలుపై మరో ప్రచారం వెలుగులోకి వచ్చింది. యాసంగి సీజన్ ప్రారంభం నుంచి మూడు, నాలుగు దఫాలుగా ఫేక్ ప్రచారాలకు తెర లేపిన కాంగ్రెస్ పార్టీ తాజాగా మరోసారి తేదీలు ఖరారు చేసినట్లుగా ప్రకటనలు వెలువడ్డాయి. ఎన్నికల ముందు హడావిడి చేసి ఓట్లు రాబట్టుకున్న హస్తం పార్టీ ఆ తర్వాత పెట్టుబడి సాయంపై మోనం వహించిం ది. వరి పంట పొట్ట దశ నుంచి కోత దశకు చేరుతున్న క్రమంలో రైతుభరోసా సాయం ఇస్తామంటూ ప్రచారం జరుగుతుండటంపై రైతులు అయోమయానికి గురవుతున్నారు.
గతంలోనూ ఈ విధంగానే ప్రచా రం చేసి మొండి చేయి చూపించారని రైతు లు లబోదిబోమంటున్నారు. యాసంగికి నగదు సాయం అందుaతుందో? లేదో? దేవుడికే తెలియాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా ప్రచారం మేరకు రైతుభరోసా మొదటి విడత నిధులను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22న విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నట్లుగా సీఎం నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. తొలి విడుతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో విడుతగా మరో 20 రోజుల తర్వాత, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడుతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి.
అప్పులు చేసిన రైతులు…
కాంగ్రెస్ పరిపాలనలో రైతులకు అరిగోస తపa్పడం లేదు. పెట్టుబడి సాయం ఠంచనుగా వస్తుందనుకుంటే రెండున్నరేళ్లుగా అమలుకే నోచుకోవడం లేదు. ఎన్నికలు ఉంటే ఓ రకంగా… లేకుంటే మరో విధంగా పెట్టుబడి సాయం పథకం మనుగడ సాధిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఐదు సీజన్ పంట కాలాలు పూర్తవుతుండగా ఇందులో పూర్తి స్థాయిలో కేవలం 2 సీజన్లకే రైతుభరోసా అమలైంది. మూడు సీజన్లకు రైతుభరోసా ఎగ్గొట్టారు. ఇస్తానని చెప్పిన ఎకరానికి రూ.15వేలును రూ.12వేలకు కోత పెట్టినప్పటికీ అది కూడా సరిగా అమలు చేయలేక పోతున్నారు.
వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మొదలు పెడితే సీఎం రేవంత్ రెడ్డి వరకు ద్వంద ప్రకటనలు చేస్తూ నిత్యం రైతులతో ఆటలాడుకుంటున్నారు. రైతుభరోసా అవసరం లేదని మంత్రి తుమ్మల నోటికొచ్చినట్లుగా గతంలో మాట్లాడారు. సాగు భూములకే పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ఆ తర్వాత 5 ఎకరాల్లోపు సాగుదారులకే వర్తింపజేస్తామని చెప్పారు. సీన్ కట్ చేస్తే ఏ విధానాన్ని సరిగా అమలు చేయలేక కాంగ్రెస్ సర్కారు చేతులు ఎత్తేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూటకో విధంగా మాట్లాడుతూ రైతులను గందరగోళంలో పడేస్తున్నారు. రైతుభరోసా, రుణమాఫీ అమలు చేశాం… రైతులకు అందిందో… లేదో…? అంటూ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అధికారంలోకి రావడానికి ముందు కేసీఆర్ పాలనపై విష ప్రచారం చేశారు.
ఏడాదికి మూడు పంటలకు పెట్టుబడి సాయం వర్తింపజేయాలని ప్రగల్భాలు పలికారు. గద్దెనెక్కిన తర్వాత రైతుభరోసాను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రైతులకు అప్పుల కుప్పలు ఉండేవి. తీర్చలేక భూములు అమ్ముకునేది. అప్పులు కట్టలేక ఏకంగా తనువు చాలించిన సంఘటనలున్నాయి. పెట్టుబడి సాయం అమలు చేయకపోవడంతో పెట్టుబడికి చిల్లి గవ్వ కరువైన సన్న, చిన్నకారు రైతులంతా ఇప్పుడు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండగా రైతు భరోసా అమలు కాకపోవడంతో వారిలో భయం వెంటాడుతోంది.
కోత దశలో పెట్టుబడి సాయమా?
పెట్టుబడి సాయం పంట సాగు సమయంలో అందించాల్సి ఉండగా కోత దశలో రైతులకు అందిస్తామంటూ ప్రభుత్వం చెబుతుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రచారం మినహా నిజాయతీగా రైతుభరోసా అందించిన దాఖలాలే కాంగ్రెస్ పార్టీకి లేకపోవడంతో కర్షకులు నమ్మకం వదులుకున్నారు. బ్యాంక్ ఖాతాల్లో పెట్టుబడి సాయం వచ్చేంత వరకూ విశ్వాసం లేదంటూ చెప్పుకుంటున్నారు. వచ్చినప్పుడు చూద్దాంలే… అన్నట్లుగా రచ్చబండ వద్ద రైతులు ముచ్చట్లలో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతులపై మమకారం ఉంటే సమయానికి ఠంచనుగా రైతుభరోసా అందించేవారని రైతులు భావిస్తున్నారు.
ఆలస్యంగా రైతుభరోసా అమలుకు సిద్ధం అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న దరిమిలా మొదటి విడతకు 2వ విడతకు మధ్య 20 రోజులు సమయం తీసుకుంటుండటంతో కర్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చివరి విడతను ఏప్రిల్ నెలాఖరు అని చెప్పడంపైనా గందరగోళం నెలకొంది. రైతుభరోసాను వెనువెంటనే భూ విస్తీర్ణాన్ని అనుసరించి రోజువారీగా వరుసగా అమలు చేస్తే నమ్మకం ఉండేదని రైతులు అంటున్నారు. అందుకు భిన్నంగా మూడు, నాలుగు వారాల జాప్యంతో అమలు చేస్తామని చెబుతుండటంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా రైతుభరోసా అమలుకు మరోసారి ప్రచారం పర్వం మొదలు పెట్టడంతో రైతులు తీవ్ర గందరగోళంలో మునిగి తేలుతున్నారు. వరి పంట కోత సమయానికి రైతుభరోసా అమలుకు శ్రద్ధ వహించడంపై రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు.