Vandana Kalagara | లాల పోయడం, జోల పాడటం, గోరుముద్దలు తినిపించడం, చేయిపట్టి నడిపించడం, వేలుపట్టి అక్షరాలు దిద్దించడం.. ఇక్కడితో అమ్మ బాధ్యత తీరిపోదు. బిడ్డకు స్ఫూర్తి నివ్వాలి. ఓ లక్ష్యాన్ని సిద్ధం చేసుకోవడానికి సరిపడా ఆలోచన ఇవ్వాలి. విజయానికి ఓ ఉదాహరణగా నిలబడాలి. ఈ ఒక్క కారణంతోనే.. మూసేసిన వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించారు వందన కలగర.
పాప పుట్టిన తర్వాత వందన కలగర ప్రపంచం మారిపోయింది. బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్గానిక్ వస్త్రాలనే వాడాలనుకుంది. నిజమే, సాధారణ వస్త్రాలను రసాయనాలలో ముంచి తేలుస్తారు. బట్టలోనూ కృత్రిమమైన సింథటిక్స్ను జోడిస్తారు. కానీ, అప్పట్లో మన దగ్గర సేంద్రియ దుస్తులపై అంతగా అవగాహన లేదు. తయారీదారుల ఊసే లేదు. దీంతో ఓ తల్లిగా తన బిడ్డలాంటి నవజాత శిశువుల కోసం ఆరోగ్యకరమైన వస్త్రాలను అందించాలని నిశ్చయించుకుంది వందన. ఆ ఆలోచనే ‘కీబీ’ అనే ఆర్గానిక్ వస్త్ర ప్రపంచంగా ఆవిష్కృతమైంది.
కూతురు నర్సరీకి వచ్చే సమయానికి వందన తీవ్ర ఒత్తిడికి గురైంది. ‘కీబీ’కి సంబంధించి వ్యాపారం, మార్కెటింగ్, డిజైనింగ్, కోఆర్డినేషన్.. అన్ని పనులూ తానొక్కదాన్నే చూసుకోలేక పోతున్నాననే అసంతృప్తి ఒకవైపు. వ్యాపారంలో పడిపోయి కుటుంబానికి దూరం అవుతున్నాననే బాధ మరోవైపు. ఆ జోడు గుర్రాల సవారీ చేయలేక పోయింది. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైంది వందన. అంతలోనే ఇంకో సంఘటన.. ఓ రోజు వందన కూతురి స్కూల్లో ‘కెరీర్ డే’ నిర్వహిస్తున్నారు. ఆ వేడుకలో తన బిడ్డను ‘నువ్వు జీవితంలో ఏమవుతావు?’ అని అడిగింది. సాధారణంగా డాక్టర్, ఇంజినీర్, సైంటిస్ట్ వగైరా సమాధానాలు వస్తాయి. ఆ చిట్టితల్లి మాత్రం ‘నేను ఇంట్లోనే ఉంటాను. ఏమీ చెయ్యను’ అంటూ సమాధానం ఇచ్చింది. ఎందుకంటే ఆ చిన్నారికి అవగాహన వచ్చేనాటికి అమ్మ, నానమ్మ.. అంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఆ స్పందనతో వందనలో చలనం మొదలైంది. బిడ్డ బాగోగులు చూడటమే కాదు, బిడ్డలో స్ఫూర్తిని నింపడమూ తల్లి బాధ్యతే. ఆ కోణంలో తాను విఫలం అవుతున్నానేమో అనే భావన కలిగింది. ఫ్యాషన్ రంగం గురించి కన్న కలలన్నీ ఒక్కసారిగా ఆమె కండ్లముందు కదలాడాయి. అంతే, వ్యాపారం ఎక్కడ ఆగిపోయిందో మళ్లీ అక్కడినుంచే మొదలుపెట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్ నిఫ్ట్‌లో ఫ్యాషన్ టెక్నాలజీ చదివేప్పుడు స్నేహితురాలైన స్మృతిరావును కో-ఫౌండర్‌గా చేర్చుకుంది. ఇద్దరూ సరికొత్త డిజైన్లను రూపొందించడం మొదలుపెట్టారు. మూలనపడిన వ్యాపారాన్ని మళ్లీ నిలబెట్టారు.
