Dr. Mannam Gopichand | ఆగిపోతున్న గుండెల్లో ఆశావాదం నింపుతారు. మెల్లగా కొట్టుకుంటున్న గుండెలకు ఆరోగ్యవంతమైన పరుగు నేర్పుతారు. చిల్లులు పడిన గుండెలకు స్వస్థత ఇస్తారు. అలసిన హృదయా నికి కొత్త ఉదయాన్ని పరిచయం చేస్తారు. ఆ చేతిలో పడితే.. గుండెకు గండం తప్పినట్టే! ఆయనకు లబ్డబ్ల భాష తెలుసు, గుప్పెడు గుండె గుట్లన్నీ ఎరుకే. హృద్రోగ నిపుణులు వీధికొక్కరు ఉండవచ్చు. కానీ, డాక్టర్ మన్నం గోపిచంద్లాంటి హృదయమున్న వైద్యులు నూటికో కోటికో ఒక్కరు. పదిహేడు సంవత్సరాలలో ఆయన ఆరువేల పసిగుండెలను బతికించారు. పన్నెండువేల పుత్రశోకాల్ని నిలువరించారు. ‘జాతీయ వైద్యుల దినోత్సవం’ సందర్భంగా డాక్టర్ మన్నం గోపిచంద్ నేతృత్వం లోని ‘హృదయ ఫౌండేషన్’ సేవా ప్రస్థానం గురించి..
మా పేర్లు.. సీహెచ్ సంపత్, స్వరూప. మాది పెద్దపల్లి. కొడుకు పుట్టగానే ఇంట్లో పండగ చేసుకున్నాం. సుశాంత్ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాం. కానీ ఆ ఆనందం మూడు నెలలకే ఆవిరైపోయింది. బాబుకు తరచూ ఏదో ఓ ఆరోగ్య సమస్య. ఊపిరి తీసుకునేందుకు కూడా ఆయాసపడేవాడు. చిన్న పిల్లలకొచ్చే సాధారణ సమస్యలే అనుకుని కరీంనగర్‌లోని ఓ దవాఖానకు తీసుకుపోయాం. మందులు వాడినా తగ్గలేదు. మళ్లీ వెళ్లాం. ఈసారి, బాబు గుండెకు రంధ్రం ఉందని తేల్చారు. ఆపరేషన్‌కు ఆరు
లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత డబ్బు చెల్లించలేని పరిస్థితి. బిడ్డ దూరమైతే మేం కూడా చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాం. దేవుడి దయవల్ల, ఒక డాక్టర్ సలహాతో హృదయ ఫౌండేషన్ గురించి తెలిసింది. ఓ కాగితం మీద అడ్రస్ రాసుకొని అందరినీ అడుక్కుంటూ.. బంజారాహిల్స్‌లోని ‘హృదయ ఫౌండేషన్’కు చేరుకున్నాం. ప్రేమగా పలకరించారు. అన్ని రకాల పరీక్షలతో పాటు ఆపరేషన్ కూడా ఉచితంగా చేశారు. బిడ్డకు పునర్జన్మనిచ్చారు. ఇప్పుడు మా బాబుకు పన్నెండేళ్లు. ఆరో తరగతి చదువుతున్నాడు. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్ గోపిచంద్ గారు ఆయువు పోసింది మా బాబుకే కాదు.. వాడే సర్వస్వం అనుకున్న మా ఇద్దరికి కూడా.
హైదరాబాద్, వారాసిగూడ సమీపంలోని మహ్మద్గూడలో ఉంటాం. నా పేరు బేగం. నా భర్త సయ్యద్ హుస్సేన్. మా కలల పంటగా ఓ బిడ్డ పుట్టింది. మా ఆనందానికి అవధుల్లేవు. కానీ పసిదాని గుండెకు రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పారు. మా గుండెలే ఆగినంత పనైంది. పాప ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆ మాట తలచుకుని ఏడవని క్షణం లేదు. కండ్ల ముందున్న బిడ్డను చూసి మురిసిపోవాలా? ఏదో ఒక రోజు ఆ బిడ్డ మా నుంచి దూరం అవుతుందని కుమిలిపోవాలా? ఆ చీకటి రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటే, ఇప్పటికీ మా నోట మాట రాదు. ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకూ రాకూడదు. ఆపరేషన్ చేయాలంటే పది లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత డబ్బు సమకూర్చడం మాకు సాధ్యం కాదు. అలా అని, పాప దూరమైతే తట్టుకునే శక్తీ లేదు. అల్లాపైనే భారం వేశాం. ఆ సంక్షోభ సమయంలో మాకు హృదయ ఫౌండేషన్ గురించి తెలిసింది. కోటి ఆశలతో ఫౌండేషన్ వారిని ఆశ్రయించాం. బిడ్డ ప్రాణాలు నిలబడటానికి అవసరమైన శస్త్రచికిత్సలన్నీ చేశారు. ఇప్పుడు పాపకు నాలుగేండ్లు. ముద్దుముద్దు మాటలతో, గలగల నవ్వులతో మా ఇంటికి కొత్త వెలుగులు తెచ్చింది. బిడ్డకు ఊపిరిపోసిన హృదయ ఫౌండేషన్వారికి, డాక్టర్ గోపిచంద్ సార్‌కు ఎల్లకాలం రుణపడి ఉంటాం.
