Giggles | ఉన్నత చదువు.. లక్షల్లో వేతనం.. లగ్జరీ లైఫ్.. ఇవేవీ అమ్మతనపు మాధుర్యం ముందు నిలవలేదు. బిడ్డ చిన్ననాటి జ్ఞాపకాలు గుండె లోతుల్లోనే కాదు.. ఇంటి నిండా ఎప్పటికీ కళ్ల ముందు కదలాడాలని.. వాటిని చూసి మురిసిపోవాలనుకుంది ఆ మాతృమూర్తి. కానీ ఎలా ? ఆ ప్రశ్నే.. కెమెరాపై ఆమె దృష్టిని మరల్చింది. పసిపిల్లల బోసి నవ్వులను బంధించేందుకు కెమెరా పట్టేలా చేసింది. ఇప్పుడు ఆ అభిరుచే ఆమె వృత్తిగా మారిపోయింది. ఇప్పుడు తనే కాదు.. వేలాది మంది మాతృమూర్తులకు.. వారి పిల్లల మధుర క్షణాలను జ్ఞాపకాలుగా మారుస్తోంది. తెలంగాణలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో అత్యద్భుత థీమ్‌లలో చిన్నారుల ఫొటోలు తీస్తూ అబ్బురపరుస్తున్నది. ఆమే..మానస అల్లాడి ( Manasa Alladi ).
నేను పుట్టింది పెరిగింది కరీంనగర్‌లోనే. బీటెక్ వరకూ అక్కడే చదివా. తర్వాత ఇన్ఫోసిస్ మైసూర్లో జాబ్ వచ్చింది. ఆరు నెలల ట్రైనింగ్ తర్వాత హైదరాబాద్‌లోని పోచారం క్యాంపస్‌కు మారిపోయాను. 2011లో పెళ్లైంది. భర్త హైదరాబాద్‌లోనే బిజినెస్ మ్యాన్. 2013లో పాప పుట్టింది. తన పేరు నిధి. ఏ తల్లికైనా తన పిల్లల ఫొటోలను రకరకాలు తీయాలని ఉంటది కదా. నాకూ అలానే అనిపించింది. ఒక్కో ఫోజ్‌లో పాపవి వేల ఫొటోలు తీశాను. చాలా హ్యాపీగా ఉండేది. పాప కూడా ఆ ఫొటోలు చూసి సంతోషపడేది. తన ఫొటోలు, వీడియోలు చూపిస్తేనే అన్నం తినేది. అవన్నీ చూసిన తర్వాత ఫొటోగ్రఫీలో ఇంత కిక్కుంటదా అనిపించింది. తెలియకుండానే దానిపై ఇష్టం ఏర్పడింది. ఫొటో గ్రఫీ ఫీల్డ్‌లోకి రావాలని అనిపించింది.
అప్పటికీ నేను ఇన్ఫోసిస్‌లోనే జాబ్ చేస్తున్నా. ఆ బిజీలో అంతగా పట్టించుకోలేదు. కానీ 2018లో బాబు పుట్టిన తర్వాత ఆ ఆలోచన మనసులో బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే బాబు పుట్టిన తర్వాత న్యూ బార్న్ ఫొటోగ్రఫీ చేపిద్దామని ప్రయత్నించా. పిల్లలు పుట్టిన తర్వాత 5 నుంచి 15 రోజుల్లోనే ఆ ఫొటోషూట్ తీయాలి. కానీ అప్పటికే 15రోజులు దాటిపోయింది. అయినా సరే ఫొటోలు తీపిద్దామని ప్రయత్నిస్తే నెల రోజుల ముందు బుకింగ్ చేసుకోవాలని అన్నారు. న్యూ బార్న్ ఫొటోగ్రఫీకి ఎంత డిమాండ్ ఉందో అప్పుడు అర్థమైంది. నా బాబుకు న్యూ బార్న్ ఫొటో గ్రఫీ చేయించలేదని చాలా ఫీలయ్యాను. అప్పడు నేనెందుకు ఈ ఫీల్డ్‌లోకి రాకూడదని అనిపించింది. ఇంట్రెస్ట్ ఉంది. ప్యాషన్ ఉంది. డెడికేషన్ ఉంది. క్విక్ లెర్నర్ని కూడా.. అలాంటప్పుడు నేనెందుకు ఫొటోగ్రఫీలోకి రావొద్దు అనే ఫీలింగ్ వచ్చింది. అనుకున్నదే తడవుగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో గిగిల్స్ ఫొటోగ్రఫీ పేరుతో స్టూడియో స్టార్ట్ చేశాను.