బాల్యం నుంచీ వందనకు ఫ్యాషన్ ప్రపంచం అంటే ఇష్టం. ఆ అభిరుచి కారణంగానే.. నిఫ్ట్‌లో పట్టా అందుకున్న తర్వాత అమెరికా వెళ్లి ఫ్యాషన్ డిజైనింగ్‌లో మాస్టర్స్ చేసింది. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక డిజైనర్ లేబుల్ ‘రామ్స్’లో పనిచేసింది. కొన్ని సంస్థలకు ఫ్రీలాన్స్ ఫ్యాషన్ డిజైనర్‌గానూ వ్యవహరించింది. మాతృత్వ మమకారమే ప్రేరణగా ‘కీబీ’కి ప్రాణంపోసింది. ప్రాథమిక పెట్టుబడి కోసం తన సొంత డబ్బుకు తోడు బ్యాంక్ నుంచి రూ.15 లక్షలు రుణం తీసుకున్నది. ఆ డబ్బుతో మియాపూర్‌లో తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. నవజాత శిశువుల చర్మం సున్నితంగా ఉంటుంది. గరుకు వస్త్రాలతో మంటపుడుతుంది. కాటన్ దుస్తులు వేస్తేనే పిల్లలు కంఫర్ట్‌గా ఉంటారు. కాబట్టే, నవజాత శిశువుల నుంచి పదేండ్ల పిల్లల వరకు.. అన్ని వయసులవారికీ స్వచ్ఛమైన సేంద్రియ వస్త్రాలు అందుబాటులోకి తెచ్చింది వందన. వస్త్రాల తయారీకి గ్లోబల్ ఆర్గానిక్ టెక్స్టైల్ స్టాండర్డ్ (జీఓటీఎస్) ధ్రువీకరించిన ముడి సరుకే వాడతారు. రసాయనాల జాడే ఉండదు. అంత స్వచ్ఛంగా, పర్యావరణహితంగా దస్తులను రూపొందిస్తారు.
అనేకానేక మలుపుల తర్వాత.. మార్కెట్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నది ‘కీబీ’. ఈ బ్రాండ్ వస్త్రాలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని మియాపూర్, కొంపల్లి, జూబ్లీహిల్స్‌తోపాటు, బెంగళూరులో ఆఫ్ లైన్స్టోర్లు ప్రారంభించారు. ఆన్లైన్లోని అమెజాన్, మింట్రా, ఫస్ట్‌క్రై, లిటిల్ మఫెట్, టినీరాబిట్ వంటి ఈకామర్స్ వెబ్సైట్స్లోనూ లభిస్తాయి. అబ్బాయిలు, అమ్మాయిలకు ప్రత్యేకంగా కుర్తాలు, లెహంగాలు, పంచకట్టు వస్త్రాలు, హాఫ్‌శారీస్, నైట్ డ్రెస్, టవల్, ఇన్నర్‌వేర్ వంటి ఆర్గానిక్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. తయారీలో మిగిలిన క్లాత్‌తో ‘రుతుక్రమ’ ప్యాడ్స్ తయారుచేసి, కీబీ వెబ్సైట్లో విక్రయిస్తున్నారు. ధరలు రూ.450 నుంచి రూ.4,000 వరకూ ఉంటాయి. త్వరలోనే మరిన్ని ఆఫ్‌లైన్ స్టోర్లు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు వందన, స్మృతిరావు.
‘మా వ్యాపారాన్ని విస్తరించేందుకు సరైన మార్కెట్ వ్యవస్థ కోసం ఎదురుచూస్తున్నాం. పెట్టుబడి సహకారానికి ఇటీవల ‘వీహబ్’ను సంప్రదించాం. మమ్మల్ని ‘లాంచ్‌ప్యాడ్ ఈవెంట్’కు ఎంపిక చేసి, శిక్షణ ఇస్తున్నారు. తదుపరి దశలో పెట్టుబడిదారులతో భేటీ నిర్వహిస్తారు. అక్కడ సక్సెస్ అయితే.. వ్యాపార వృద్ధికి పెట్టుబడి అందుతుందనే నమ్మకం ఉంది. ఇప్పటికైతే నష్టాల బాటనుంచి బయటపడ్డాం. వ్యాపారాన్ని విస్తరించే విషయంలో వీహబ్పైనే ఆశలు పెట్టుకున్నాం.’
వందన కలగర, ఆంత్రప్రెన్యూర్
…✍ రవికుమార్ తోటపల్లి ( డప్పు రవి )
“IAS Anwesha Reddy | కొత్త తెలంగాణచూస్తున్నా.. కలహండి కలెక్టరమ్మ”