మాది కడప జిల్లా. నా పేరు ఉదయ్ కుమార్. మా కలల పంటగా ఓ కొడుకు పుట్టాడు. ఊపిరిపోసుకున్న వారం రోజులకే ఊపిరి తీసుకోవడం కష్టమైంది. బిడ్డ నరకయాతన పడ్డాడు. డాక్టర్లు పరీక్షించి గుండెలో చిన్న రంధ్రం ఉందని తేల్చారు. ఒకటి, రెండు కాదు.. మూడు ఆపరేషన్లు చేయాలన్నారు. మాది నిరుపేద కుటుంబం. మా పరిస్థితిని అర్థం చేసుకున్న డాక్టర్ రవిచంద్ర హైదరాబాద్‌లోని హృదయ ఫౌండేషన్ గురించి చెప్పారు. వెంటనే వెళ్లి మా గోడు వెళ్లబోసుకున్నాం. ఉచితంగా ఆపరేషన్ చేసి మా బాబును బతికించారు. గోపిచంద్ సార్‌కు కృతజ్ఞతలు.
…ప్రసవం అనేది బిడ్డకు జన్మ అయితే, తల్లికి పునర్జన్మ. అప్పుడే భూమి మీదికొచ్చిన తన ప్రతిరూపాన్ని చూడగానే ఆ తల్లి అప్పటిదాకా అనుభవించిన వేదనంతా మరిచిపోతుంది. హృదయం పొంగిపోతుంది. అంతలోనే, పసిగుడ్డు గుండె సరిగా పని చేయడంలేదని తెలిస్తే.. మాతృ హృదయం ఎంత తల్లడిల్లుతుందో? ఆ చిట్టిగుండె శస్త్రచికిత్సకు లక్షల రూపాయలు కావాలని తెలిస్తే ఎన్ని కన్నీళ్లు పెట్టుకుంటుందో? దేశంలో ఏటా రెండు లక్షల మందికిపైగా చిన్నారులు హృద్రోగంతోనే భూమి మీదికి వస్తున్నారు. రెక్కాడితేకానీ డొక్కాడని నిరుపేద కుటుంబాల్లోనే ఇలాంటి కేసులు ఎక్కువ. బతుకే దినదినగండమైన బతుకులు వారివి. ఇక పసి గుండెనేం కాపాడుకుంటారు? 2004 ఆగస్టులో హైదరాబాద్‌లో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వెయ్యి మంది చిన్నారులతో ఓ ప్రదర్శన జరిగింది. ఆ సంఘటన గోపిచంద్‌ను కదిలించింది. అప్పుడే, అభం శుభం తెలియని చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే భావసారూప్యం ఉన్న మిత్రులు.. డాక్టర్ యుగంధర్ మేక, డాక్టర్ రాజగోపాల రాజు, డాక్టర్ మిత్ర, జైరాజ్ కుమార్, డాక్టర్ నాగార్జున పొనుగోటి తదితరులతో కలిసి 2005లో ‘హృదయ క్యూర్ ఎ లిటిల్ హార్ట్ ఫౌండేషన్’ను స్థాపించారు. గత పదిహేడేళ్లలో.. మరణంతో సమరం చేస్తున్న ఆరువేల మంది చిన్నారులకు ఉచితంగా, విజయవంతంగా గుండె ఆపరేషన్లు నిర్వహించారు స్టార్ హాస్పిటల్ చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ గోపిచంద్ మన్నం.
› గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పన్నెండు సంవత్సరాలలోపు నిరుపేద చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం.
› అవసరమైతే, ఆ చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించి, సాధారణ జీవితాన్ని ప్రసాదించడం.
› గుండెతో ముడిపడిన సమస్యలతో చిన్నారులు జన్మించడం వెనక కారణాలను, రుగ్మత మూలాలను గుర్తించి.. ప్రజల్లో అవగాహన కల్పించడం.
› ఈ లక్ష్యాలను సాధించేందుకు కార్పొరేట్ సంస్థలు, దాతలు, ట్రస్టులు.. ఇలా పలు మార్గాల్లో నిధులు సమీకరించడం.
› ఆపరేషన్ తర్వాత కూడా అవసరమైన వైద్య సేవలన్నిటినీ ఉచితంగా అందించడం.
