Dolphin Plant | డాల్ఫిన్లు నీళ్లలో ఉంటాయని తెలుసు. కానీ చెట్ల మీద ఉండటం ఎప్పుడైనా చూశారా? అదెలా సాధ్యం? అంటారా… ఆ వింతను చూడాలంటే డ్యాన్సింగ్ డాల్ఫిన్ పూల తీగను తెచ్చుకోవాల్సిందే. తీగలా పాకే ఈ మొక్కకు అచ్చం డాల్ఫిన్లను పోలిన నారింజ రంగు పువ్వులు పూస్తాయి. దూకడానికి సిద్ధంగా ఉన్నట్టూ, కాస్త వంగి నిలబడినట్లూ.. రకరకాల భంగిమల్లోని డాల్ఫిన్లను పోలి కనిపిస్తాయి. అందుకే దీనికి జంపింగ్ డాల్ఫిన్ ప్లాంట్, డ్యాన్సింగ్ డాల్ఫిన్ ప్లాంట్ అనే పేర్లున్నాయి.
నిజానికి దీని అసలు పేరు కాలమియా గ్లోరియోసా. అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలకు చెందిన ఈ మొక్క మన దేశంలోనూ చక్కగా పెరిగి దాదాపు ఏడాది పొడవునా పూలు పూస్తుంది. ఇంటిలోపల ఎండ తగిలే చోట దీన్ని ఉంచాలి. నీళ్లు కూడా మరీ ఎక్కువగా అవసరం లేదు. చిత్రమైన పూలు పూసే ఈ మొక్క, పరిసరాలకు సరికొత్త అందం తీసుకొస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
“వానాకాలం కొత్త మొక్కలేమైనా పెంచాలనుకుంటున్నారా?”