e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home News విజ‌య్ దేవ‌ర‌కొండ ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాడు : ఇండియ‌న్ ఐడ‌ల్ సింగ‌ర్ ష‌ణ్ముఖ ప్రియ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాడు : ఇండియ‌న్ ఐడ‌ల్ సింగ‌ర్ ష‌ణ్ముఖ ప్రియ‌


Indian Idol 12 singer shanmukha priya | అప్పుడెప్పుడో ‘పాడుతా తీయగా’ వేదికపై పల్లవించిన గమకాలు.. తాజాగా ఇండియన్‌ ఐడల్‌ షోలో ప్రతిధ్వనించాయి. తెలుగువారి ప్రతిభను మరోసారి నిరూపించాయి. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్‌.. భాష ఏదైనా, క్లాసికల్‌, వెస్ట్రన్‌, రాక్‌, పాప్‌, జాజ్‌.. జానర్‌ ఏదైనా షణ్ముఖ్ర పియ పాడితే సప్తస్వరాలు పోటీపడి పలుకుతాయి. ఇండియన్‌ ఐడల్‌ టైటిల్‌ గెలుచుకోలేకపోయినా, దేశవ్యాప్తంగా అంతకు మించిన అభిమానాన్ని సొంతం చేసుకున్న స్టార్‌ సింగర్‌ షణ్ముఖ్ర పియను ‘జిందగీ’ పలకరించింది.

2021 ఆగస్టు 15, ఆదివారం.. మధ్యాహ్నం 12 గంటలు. ఇండియన్‌ ఐడల్‌ 12వ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలె మొదలైంది. వేదికపై పవన్‌దీప్‌ రాజన్‌, అరుణిత కంజిలాల్‌, నిహాల్‌, సేలీ కాంబ్లే, మహ్మద్‌ దనిష్‌ వంటి టాప్‌ ఫైనలిస్టులు. వారిలో ఒకరు తెలుగింటి అమ్మాయి షణ్ముఖప్రియ. ఆమె స్టేజీ మీదికి రాగానే చీరప్‌ చేయడానికి వీడియోలో ప్రత్యక్షం అయ్యాడు విజయ్‌ దేవరకొండ.
‘హే! షణ్ముఖ ప్రియా ఎట్లున్నవ్‌’ అనగానే, బ్యాక్‌గ్రౌండ్‌లో అర్జున్‌రెడ్డి థీమ్‌ మ్యూజిక్‌. ఒక్కసారిగా కోలాహలం. షణ్ముఖ ముఖంలో వెయ్యి ఓల్టుల కాంతి. ‘ఇవాళ జరిగే గ్రాండ్‌ ఫినాలెలో నువ్‌ కచ్చితంగా గెలుస్తున్నవ్‌. మొదట్నుంచీ నీ పాటలు వింటున్నాం. అన్నీ మర్చిపోయి, ఈ ఫినాలెలో బ్లాస్టింగ్‌ ప్రదర్శనతో ఇరగదియ్యాలి. ఒకవేళ ఓడిపోయినా బాధపడకు. వెంటనే హైదరాబాద్‌ వచ్చెయ్‌. నేను నీకు అవకాశం ఇస్తా. నా సినిమాలో నువ్వు పాట పాడాలి. ఇదే నా గిఫ్ట్‌. ఆల్‌ ది వెరీబెస్ట్‌’ అంటూ కోట్లాది ప్రేక్షకుల సాక్షిగా ధైర్యం ఇచ్చాడు విజయ్‌ దేవరకొండ.

- Advertisement -

ఫైనల్స్‌లో షణ్ముఖ ప్రియ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. టైటిల్‌ సొంతం చేసుకోలేక
పోయినా, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. నేరుగా హైదరాబాద్‌కు వచ్చిన షణ్ముఖ కుటుంబానికి సాదర స్వాగతం పలికింది దేవరకొండ కుటుంబం. మాట ప్రకారం తన
‘లైగర్‌’లో షణ్ముఖతో ఒక పాట పాడించాడు విజయ్‌. ఆ విశేషాలన్నీ షణ్ముఖ మాటల్లోనే..

