Auberry Mannepalli Sahitya | చిన్నప్పుడు.. నాన్న ఆఫీస్ నుంచి రాగానే ఏదో ఒక వంటకంతో ఆయనను ఆశ్చర్యపరిచేది. ఇప్పుడు.. తన లాభాలను చూపిస్తూ తండ్రికి, భర్తకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నది.. హైదరాబాద్‌కు చెందిన మన్నేపల్లి సాహిత్య. అభిరుచినే ఆసక్తిగా, ఆసక్తినే వ్యాపారంగా మలుచుకుని.. తన కేక్స్‌తో పది బహుళజాతి సంస్థలు, మరో యాభై పెద్ద కంపెనీల నోరు తీపి చేస్తున్నది.
‘అమ్మా! ఆఫీస్‌లో పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. త్వరగా వెళ్తా’ అని ఇంట్లో చెప్పి పొద్దున్నే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కింది. పెద్దపెద్ద బేకింగ్ మెషీన్స్‌తో కేక్స్ ఎలా చేస్తారు? ధర ఎంత? హైదరాబాద్ తరలించడానికి రవాణా ఖర్చు ఏ మాత్రం ఉంటుంది? ..అనే వివరాలు తెలుసుకునేందుకే ఆ ప్రయాణం.
‘ఢిల్లీతో పోలిస్తే ముంబైలో మెషిన్ల ధర తక్కువే’ అని ఎవరో చెప్పడంతో.. మరుసటి రోజు కూడా ఆఫీస్‌కు డుమ్మా కొట్టి, అమ్మకు ఇంకో అబద్ధం చెప్పి మళ్లీ ఫ్లైట్ ఎక్కింది. ముంబైలో ధరలు ఆరా తీసింది. బాగా నచ్చడంతో.. అడ్వాన్స్‌గా శాలరీ అకౌంట్ నుంచి ఐదు లక్షలు ఇచ్చేసింది. మిగతా మూడు లక్షలూ మెషినరీ డెలివరీ తర్వాత ఇవ్వాలనేది ఒప్పందం. తనకు కేక్స్ తయారీ అంటే అంత ప్రాణం. ‘నువ్ చేసిన కేక్ అద్భుతం తల్లీ’ అంటూ నాన్న ప్రోత్సాహం.. ‘నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందక్కా’ అంటూ తోబుట్టువుల అభినందన.. ‘మేడమ్! నేను సికింద్రాబాద్ నుంచి. మీ కేక్స్ సూపరండి. ఇంకొన్ని కావాలి’ అంటూ ఆర్డర్ మీద ఆర్డర్ ఇచ్చి కస్టమర్స్ ఉక్కిరిబిక్కిరి చేసిన తీరు.. అన్నీ కలిసి సాహిత్యను కేక్
ప్రెన్యూర్‌గా మార్చాయి.
సాహిత్య పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. బీటెక్ తర్వాత.. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఐబీఎం కొలువు వరించింది. ఓసారి చెల్లిని, తమ్ముణ్ని కలుసుకునేందుకు యూఎస్ వెళ్లినప్పుడు.. రుచుల వ్యాపారంలో లాభాల గురించి తెలిసింది. అప్పుడే, ఓ బేకింగ్ కెఫే పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ ప్రయత్నంలోనే వెరైటీ కేక్స్, డిజెర్ట్స్ చేయడం నేర్చుకుంది. ఆ అనుభవంతో శాన్ఫ్రాన్సిస్కోలో చిన్న ఫుడ్‌స్టాల్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత క్యాలిఫోర్నియాలో ‘చీజ్ కేక్ ఫ్యాక్టరీ’తో కలిసి పనిచేసింది. వాళ్లు ఇండియాలో బిజినెస్ ప్రారంభించలేమని అనడంతో తనే రంగంలో దిగింది. మాదాపూర్‌లో ‘స్వీటూత్ ( sweetooth )’ పేరుతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా వివిధ సంస్థలకు కేక్స్ వగైరా సరఫరా చేసేది. అప్పుడే, కార్నివాల్ సినిమాస్ వాళ్లు కేక్స్ కోసం సాహిత్యను సంప్రదించారు. క్రమంగా ఎయిర్‌పోర్ట్‌కు కేక్స్ సరఫరా ఆర్డర్‌నూ సంపాదించింది.
కరోనా తర్వాత సాహిత్య తన వ్యాపార వ్యూహాన్ని మార్చింది. ఆన్లైన్లో కస్టమర్ల నుంచి నేరుగా ఆర్డర్లు స్వీకరించడం ప్రారంభించింది. బిగ్‌బాస్కెట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ వంటి ఆన్లైన్ వేదికల్లోకి కూడా వచ్చింది. ఇ-కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ‘ఫ్లేకీ బేక్స్’ పేరుతో ఓ బ్రాండ్‌ను సృష్టించుకుంది. ఆఫ్‌లైన్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘ఆబెర్రీ’ పేరుతో మరో బ్రాండ్‌ను తీసుకొచ్చింది. ఆబెర్రీ స్టోర్లను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు భర్త ప్రతీక్‌తో కలిసి ఏర్పాట్లు చేస్తున్నది సాహిత్య. ఇప్పటికే మణికొండ, కోకాపేట, అలకాపురిలో మూడు స్టోర్లు ప్రారంభం అయ్యాయి. బెంగళూరు, చెన్నైలో శాఖలు రానున్నాయి. ఇప్పుడు సాహిత్య ‘స్వీటూత్’ మార్కెట్ విలువ రూ.20 కోట్లు ఉండవచ్చని అంచనా.
వ్యాపారాన్ని విస్తరించేందుకు నా సేవింగ్స్‌కు తోడు అమ్మావాళ్లు రూ.60 లక్షలు సమకూర్చారు. అవి కూడా సరిపోలేదు. దీంతో వీహబ్‌ను సంప్రదించాను. అక్కడి నిపుణులు కొత్త వ్యాపార అవకాశాల్ని చూపించారు. వీ హబ్ చొరవతో స్టాండప్ ఇండియా ద్వారా బ్యాంకర్స్ రూ.1.30 కోట్ల రుణం ఇచ్చారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ ఆంత్రప్రెన్యూర్స్ టాప్-5 జాబితాలో నాకు చోటు ఇచ్చింది. ఎస్‌డబ్ల్యూఐ అనే అంతర్జాతీయ సంస్థ నుంచి బెస్ట్ బీ2బీ అవార్డు దక్కింది. బరిస్టాస్, హల్దీరామ్స్, చాయ్పాయింట్, చిట్‌చాట్ చాయ్, కామిక్ సోషల్ వంటి 60కి పైగా క్లయింట్స్‌తో ఇప్పటికీ వ్యాపారం చేస్తున్నా. వీహబ్ ద్వారా సాయం పొందిన నేను.. వీహబ్‌కు మెంటర్‌గా వెళ్లడం గర్వకారణం.
– మన్నేపల్లి సాహిత్య, స్వీటూత్ సీయీవో
…✍ రవికుమార్ తోటపల్లి ( డప్పు రవి ), 📷 చిన్న యాదగిరిగౌడ్