మేడ్చల్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ప్లాట్లు, ఇండ్లను అత్యవసరం కోసం అమ్ముకునేందుకు ప్రైవేట్ ఆస్తుల యజమానులు ఎన్వోసీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే సంబంధిత ఫైళ్లు ముందుకు కదలడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్తుల యజమానులు ఎన్ఓసీల కోసం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు.
ఇప్పటికే అనేక సంఖ్యలో దరఖాస్తులను చేసుకున్న వారి ఫైళ్లు ముందుక కదలకపోవడంతో కలెక్టరేట్ కార్యాలయానికి అధికారులను కలుస్తూ..తిరిగి వెనుదిరుగుతున్నారు. కాగా, నిషేధిత జాబితాలో చేర్చిన ప్రైవేట్ ఆస్తులను పరిశీలించి తక్షణమే ఎన్ఓసీలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లు, సెక్షన్ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశించినా.. ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. యూఎల్సీ, ప్రభుత్వ భూములకు సంబంధిచిన సర్వే నంబర్లలో లేని ప్రైవేట్ ఆస్తులకు క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించిన ఫైళ్లను పరిశీలించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకరంగా మారింది.
నిషేధిత జాబితా చేర్చిన ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎన్ఓసీలు ఉంటేనే సబ్రి జిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్న క్రమంలో దస్తావేజులేకర్లు ఎన్ఓసీల దందాకు తెర లేపారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన వారితో తాము ఎన్ఓసీలు ఇప్తిస్తామంటూ ఎన్ఓసీల దందాకు దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆస్తుల డిమాండ్ మేరకు ఎన్ఓసీలకు లెక్కలు వేసి ఇంత ఇస్తే ఎన్ఓసీలు తీసువస్తామని ప్రైవేట్ ఆస్తుల యజమానులతో దందా చేస్తున్నట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.