“2020 నవంబర్‌ 28న ప్రారంభమైన ఇండియన్‌ ఐడల్‌-12వ సీజన్‌ 9 నెలల పాటు సంగీత ప్రియులను అలరించింది. ఈ షో ద్వారా నేను కోట్లాది మందికి చేరువయ్యాను. కలలో కూడా ఊహించని విధంగా సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ నుంచి అనేక అవకాశాలు వస్తున్నాయి. ఇండియన్‌ ఐడల్‌ అందించిన ధైర్యంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నాను. హైదరాబాద్‌లో జరిగే లైవ్‌ కచేరీలకూ అద్భుతమైన స్పందన వస్తున్నది.

నా కోసం విజయనగరం వదిలి..

నేను పుట్టింది విజయనగరంలో. నాన్న శ్రీనివాస్‌ కుమార్‌, అమ్మ రమాలత. అమ్మ మ్యూజిక్‌ టీచర్‌. నాన్న వీణ, మాండలిన్‌, గిటార్‌, కీబోర్డ్‌, వయోలిన్‌ వాద్యకారుడు. ఇద్దరూ కళాకారులే కావడంతో చిన్నప్పటి నుంచీ సంగీతంపై ఇష్టం పెరిగింది. నాలుగో ఏటనే నాలోని గాయనిని గుర్తించారు అమ్మానాన్న. నా కోసం విజయనగరం వదిలి శ్రీకాకుళం వచ్చారు. అక్కడి నుంచి వైజాగ్‌కు వచ్చేశారు. వాళ్లే నా సంగీత గురువులయ్యారు. కర్ణాటక సంగీతం, జాజ్‌, రాక్‌, పాప్‌లో ప్రావీణ్యం సాధించాను. చిన్నప్పుడు ‘తేజం’ సినిమాలో నటించా. ఆరేండ్ల వయసు నుంచీ వేదికల మీద పాడేదాన్ని. పాడుతా తీయగా, సారేగామ లిటిల్‌ చాంపియన్స్‌ 2017, సూపర్‌ సింగర్‌, ది వాయిస్‌ ఇండియా కిడ్స్‌ లాంటి పోటీల్లో నా ప్రతిభను నిరూపించుకున్నా.

రెండుసార్లు గోల్డెన్‌ మైక్‌!

ఇండియన్‌ ఐడల్‌ 12వ సీజన్‌కు ఆడిషన్స్‌ జరుగుతుండగా, నేను మొదటి రౌండ్‌లోనే గోల్డెన్‌ మైక్‌ సొంతం చేసుకున్నా. దీంతో నేరుగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కింది. తర్వాత రెండో రౌండ్‌ ఎంపికలోనూ మళ్లీ గోల్డెన్‌ మైక్‌ గెలుచుకున్నా. అప్పటినుంచి నిర్వాహకులు నా పట్ల శ్రద్ధ తీసుకున్నారు. షో మొదటి నుంచి ఫైనల్స్‌ వరకూ నేను వందశాతం బెస్ట్‌ ఇచ్చా. సోషల్‌ మీడియాలో ఏవేవో మాట్లాడినా నేనెప్పుడూ పట్టించుకోలేదు. అమితాబ్‌ వంటి బాలీవుడ్‌ దిగ్గజ నటులు, గాయకులు, సంగీత దర్శకులు నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహరి స్వరపరిచిన ‘జూమ్‌ జూమ్‌ జూమ్‌ బాబా’ పాట పాడితే కంటెస్టెంట్లు, జడ్జీలు, గెస్టులు ఊర్రూతలూగిపోయారు. బప్పి లహిరి సార్‌ నన్ను ఎంతో ప్రశంసించారు. దర్శకుడు ఒమంగ్‌ కుమార్‌ నా ప్రతిభ చూసి తన సినిమాలో అవకాశం ఇచ్చారు. ‘మిస్టర్‌ ఇండియా’ చిత్రంలో పాడిన కవితా కృష్ణమూర్తి ‘ఆస్కార్‌ విన్నింగ్‌ పెర్ఫార్మెన్స్‌’ అంటూ మెచ్చుకున్నారు. ‘హమ్మా హమ్మా’, ‘దమ్‌ మారో దమ్‌’ వంటి పాటలు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.

పాడామా, లేదా? అంతే..