గుండె శస్త్రచికిత్సలు అంటేనే వైద్యులకు సవాలు. అందులోనూ డాక్టర్ గోపిచంద్ నిరుపేదల కోసం జరిపే ఉచిత శస్త్రచికిత్సల్లో అరుదైనవి, సాహసోపేతమైనవీ అనేకం. నవజాత శిశువులకూ ఆయన ఆపరేషన్లు చేశారు. ఆ బిడ్డల గుండె మన బొటనవేలంతే ఉంటుంది. అలాంటి శస్త్ర చికిత్సలు ఎంత సంక్లిష్టమో అర్థం చేసుకోవచ్చు. ఎనిమిదేండ్లు కూడాలేని యశ్వంత్ గుండెకు పుట్టుకతోనే రంధ్రం ఉండేది. గోపిచంద్ తన నైపుణ్యంతో ఆ చిల్లును పూడ్చారు. 2017లో ఆ బాలుడికి చేసిన ఆపరేషన్ తెలుగు రాష్ర్టాల్లోనే మొదటిది. ఇలా 2005లో మొదలైన ‘హృదయ’ యజ్ఞంలో భాగంగా ఇప్పటివరకు ఆరు వేల మందికిపైగా చిన్నారులకు ఆపరేషన్లు పూర్తి చేశారు. వాళ్లంతా ప్రస్తుతం సాధారణ జీవితాన్ని గడుపుతూ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. దీంతోపాటు, ఫౌండేషన్ తరఫున ప్రజల్లో గుండె సంబంధిత సమస్యల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏ చిన్నారికి సమస్య ఉన్నట్లు గుర్తించినా వెంటనే ఉచితంగా శస్త్రచికిత్స చేస్తున్నారు.
ఆర్థిక స్తోమత లేకపోవడమనే కారణంతో.. అమ్మ కడుపున పుట్టిన బిడ్డ అంతలోనే తనువు చాలించడం హృదయ విదారకమైన విషయం. కాబట్టే, అలాంటి వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. ఆ చిన్నారి సాధారణ జీవితాన్ని గడిపేలా చేస్తున్నాం. ఒక వైద్యుడిగా, మానవతావాదిగా అత్యంత సంతృప్తినిచ్చే విషయం ఇది. ఈ యజ్ఞం ఇలానే కొనసాగాలి. హృదయ ఫౌండేషన్ అనేది ఒక వ్యవస్థగా ఎదగాలి. మరెంతోమందికి సేవలు అందించాలి. హృద్రోగంతో బాధపడుతున్న పన్నెండేళ్ల లోపు చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు, ఇతరత్రా వైద్య సేవలు అందించడం.. చిన్నపాటి టెక్నీషియన్లు మొదలు నిపుణుల వరకు వైద్యరంగంలోని వారికి ఎప్పటికప్పుడు శిక్షణ శిబిరాలు నిర్వహించడం.. హృద్రోగానికి సంబంధించి విస్తృతంగా అవగాహన శిబిరాలు ఏర్పాటుచేయడం.. వీటన్నిటికీ అనుగుణంగా లోతైన పరిశోధనలు చేపట్టడం.. ఇలా నాలుగు విభాగాలతో ఫౌండేషన్ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నది.
– డాక్టర్ గోపిచంద్ మన్నం, చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, స్టార్ హాస్పిటల్
ప్రతి ప్రాణం విలువైనదే. ప్రతి గుండె అమూల్యమైనదే. వైద్యం అందని కారణంగానో, వైద్యం చేయించే స్తోమతలేని కారణంగానో ఏ పసిబిడ్డ లబ్డబ్లూ ఆగిపోకూడదు. డాక్టర్ మన్నం గోపిచంద్ ఆలోచన ఇది. హృదయ ఫౌండేషన్ ఆశయమూ ఇదే. డాక్టర్స్‌డే సందర్భంగా.. గండాలను గెలిచిన ఆరువేల గుండెల తరఫున ఆ సేవకు సుమాంజలి.
హృదయ క్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్
8-2-615/1/ఏ,ఫ్లాట్‌నెంబర్.301,
మీనాక్షి రాయల్ కోర్ట్, రోడ్ నెం.11,
బంజారాహిల్స్, హైదరాబాద్-34.
ఫోన్- +914023314412
ఈమెయిల్: hrudaya1@gmail.com
వెబ్సైట్-www.hrudayafoundation.org
… గుండాల కృష్ణ
Gaganyaan Mission | ఇస్రో స్పేస్‌క్రాఫ్ట్ తయారీలో డాక్టర్లు.. అసలేం చేస్తారు ?”
ట్రాన్స్జెండర్ల సమస్యలపై పోరాడుతున్న డాక్టర్ త్రినేత్ర.. ఎవరీమె !!”