Government City College | విద్య, వైద్యం, రాజకీయం, సాహిత్యం, కళలు, క్రీడలు.. ఆ తరగతి గదులు నేర్పని విద్య లేదు. ఆ ఆవరణకో మహత్తు ఉంది. పట్టాతోనే సరిపెట్టుకోదు. గెలిచితీరాలనే పట్టుదలనూ పెంచుతుంది. ఆటగాడికి పతకాల పంట పండిస్తుంది. సాహితీ పిపాసికి సరస్వతీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టే, ఇక్కడి విద్యార్థులు అంతర్జాతీయ వేదికలపై ఓ వెలుగు వెలుగుతున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని సిటీ కాలేజ్ వందేండ్ల పండుగ సందర్భంగా.. అపూర్వ పూర్వ విద్యార్థుల పరిచయం, ప్రస్తుత ఆణిముత్యాల పరామర్శ.
సిటీ కాలేజ్ విజయాల చరిత్ర వింటే.. సీటీ మార్ అనాల్సిందే. వందేండ్ల విద్యా యాత్రలో.. ఎన్ని ఘనతలు, ఎన్ని పతకాలు, ఎన్నెన్ని రికార్డులు! పూర్వ విద్యార్థుల ప్రతిభ అపూర్వం. మహమ్మద్ యూసుఫ్(1966), మహమ్మద్ హబీబ్(1981) అర్జున అవార్డులు అందుకున్నారు. సంతోష్ కుమార్ బాస్కెట్ బాల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. లతీఫ్ మెల్బోర్న్ ఒలింపిక్స్(1956)లో, యూసుఫ్ ఖాన్ రోమ్ ఒలింపిక్స్(1960)లో సత్తా చాటారు. అహమ్మద్ హుస్సేన్ లాంటివారు ఆసియా క్రీడల్లో అద్భుతాలు చేశారు. క్రికెట్ దిగ్గజం అర్షద్ ఆయూబ్ కూడా ఆ మైదానంలోనే ప్రతిభకు పుటం పెట్టుకున్నాడు. ఇటీవల లండన్ లో జరిగిన కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్ షిప్ పోటీలలో ఈ కళాశాల విద్యార్థిని బేబీరెడ్డి కాంస్య పతకం సాధించింది. పాటియాలలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో తను రెండు సంవత్సరాలు కఠోర శిక్షణ పొందింది.
శ్వేత
సిటీ కళాశాల విద్యార్థినులు చిత్రకళలోనూ తమదైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. వూరకొండ లావణ్య, యం.పావని, హర్పాడ శ్వేత క్యాన్వాస్పై చిత్రాలు చేస్తున్నారు. కళాశాల శత వసంతాల సందర్భంగా ఆధునిక తెలుగు కవులు (లావణ్య), స్వాతంత్య్ర సమరయోధులు (పావని), చారిత్రక కట్టడాలు (శ్వేత).. తదితర ఇతివృత్తాలతో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనకు ప్రశంసల వర్షం కురుస్తున్నది. బీఏ తృతీయ సంవత్సరం విద్యార్థిని వూరగొండ లావణ్య భిన్నరంగాల ప్రముఖుల చిత్రాలకు పెన్సిల్‌తో ప్రాణంపోసింది. బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పావని మహనీయుల వర్ణచిత్రాలను మనోహరంగా గీసింది. బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి శ్వేత చారిత్రక కట్టడాలకు క్యాన్వాస్పై జీవం పోసింది. వ్యర్థాలతోనే అద్భుత కళాకృతులను రూపొందిస్తున్న బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థిని కోడూరి సౌమ్య సృజననూ మెచ్చుకుని తీరాల్సిందే. ఒకరా ఇద్దరా.. సిటీ చదువులమ్మ ముద్దుబిడ్డలు ఎంతోమంది. ‘ఈ ప్రతిభ చదువుల తల్లి కానుక’ అంటారు ఆ విద్యార్థినులు.
పావని
వూరగొండ లావణ్య
సౌమ్య
… కోయి కోటేశ్వరరావు
ఈ గులాబీలు నెలలు గడిచినా వాడిపోవు.. హైదరాబాదీ యువతి వినూత్న ఆలోచన”