నా ఆలోచనను ముందుగా నా భర్తకు, కుటుంబ సభ్యులందరికీ చెప్పా. సంతోషంగా ఒప్పుకోవడమే కాదు.. ఫుల్ సపోర్ట్ చేశారు. కానీ మనసులో ఏదో తెలియని ఫీలింగ్. టెక్నాలజీ అనలిస్ట్‌ని. మంచి కంపెనీ.. లక్షల్లో వేతనం. బ్యాక్‌గ్రౌండ్ ఫొటోగ్రఫీ ఫ్యామిలీ కాదు. చేయగలమా లేదా అని ఎన్నో డౌట్లు ఉండేవి. ఆ టైంలో మెటర్నటీ లీవ్‌లో ఉండటం కలిసొచ్చింది. ముందుగా ఈ మెటర్నటీ సెలవుల్లో ప్రయోగాలు చేద్దామని నిర్ణయించుకున్నా. ఈ ఆరు నెలల్లో నన్ను నేను నిరూపించుకుంటే నమ్మకం వస్తుందని ఈ ఫీల్డ్‌లోకి దిగాను. కెమెరా తీసుకుని.. ఫొటో గ్రఫీ నేర్చుకున్నా. ముందుగా నా పిల్లలను, చుట్టాల పిల్లలను, తెలిసిన వాళ్లు, ఫ్రెండ్స్ పిల్లలను తీశాను. పాజిటివ్, నెగటివ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుని.. మార్చుకుంటూ వెళ్లాను. నామీద నాకు నమ్మకం వచ్చాక బాబు పుట్టిన మూడు నెలలకు గిగిల్స్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ నేర్చుకుంటున్నాను.
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక యూనిక్‌నెస్ ఉంటుంది. ఫొటోలు చూస్తుంటే .. ఇది వీళ్లు తీసింది.. ఇది వాళ్లు తీసింది అనిపిస్తది. స్టైల్ తెలిసిపోతుంది. మన స్టైల్ కూడా ఏదైనా ఉండాలని, ఫొటో చూడగానే గిగిల్స్లో తీశారని తెలిసేలా చేయాలని అనిపించింది. అప్పుడే త్రీడైమెన్షనల్ సెటప్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. చిన్న చిన్న పిల్లలకు చిన్న థీమ్స్‌తో సెటప్స్ చేస్తే ముద్దుముద్దుగా ఉంటుంది అనిపించింది.
నాలుగైదు రోజులు ఆలోచించాను. నా భర్తకు చెబితే చాలా ఎగ్జైట్ అయ్యారు. మనం చేద్దాం.. మనకు రీసోర్సెస్ ఉన్నయ్ కదా అని సపోర్ట్ చేశారు. ధైర్యం చేసి 2018లో స్టార్ చేశాం. అప్పుడు పెట్టుబడి పెద్దగా పెట్టలేదు. గోడౌన్ తీసుకుని.. స్టూడియోగా మార్చినం. నా బేబీని అయితే ఎలా తీయాలనుకున్నానో.. నా బాబును కూడా ఎలా చేయాలనుకున్నానో.. ఆ ఆలోచనలన్నింటినీ నోట్ చేసి.. త్రీడైమెన్షెనల్ థీమ్ సెటప్స్ అరెంజ్ చేశాం. రిఫరెన్స్ పిక్చర్ లేకుండా.. నా మైండ్‌లో ఉన్న థీమ్‌ని ప్రజెంట్ చేసి.. సొంతంగా సెటప్ చేసుకున్నా. క్లైంట్ రిక్వెస్ట్ ను బట్టి అప్డేట్ చేస్తున్నాం. ఒక్క థీమ్‌తో మొదలుపెట్టి బేబీకి, మదర్‌కి ఏవైతే అవసరం ఉంటాయో ఆలోచించి 25 థీమ్స్ సెటప్ చేశాం.
పిల్లలకు ఎంత మంచి ఫ్రాక్స్ కొన్నా.. రెండు మూడు సార్లే ఉపయోగిస్తాం. తర్వాత అవి చిన్నగా అయిపోతయ్. నా పాప ఫొటోషూట్ చేసినప్పుడు కూడా వేలు ఖర్చు పెట్టి డ్రెస్సులు కొన్న కానీ తర్వాత వాటిని వేయలేదు. అందుకే మా స్టూడియోలో మేమే క్లాత్స్ అరేంజ్ చేశాం. ఏది కావాలంటే అది సెలక్ట్ చేసుకునే అవకాశం కల్పించాం. చాలా మంది పేరెంట్స్‌కి తమ పిల్లలను డాక్టర్, పోలీస్, క్రికెటర్లా ఫొటోలు తీయించుకోవాలని ఉంటది. అందుకు అనుగుణంగా స్టూడియోలో 25 థీమ్స్.. అందుకు తగ్గట్టుగా దుస్తులు ఏర్పాటు చేశాం. సాధారణంగా పిల్లలు ఎవరైనా ఒక గంట యాక్టివ్‌గా ఉంటారు. ఏ బొమ్మలు ఇచ్చినా కాసేపు ఆడుకుని పక్కన పెట్టేస్తారు. బోర్‌గా ఫీలవుతారు. పిల్లలకు రెడీమేడ్ సెటప్ ఉంటే.. త్వరగా డ్రెస్సులు చేంజ్ చేసి ఫొటోలు తీయొచ్చు కాబట్టి.. డ్రెస్సులు మార్చుకునేందుకు వీలుగా ఏసీ రూములను కూడా ఏర్పాటు చేశాం.
