Niharika NM | టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా.. సౌత్‌లో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా సరే హీరోలంతా ఆమెతో రీల్స్ చేయాలనుకుంటారు. ఎందుకంటే.. సోషల్ మీడియాలో నిహారిక మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్లు లక్షల్లో ఉన్నారు.
ఆమె హీరోయిన్ కాదు. అయితేనేం లక్షల్లో ఫాలోయింగ్. ఆమెకు నటనలో ఓనమాలు తెలియవు. అయినా స్టార్ హీరోలతో రీల్స్ చేసేంత రేంజ్. తన కష్టమంతా కేవలం 30 సెకన్లలో కనిపిస్తుంది. ఆ రెప్పపాటు సమయంలోనే నవ్విస్తుంది. ఓ మంచి కథ చెబుతుంది. అన్నిటికీ మించి ఆహ్లాదాన్ని పంచుతుంది. వాటికే.. కోట్లలో వ్యూస్, లక్షల్లో కామెంట్లు. కాబట్టే, రెండేండ్లలోనే ప్రపంచం మెచ్చే ‘సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్’గా ఎదిగింది బెంగళూరుకు చెందిన నిహారిక ఎన్ఎం. అంతేకాదు, ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫెస్టివల్ వేదికగా ‘యూత్ ఐకాన్ – ఎంటర్టెయినర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డునూ అందుకొంది. కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టాలని ప్రతి హీరోయిన్, మోడల్ కలలు కంటుంది. అయితే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆ రెడ్ కార్పెట్‌పై మొదటిసారి తళుక్కున మెరిసింది నిహారిక. ఈ ఏడాది ఫోర్బ్స్ ఆసియా అండర్-30 జాబితాలోనూ చోటు దక్కించుకొని తనదైన ప్రత్యేకత చాటుకుంది. 2020లో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షమంది ఫాలోవర్స్ ఉండేవారు. ప్రస్తుతం ఇన్‌స్టాలో 2.8 మిలియన్స్ ఫాలోవర్స్, యూట్యూబ్‌లో 1.9 మిలియన్స్ సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. ఇక ట్విట్టర్, ఫేస్బుక్, టిక్‌టాక్ వంటి వేదికల మీద కూడా లక్షలమంది అభిమానులను సంపాదించుకుంది.
బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్.. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, ఏ హీరో అయినా రీల్స్, షార్ట్ వీడియోల కోసం నిహారిక సమయం అడిగితే.. తప్పకుండా ఆమోదిస్తారు. కొందరు హీరోలైతే సినిమాల ప్రమోషన్ కోసం స్వయంగా ఆమెను సంప్రదిస్తారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’, అడివి శేషు ‘మేజర్’, యశ్ ‘కేజీఎఫ్-2’ ప్రమోషన్ల కోసం ఆయా హీరోలతో కలిసి నిహారిక రీల్స్ చేసింది. ‘చిన్నప్పటి నుంచి నాకు మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నా క్రష్‌తో తొలిసారిగా మాట్లాడుతుంటే.. కాస్తంత తడబడ్డాను’ అంటూ నాటి ముచ్చట్లను పంచుకుంది నిహారిక. వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనని ప్రకటించింది. నిర్మాతలూ విన్నారా?
చెన్నైలో పుట్టి.. బెంగళూరులో పెరిగాను. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఎంబీఏ చదువుతున్నా. లాక్డౌన్ కారణంగా అమెరికాలో చిక్కుకోవడంతో కాలక్షేపానికి షార్ట్ వీడియోలు చేయడం మొదలుపెట్టాను. తర్వాత స్టార్స్‌ను అనుకరిస్తూ ఫన్నీ వీడియోలు చేశాను. యూఎస్‌లో కొత్త ప్రదేశాలను పరిచయం చేశాను. దీంతో అనూహ్యంగా ఫాలోవర్లు పెరిగారు. జిమ్ క్యారీ నుంచి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం వరకూ ప్రతి కమెడియన్ నాకు స్ఫూర్తి. దక్షిణాదిలో బంధువులు ఉండటంతో సెలవుల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లి, ప్రాంతీయ భాషలు నేర్చుకున్నా. ఇప్పుడు నాకు తెలుగు, తమిళ, కన్నడ భాషలు వచ్చు. అన్నిటినీ మిక్స్ చేసి.. ఫాలోవర్స్‌కు మాంచి కిక్ ఇచ్చే కంటెంట్ సృష్టించడం ఇష్టం నాకు.
– నిహారిక, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.
“మాకు మేమే సెక్యూరిటీ.. తమను తాము కాపాడుకునేందుకు సైన్యంగా మారిన బాలికలు”