నల్లగొండ, ఆగస్టు 13 : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడేలా లేవు.. వరి సాగు చేయొద్దు.. దండం పెడుతున్నా అర్థం చేసుకోండి. మా ఆవేదన వినండి.. అని నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం చెరువు కింద నాట్లు వేస్తున్న రైతులను పానగల్ ఏఈవో దేవేందర్ దండం పెడుతూ వేడుకున్నాడు. అతని వేడుకోలకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతులతో పాటు నెటిజన్లు ఏఈవోతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతూ వ్యతిరేక పోస్టులు పెట్టారు. ఎల్‌నినో ప్రభావం ఉంటే అసలు వర్షాలు రాకుండా ఉంటలేవు కదా.. బోరు బావులు కింద వ్యవసాయం చేసుకోవద్దా.. ఉదయ సముద్రం నీటిని తాగుకు ఇస్తే.. దాని జాలుకే కింది పొలాలు పారుతాయని విమర్శిస్తూ రైతులతో పాటు నెటిజన్లు రివర్స్ పోస్టులు పెట్టారు.
అంతటితో ఆగకుండా ఇటీవల నల్లగొండలో నిర్వహించిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సాగర్ నిండినా సాగు నీరు ఇవ్వమని, రైతులు వరి సాగు చేయొద్దని చెప్పినా రైతులు వరి సాగు చేస్తుండటంతో.. ఇలాంటి వేడుకోలు కార్యక్రమాలకు ప్రభుత్వం తెర తీసిందా అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. 2014లో బీఆర్ఎస్ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 510 అడుగుల నీటి నిల్వ ఉంటే నాటి మంత్రి హరీశ్‌రావు నీటిని విడుదల చేశారని, ఇప్పుడు 521 అడుగులున్నా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. నాట్లు వేసేటప్పుడు కాదు.. మీ జాగ్రత్త ముందే ఉండాలి కదా అని మరి కొందరు ప్రశ్నించారు. ఆంధ్రావాళ్లకు నీళ్లు ఇవ్వడానికే తెలంగాణలో రైతులు వ్యవసాయం చేయొద్దనే కుట్ర చేస్తున్నారని ప్రభుత్వంపై మండి పడ్డారు. 25 వేల ఎకరాలు ఆయకట్టు ఉన్న ఉదయ సముద్రం కింద జాలు నీటికే వరి సాగయ్యే అవకాశం ఉంటుంది.