ఢిల్లీ : నాలుగు పదుల వయసుకు చేరుకున్నా సాకర్ దిగ్గజాలు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఇప్పటికీ యువకుల మాదిరిగా పోటీపడుతున్నప్పుడు అదే స్థాయి ప్రదర్శనతో రాణిస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటలో కొనసాగితే తప్పేంటని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ‘రోకో’ ఆడతారా? లేదా? అన్నదానిపై చర్చ సాగుతున్న నేపథ్యంలో భజ్జీ స్పందిస్తూ.. ‘క్రీడల్లో ఏ ఆటగాడికైనా ప్రదర్శనే గీటురాయి తప్ప వయసు కాదు. విరాట్ ఇప్పుడు 37 ఏండ్లలో ఉన్నా ఫీల్డ్‌లో 20 ఏండ్ల కుర్రాడిలా కష్టపడుతున్నాడు. వయసు సమస్యే కాదు.
మెస్సీని చూడండి. మొన్నటి ప్రపంచకప్‌లో ఐదారుగురు ప్లేయర్లు అతడిని ఆపడానికి యత్నించినా సఫలం కాలేకపోయారు. ఆ వయసులోనూ తన నైపుణ్యంతో అతడి జట్టును ఫైనల్‌కు చేర్చగలిగాడు. ఒక ఆటగాడికి ఆ స్థాయి ఫిట్నెస్ ఉన్నప్పుడు వారికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఒకవేళ నేనే కోచ్ అయితే ఆ ఇద్దరికీ (రోహిత్, కోహ్లీకి) సరైన ప్లాట్‌ఫామ్‌ను అందించడమే నా పని. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్ల దూకుడు కంటే ఎక్కువగా ఈ ఇద్దరి అనుభవం గొప్పది. నిలకడగా పరుగులు చేస్తూ ఫిట్నెస్ను కాపాడుకుంటున్నప్పుడు వారిద్దరూ ఆడాలా? వద్దా? అనే చర్చే అనవసరం’ అని అన్నాడు.