గిగిల్స్.. అంటే నవ్వు. పిల్లల కంటే ప్యూర్‌నెస్ నవ్వు ఎవరికీ ఉండదు. నేను దాన్ని క్యాప్చర్ చేయాలనుకున్నా. ఎంత మంచి టెక్నికల్‌గా ఫొటో ఉన్నా.. ఎంత మంచి థీమ్ తో ఉన్నా.. బేబీ స్మైల్ ఉంటే ఆ ఫీలింగ్ వంద శాతం పెరుగుతుంది. అందుకే గిగిల్స్ అని పెట్టుకున్నా. అందుకు తగ్గట్టుగానే పిల్లలను అందంగా నవ్వించే ప్రయత్నం చేశా. నవ్వుతూ ఉంటే.. పేరెంట్స్‌నే కాదు.. పెద్దయ్యాక పిల్లలు కూడా ఆ ఫొటోలు చూసుకుని సంతోషంగా ఫీలవుతారు. ముఖ్యంగా చిన్న పిల్లల ఫొటోలు తీయాలంటే.. బేబీ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. లేడీ ఫొటో గ్రాఫర్ కావడం వల్లే ఇది నాకు ఈజీ అయింది. నా బేబీని అయితే ఎలా చూసుకుంటానో.. ఇక్కడికి వచ్చే పిల్లలను కూడా అలాగే చూసుకుంటూ ఓపిగ్గా ఫొటోలు తీస్తున్నా. నా సక్సెస్‌కు ఇదే కారణం. న్యూ బార్న్ ఫొటో షూట్ దగ్గర్నుంచి, ప్రీ బర్త్‌డే, మెటర్నటీ షూట్ వరకూ అన్నీ ఇక్కడే చేసే వసతులు ఉన్నాయి. గిగిల్స్లో నాతో కలిపి 20 మంది వరకు పని చేస్తున్నారు. కరీంనగర్లో కూడా ఫ్యాబ్లైన్ పేరుతో స్టూడియో ఏర్పాటు చేశాం. అక్కడ ఐదుగురు పనిచేస్తున్నరు.
లక్షల్లో వేతనం వదిలేసి వచ్చావ్ అని చాలా మంది అన్నారు కానీ.. దీని వల్ల చాలా మంది పేరెంట్స్‌కి హ్యాపినెస్ ఇవ్వగలిగాను. నేను ఎంజాయ్ చేస్తూ ఫొటోషూట్ చేస్తాను. ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలతో సరదాగా ఆడుకుంటూ పనిచేస్తూ ఉంటాను. ప్రతి రోజు కొత్త కొత్త పిల్లలు, పేరెంట్స్‌తో గడిపే అవకాశం వచ్చింది. ప్యాషన్‌ని ప్రొఫెషన్‌గా చేసుకుంటే అంతకుమించిన అదృష్టం ఇంకేం ఉంటది. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ నుంచి స్త్రీ శక్తి అవార్డు కూడా అందుకున్నాను. రియల్ హీరో సోనూసూద్ చేతుల మీదుగా బెస్ట్ బేబీ ఫొటోగ్రఫీ స్టూడియో అవార్డు కూడా గిగిల్స్కు వచ్చింది.
”ఒక మూమెంట్ పోతూనే ఉంటుంది. కానీ ఆ టైంలో ఫొటో తీసుకుంటే.. అది ఎప్పటికీ మన మనసులో.. మన కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. మన బిజీ లైఫ్‌లో ఆ ఆలోచన వెళ్లిపోయినా ఆ ఫొటో చూసినప్పుడు వచ్చే కిక్ మామూలుగా ఉండదు. అందుకే ఇప్పుడు జ్ఞాపకాల కోసం డబ్బులు వెచ్చిస్తున్నారు. ట్రావెల్ ఒక మెమొరీ, ఫుడ్ ఒక మెమొరీ.. వాటిలో ఫొటోగ్రఫీ వచ్చేస్తుంది. అలా ఎక్కడికెళ్లిన ఫొటోలు తీసుకుంటున్నాం. ఆ మెమొరీని ఎప్పటికీ నిలిచిపోయేలా చేసుకోగలుగుతున్నాం ఫొటోల వల్ల మనం ఉన్నంత వరకు.. మనం లేనప్పుడు కూడా అందరికీ ఆ ఫొటోలు హ్యాపీనెస్ క్రియేట్ చేస్తాయి. అందుకే నేను గర్వంగా చెప్పుకుంటున్నా.. ఐ యామ్ ఏ ఫొటోగ్రాఫర్ ” – మానస అల్లాడి.
– ✍ నవీన్ కుమార్ రెడ్డి
“కొడుకు ఆడుకునేందుకు సరైన బొమ్మలు లేవని టాయ్స్ తయారీ కంపెనీనే స్టార్ట్ చేసింది”
“డ్యాన్స్ స్టెప్పులు వేయిస్తూ ఫిట్నెస్ పెంచుతున్న హైదరాబాదీ అమ్మాయి”