Girl Power Group | ప్రపంచంలోనే అతి ఎక్కువ మడ అడవులను కలిగిన ప్రాంతం.. సుందర్బన్. 4 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాంతంలో తరుచూ తుఫానులు, వరదలు జీవితాల్ని స్తంభింపజేస్తాయి. అంతేకాదు లైంగిక దాడులు, బాలికల అక్రమ రవాణాకు కేంద్రంగానూ మారిందీ నేల. ఇలాంటి చోట మహిళల చేత, మహిళల కోసం ఏర్పాటైన ‘గర్ల్ పవర్ గ్రూప్’ ఆ సవాళ్లను అధిగమించడం ఎలాగో నేర్పుతున్నది.
పశ్చిమ బెంగాల్లో సుందర్బన్ ప్రాంతం పేదరికానికి చిరునామా. చాలామంది పొట్టకూటి కోసం చేపలు పడుతుంటారు. అడవిలో కూలి పనులూ చేస్తుంటారు. ఉన్నంతలో సంతృప్తిగా ఉందామనుకునే అమాయక జీవితాలు వీళ్లవి. సమాజమే కాదు, ప్రకృతి కూడా వీరిపట్ల శాపంగా మారుతున్నది. తరచూ తుఫాన్లు, వరదల్లో ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయి. డబ్బు ఉన్నవారిదే పెత్తనం. వాళ్లే ఈ ప్రాంతాన్ని మహిళల అక్రమ రవాణా కేంద్రంగా మార్చేశారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ముప్పైమంది బాలికలు ఓ బృందంగా ఏర్పడ్డారు.
ఏండ్ల తరబడి ఇక్కడ అరాచకం రాజ్యమేలుతున్నది. సేవ చాటున ఘోరాలు జరిగి పోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్వచ్ఛంద సేవ ముసుగులో వచ్చేవారిలో చాలామంది.. అదే అదునుగా భావించి బాలికలు, మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల ఆశచూపి అమ్మాయిలను అక్రమంగా తరలిస్తున్నారు. దాదాపు 60 శాతం కేసుల్లో నిందితులు ఎవరో తెలిసినా.. ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో.. చట్టాల అమలులో స్థానికుల పాత్ర ఉండాలంటూ ‘వరల్డ్ విజన్ ఇండియా’ సంస్థ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నది. ‘గర్ల్ పవర్ గ్రూప్’నకూ శ్రీకారం చుట్టింది. పద్దెనిమిదేండ్ల లోపు 30 మంది బాలికలు ఈ బృందంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని దాదాపు 65 గ్రామాల్లో ఈ బృందం చురుగ్గా పనిచేస్తున్నది. ఇటీవలి కాలంలో గర్ల్ పవర్ గ్రూప్ ‘బహెన్ బాక్స్’ ద్వారా 102 లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయించింది. 334 బాల్య వివాహాలు ఆపింది. 29 మంది చిన్నారుల అపహరణ కేసులను ఛేదించింది. తాజాగా లత అనే వలంటీర్ తమ ఊళ్లో 16 సంవత్సరాల బాలిక అక్రమ రవాణాను, 13 ఏండ్ల అమ్మాయి బలవంతపు పెండ్లిని అడ్డుకుంది. లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి ఈ 30 మంది టీనేజ్ అమ్మాయిలు చేస్తున్న కృషిని ఎందరో ప్రశంసిస్తున్నారు. స్ఫూర్తిగానూ తీసుకుంటున్నారు.
“ఆరేండ్లు అలుపెరుగని పోరాటం చేసి కన్నతండ్రికి జీవితఖైదు వేయించిన అక్కాచెల్లెళ్లు”