కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1 మాదిరిగానే గ్రూప్-2లోనూ సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఇంగ్లండ్‌తో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు అనూహ్య షాక్ తగిలింది. అభిమానులను అలరించిన మరో ‘లో స్కోరింగ్ థ్రిల్లర్’లో ఇంగ్లండ్‌దే పైచేయి అయింది. బ్రూక్ సేన.. 4 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసి సెమీస్ రేసును ఉత్కంఠగా మార్చింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 160 పరుగుల ఛేదనను ఆ జట్టు 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. టామ్ బ్యాంటన్ (24 బంతుల్లో 33, 3 ఫోర్లు, 1 సిక్స్), ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ విల్ జాక్స్ (18 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఇంగ్లిష్ బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (28 బంతుల్లో 39, 4 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ సీఫర్ట్ (25 బంతుల్లో 35, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.
ఛేదనలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కూడా తడబాటుకు గురైంది. హెన్రీ తొలి ఓవర్లోనే సాల్ట్ (2)ను బోల్తా కొట్టించగా ఫెర్గూసన్.. ఫామ్‌లో లేని బట్లర్‌ను డకౌట్ చేశాడు. ఈ క్రమంలో గత మ్యాచ్ శతక హీరో కెప్టెన్ హ్యారీ బ్రూక్ (24 బంతుల్లో 26, 3 ఫోర్లు, 1 సిక్స్) కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బెతెల్ (16 బంతుల్లో 21, 4 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 48 రన్స్ జతచేశాడు. అయితే 8వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ఫిలిప్స్.. బ్రూక్‌ను వెనక్కి పంపగా రచిన్ ఓవర్లో బెతెల్ పెవిలియన్ చేరాడు.
కానీ కరన్, బ్యాంటన్ ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు ఈ జోడీ 42 రన్స్ జోడించి ఆ జట్టును పోటీలోకి తెచ్చింది. కానీ డ్రింక్స్ విరామం తర్వాత రచిన్ వరుస ఓవర్లలో కరన్, బ్యాంటన్నూ ఔట్ చేసినా కివీస్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు దక్కలేదు. ఫిలిప్స్ ఓవర్లో జాక్స్.. 6, 4, 4తో 22 రన్స్ రాబట్టడంతో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లింది. ఆఖరి రెండు ఓవర్లలో ఆ జట్టు విజయానికి 21 పరుగులు అవసరమవగా శాంట్నర్ 19వ ఓవర్లోనూ 16 రన్స్ వచ్చాయి. చివరి ఓవర్లో జాక్స్ బౌండరీ కొట్టి లాంఛనాన్ని పూర్తిచేశాడు.
కివీస్ ఓటమితో గ్రూప్-2లో సెమీస్ రేసు ఉత్కంఠగా మారింది. గ్రూప్-2లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఇంగ్లండ్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా న్యూజిలాండ్ మూడింట్లో ఒకటి గెలిచి ఒకటి వర్షం కారణంగా రద్దవడంతో 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ గెలవడంతో పాక్ సెమీస్ ఆశలు సజీవమయ్యాయి. శనివారం ఆ జట్టు.. పల్లెకెలెలో శ్రీలంకతో ఆడనున్న మ్యాచ్ ఫలితంతో సెమీస్ బెర్తు తేలనుంది.లంకను పాక్.. భారీ తేడాతో ఓడించి, ఆ జట్టు కివీస్ (+1.390) కంటే మెరుగైన రన్‌రేట్ (-0.461)ను సాధిస్తే అప్పుడు పాకిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. లంక గెలిస్తే కివీస్‌కు లైన్ క్లియర్ అవుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ రైద్దెతే మాత్రం పాక్ తట్టాబుట్టా సర్దుకోవడమే!
న్యూజిలాండ్: 20 ఓవర్లకు 159/7 (ఫిలిప్స్ 39, సీఫర్ట్ 35, జాక్స్ 2/23, రషీద్ 2/28);
ఇంగ్లండ్: 19.3 ఓవర్లకు 161/6 (బ్యాంటన్ 33, జాక్స్ 32*, రచిన్ 3/19, ఫెర్గూసన్ 1/14)
