Cancelled Plans | మనసు ఉండాలే కాని, మార్గమూ ఉంటుంది. మనం ఏ రంగంలో పనిచేస్తున్నా పర్యావరణానికి మేలు చేయవచ్చు. ‘క్యాన్సిల్డ్ ప్లాన్స్’ స్థాపకురాలు మల్లికా రెడ్డి ( Mallika Reddy ) ఆలోచనా ఇదే. ఈ సంస్థ పారిశ్రామిక వ్యర్థాల నుంచి బట్టలు, బ్యాగుల్లాంటివి రూపొందిస్తున్నది. ఫ్యాషన్ ప్రపంచం మీద తనదైన ముద్రవేస్తూ ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నది.
ఆకర్షణీయంగా కనిపించే ఫ్యాషన్ దుస్తులు, యాక్సెసరీస్ చూడగానే ఎవరైనా ‘వావ్!’ అంటూ సంభ్రమాన్ని వ్యక్తం చేస్తారు. ‘క్యాన్సిల్డ్ ప్లాన్స్’ వెనుక ఉన్న కథ కూడా మనల్ని అంతే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అక్కడ కనిపించేవన్నీ రకరకాల పరిశ్రమలు ఓ మూలన పారేసిన వ్యర్థాలే. వాటికి అర్థాన్నిచ్చి, ఆకృతిని ప్రసాదిస్తారు మల్లిక. ఆ కార్ఖానాలో ఒక్కో చొక్కాది ఓ కథ, ఒక్కో బ్యాగుది ఓ చరిత్ర. ప్రతి డిజైన్ ప్రత్యేకమే. వీటి సృష్టికర్త మల్లికారెడ్డి స్వస్థలం హైదరాబాద్. అమ్మ ‘సప్తపర్ణి’ అనే సాంస్కృతిక వేదికను నడుపుతున్నారు. నాన్న రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌లో ఉన్నతోద్యోగి. చిన్నప్పటి నుంచీ కళలంటే ఆసక్తి. తొలి చదువులు భారత్‌లో చదివారు మల్లిక. ఆర్కిటెక్చర్లో పట్టా కోసం అమెరికా వెళ్లారు. ప్రతి పనిలో సృజనాత్మకతను చొప్పించడం తల్లి నుంచి అలవాటైంది తనకు. అందుకే, అమెరికాలో చదువుకునే సమయంలోనే ఇష్టమైన రంగంలో ఉంటూనే, పర్యావరణానికి మేలు జరిగేలా ఏదైనా వ్యాపారం చేయాలని భావించారు. ఇండియాకు తిరిగి వచ్చాక రెడ్డీస్ ల్యాబొరేటరీస్ డిజైనింగ్ విభాగంలో చేరారు. అక్కడ పారిశ్రామిక వ్యర్థాల గురించి అధ్యయనం చేశారు. వాటితో బట్టలు, బ్యాగులు రూపొందిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచించారు. ఆ ప్రయత్నంలో రకరకాల ఫ్యాక్టరీలు తిరిగారు. తనలాంటి అభిరుచులే ఉన్న చాలామందిని కలిశారు. తన ఐడియాకు ఒక రూపం ఇచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా పుట్టిందే ‘క్యాన్సిల్డ్ ప్లాన్స్’ సంస్థ. నిజానికి తాను వాడే పదార్థాలన్నీ ఏ డంపింగ్ యార్డులోనో, సముద్రంలోనో పడేసేందుకు ప్లాన్ చేసినవే. ఆ ప్లాన్‌ను క్యాన్సిల్ చేస్తూ.. వాటికి కొత్త రూపు ఇస్తున్నానని, అందుకే తన సంస్థకు ‘క్యాన్సిల్డ్ ప్లాన్స్’ అని పేరు పెట్టాననీ చెబుతారు మల్లిక.
గార్మెంట్స్‌లో వృథాగా పోయే గుడ్డలు, ఫ్లెక్సీ ప్రింటింగ్ సంస్థల్లో మిగిలిపోయే ఫ్లెక్స్ మెటీరియల్, ఫార్మా కంపెనీల గోదాముల్లోని అల్యూమినియం ఫాయిల్.. ఇలా ఒక్కో పరిశ్రమ నుంచి ఒక్కో మెటీరియల్‌ను సేకరిస్తుంది ఈ సంస్థ. వాటన్నిటినీ జతచేస్తూ రకరకాల డిజైన్లు రూపొందిస్తున్నారు మల్లిక. క్యాన్సిల్డ్ ప్లాన్స్ వెబ్సైట్లోకి వెళితే.. మేడ్ ఫ్రమ్ కాటన్ వేస్ట్, మేడ్ ఫ్రమ్ ప్లాస్టిక్ వేస్ట్, మేడ్ ఫ్రమ్ అల్యూమినియం వేస్ట్… ఇలా రకరకాల కేటగిరీలు ఉంటాయి. వాటిని కనుక క్లిక్ చేస్తే ఆయా పదార్థాలతో రూపొందించిన దుస్తులు, యాక్సెసరీస్ కనిపిస్తాయి. అందులో నుంచి మనకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. నేరుగా కొనాలనుకుంటే, హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో షోరూమ్ ఉంది.
క్యాన్సిల్డ్ ప్లాన్స్ ఉత్పత్తులు లాక్మే ఫ్యాషన్ వీక్, లండన్ డిజైన్ ఫెస్టివల్ లాంటిచోట్లా మెరిశాయి. దేశవిదేశాల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. అమ్మకాలు కూడా బాగానే
జరుగుతున్నాయి. ‘పరిశ్రమల్లో పనికిరానివని నిర్ధారించి పడేసేవన్నీ చెత్తగా మారిపోయి మట్టి పొరలనూ, సముద్రాల లోతుల్నీ మింగేస్తున్నాయి. వాటిని మళ్లీ వినియోగించుకోగలిగితే
పర్యావరణాన్ని కాపాడిన వాళ్లమవుతాం. ఈ నాలుగేళ్లలో వెయ్యి కేజీల వ్యర్థాలను పునర్వినియోగంలోకి తేగలిగాం. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రగ్గులు, కార్పెట్ల్లు, చెప్పులు మొదలైనవి తయారు చేయాలని అనుకుంటున్నాం. ఇప్పటిదాకా తయారు చేస్తున్న చొక్కాలు, ప్యాంట్లు, బ్యాగుల లాంటివి కూడాఎక్కువ రోజులు మన్నేలా రూపొందిస్తున్నాం. ఫలితంగా, అవి మళ్లీ వ్యర్థాలుగా మారేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయి. మనం నివసిస్తున్న ఈ నేలకు ఎంతో కొంత మేలు చేస్తున్నామన్న భావన చాలా తృప్తినిస్తున్నది’ అని చెబుతారు మల్లిక. మహిళల్లోఅపారమైన సృజన ఉంటుందనీ, ఆత్మవిశ్వాసాన్ని కనుక పెంచుకుంటే.. తాము ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధించగలరనీ భరోసా ఇస్తారు. వ్యాపారం ఎవరైనా చేయగలరు? కానీ, దానికి కొంత సామాజిక బాధ్యతను, పర్యావరణ స్పృహను జోడించడమే గొప్ప. మల్లికను అభినందించాల్సిందే.
… లక్ష్మీహరిత ఇంద్రగంటి
“మార్కెట్లో దూసుకెళ్తున్న ఈ కొత్తరకం ఇన్నర్‌వేర్ బ్రాండ్ వెనుకున్న కథ తెలుసా !!”