నాకు గెలుపు, ఓటమితో సంబంధం లేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామా? లేదా? అన్నదే నా పాయింట్‌. నా మొదటి ప్రయత్నం జీ ‘సరిగమప లిటిల్‌ చాంప్స్‌’తో మొదలైంది. అందులో ఫైనలిస్ట్‌గా నిలిచాను. తమిళం పూర్తిగా రాకపోయినా ‘తమిళ్‌ సూపర్‌ సింగర్‌ జూనియర్‌’లో విజేతగా నిలిచా. తర్వాత పాడుతా తీయగా, మా సూపర్‌ సింగర్‌-4,
మా సూపర్‌ సింగర్‌-9, ది వాయిస్‌ ఆఫ్‌ ఇండియా కిడ్స్‌, హిందీ ‘సరిగమప లిటిల్‌ చాంప్స్‌’ వరకూ అన్నిటిలోనూ రన్నరప్‌గా నిలిచా. భాషా భేదం లేకుండా అవకాశం ఉన్నచోటల్లా పాడుతూనే ఉన్నా. ప్రతి పాటా బహుమతిని ఇవ్వకపోవచ్చు. కానీ, ప్రతి పాటలో ఆనందాన్ని పొందాను.

చదువుకు ఆటంకం లేకుండా..

చదువును, సంగీతాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటున్నా. నాకు ఇంటర్‌లో 9.7 గ్రేడ్‌ వచ్చింది. ప్రస్తుతం డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నా. భవిష్యత్తులో ఉద్యోగంలో చేరినా పాటలు విడిచిపెట్టను. ఇండియన్‌ ఐడల్‌ ద్వారా దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. అహ్మదాబాద్‌, లక్నో, ఇండోర్‌, నేపాల్‌లో ఇవ్వాల్సి ఉంది. ఎస్పీ బాలుగారిలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక. ‘పాడుతా తీయగా’లో నన్ను ఎంతగానో మెచ్చుకున్నారాయన. ‘లైగర్‌’ డైరెక్టర్‌ పూరీ సార్‌, సహ నిర్మాత చార్మికౌర్‌, హీరో విజయ్‌ ఫ్యామిలీ నాపై చూపిన ప్రేమను మర్చిపోలేను. ప్లేబ్యాక్‌ సింగర్‌గా నాకు టాలీవుడ్‌లో మొదటిసారి అవకాశం ఇచ్చింది లైగర్‌ టీమ్‌. పాట అద్భుతంగా వచ్చింది. మీరంతా చాలా ఎంజాయ్‌ చేస్తారు. ‘లైగర్‌’లో మొదటి పాట పాడినా.. ‘అడవి దొంగ’లో పాడిన పాట మొదట విడుదల అవుతుందేమో”

మా బిడ్డను ఆదరించండి

ఇన్నాళ్లూ మీ ఇంటిబిడ్డగా మా కూతుర్ని ఆదరించారు. ఇకపైనా అదే ప్రేమను చూపిస్తారని ఆశిస్తున్నాం. బిడ్డల కలల్ని సాకారం చెయ్యడం తల్లిదండ్రుల బాధ్యత. దానిని మేం సక్రమంగా నిర్వర్తించాం. హైదరాబాద్‌ నుంచి విదేశాల వరకూ షణ్ముఖ అనేక ప్రదర్శనలు ఇస్తున్నది. తనను ఓ మంచి ప్లేబ్యాక్‌ సింగర్‌గా చూడాలని కోరుకుంటున్నాం.

– రమాలత, శ్రీనివాస్‌

…? డప్పు రవి

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్‌స్పిరేష‌న్‌.. ఐఏఎస్ సాధించ‌డ‌మే కాదు..

gongadi trisha | క్రికెట్‌లో యువ సంచ‌ల‌నం మ‌న తెలంగాణ అమ్మాయి త్రిష‌..

Matilda Kullu | వ్యాక్సిన్లు వేసే ఆశావ‌ర్క‌ర్ ఫోర్బ్స్ జాబితాలోకి.. ఎలా సాధ్య‌మైంది?

rema rajeshwari | ఫోర్బ్స్‌ జాబితాలో.. తెలంగాణ ఐపీఎస్‌

యాభై ఏళ్ల వ‌య‌సులో బిజినెస్ స్టార్ట్ చేసి.. వంద‌ల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నహైద‌రాబాదీ మ‌హిళ‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement