కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కనుమరుగై అరాచకాలు తెరపైకి వచ్చినయ్. ఆ పార్టీ నాయకులు అధికారం అండతో రెచ్చిపోతున్నరు. నాడు డబుల్ బెడ్రూమ్లు ఎలా కట్టాలి? పల్లె ప్రకృతివనాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి? వైకుంఠధామం ఏచోట నిర్మించాలి? ఇంటింటికీ నల్లా నీళ్లు ఎట్లివ్వాలి? అని కేసీఆర్ ఆలోచిస్తే.. ఉన్నవాటిని ఎట్లా తగులబెట్టాలి? నిర్మించిన కట్టడాలను ఎట్లా కూలగొట్టాలి? పేదలను ఏవిధంగా కాల్చుకుతినాలా? అని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నరు.
-కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా ముందుకు సాగితే అవినీతి, అరాచకమే కాంగ్రెస్‌కు జోడెడ్లుగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణం, కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్‌డెత్, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేత ఘటనలు కాంగ్రెస్ అరాచకపర్వానికి తిరుగులేని సాక్ష్యాలని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరిట ఆశలు రేకెత్తించిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత పేదల ఆవాసాలను కూల్చి వారి బతుకులను రోడ్డున పడేస్తున్నదని విమర్శించారు. మొన్నటిదాకా నివాసాలతో కళకళలాడిన ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల, ఇప్పుడు మిగిలిన మొండి గోడలతో గాజాను తలపిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఛిద్రమైన పేదల బతుకులే కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. అలంపూర్ నియోజకవర్గపరిధిలోని అలంపూర్, గద్వాల, ఐజ మున్సిపాలిటీల్లో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు శుక్రవారం తెలంగాణ భవన్లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరై మున్సిపల్ ఎన్నికల విజేతలను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నిక ఏదైనా నడిగడ్డలో గులాబీ జెండా ఎగురడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అలంపూర్, ఐజ, గద్వాల, వడ్డేపల్లి ప్రాంతాల ప్రజలు బీఆర్ఎస్కు మద్దతు పలుకడం విశేషమని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, గద్వాలలో విజయం సాధించామని గుర్తుచేశారు. మొన్న సర్పంచ్, నిన్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘననీయ విజయాలు నమోదు చేశారని గుర్తుచేశారు. నడిగడ్డ ప్రజాతీర్పు రాష్ట్రమంతటికీ స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అంకితభావంతో పనిచేయడంతోనే బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందని స్పష్టంచేశారు. వారిద్దరు నాయకులు మున్ముందు ఇదే విధానంలో పార్టీని ముందుకుతీసుకెళ్లాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడని ఎద్దేవా చేశారు. గతంలో చెప్పినట్టుగానే అధికారపీఠమెక్కి ఓట్లేసిన ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మొన్న గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు ఇచ్చే సత్తా తెలంగాణకు ఉన్నదని నిస్సిగ్గుగా ప్రకటించారని చెప్పారు. ఇప్పుడు ఆ కోట్ల కోసమే దోపిడీకి తెరలేపారని మండిపడ్డారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ఘోరీకట్టి ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. హస్తంపార్టీ రెండేండ్ల పాలనలో ఏ ఒక్కరికీ మేలు జరుగలేదు కానీ అన్ని వర్గాలను దగా చేస్తున్నదని విమర్శించారు. అదునుకు రైతుబంధు ఇవ్వకుండా, సకాలంలో ఎరువులు సరఫరా చేయకుండా రైతులను ఇబ్బందులపాల్జేస్తున్నదని దుయ్యబట్టారు. యూరియాను షాపుల్లో అందుబాటులో ఉంచకుండా యాప్‌ల పేరిట అన్నదాతలను అరిగోసపెడుతున్నదని దుమ్మెత్తి పోశారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నిజస్వరూపం తెలిసిపోయిందని, అందుకే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ అడ్డదారులు తొక్కిందని విమర్శించారు.
మరో రెండేండ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని కేటీఆర్ పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ గెలిచిన ప్రాంతాలకు కాంగ్రెస్ సర్కార్ నిధులు మంజూరు చేసే అవకాశం లేదని, ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లు ఆచితూచి వ్యవహరించాలని ఉద్బోధించారు. అధికార కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. అందుబాటులో ఉన్న నిధులతోనే శక్తిమేరకు హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలని కోరారు. అంతేగాని పార్టీ నుంచి ఫిరాయించి ప్రజాతీర్పును అపహాస్యం చేయవద్దని చెప్పారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగిలిన మూడేండ్ల పాలనలో మున్సిపాలిటీలకు నిధుల వరద పారించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సలీం, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, అలంపూర్ మున్సిపల్ చైర్మన్ జయ రాముడు, వైస్ చైర్మన్ విక్రమ్, ఐజ మున్సిపల్ చైర్మన్ సీఎం సురేశ్, వైస్ చైర్మన్ మాల నర్సింహులు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇసుక దోపిడీ కోసం చెక్‌డ్యామ్‌లను సైతం పేల్చివేసేందుకు కాంగ్రెస్ పాలకులు వెనుకాడటం లేదని కేటీఆర్ మండి పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో భవన నిర్మాణం కోసం ఓ కాంగ్రెస్ సర్పంచ్ పల్లెప్రకృతివనంలోని 200 పచ్చని చెట్లను నరికివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కుమ్మెర మల్లన్న జాతరలో కాంగ్రెస్ నేతల అరాచకానికి రెండునెలల పసికందు బలైపోయిందని, బాధ్యులపై కేసులు నమోదు చేయకపోవడం శోచనీయమని వాపోయారు.