Butter | శాండ్విచ్, రోల్స్లాంటి ఆహార పదార్థాలకు అదనపు రుచిని అద్దేందుకు వెన్న వాడతారని తెలిసిందే. అదీ సరికొత్త ఫ్లేవర్లలో ఆస్వాదిస్తున్నారు ఫుడ్ లవర్స్.
అప్పుడే వేయించిన సాల్టెడ్ పాప్‌కార్న్‌ను పొడి చేసుకుని.. మెత్తగా చిదిమిన వెన్నలో కలుపుకోవాలి. చిటికెడు కారం, చాట్‌మసాలా, పసుపు జోడించవచ్చు. ఉడికించిన మక్కజొన్నలు తిరుగులేని కాంబినేషన్.
డార్క్ కొకోవా పొడిని మెత్తని వెన్నలో కలిపితే చాకో బటర్ తయార్. కరిగించి చల్లార్చిన డార్క్ చాకొలెట్నూ దీనికి జత చేసుకోవచ్చు. కాఫీ, కారమెల్ ఫ్లేవర్లు కూడా జోడించుకోవచ్చు. కాల్చిన బ్రెడ్ లేదా సాదా కేక్స్‌తో సూపర్‌గా ఉంటుంది.
గార్లిక్ హెర్బ్ బటర్.. పేరుకు తగ్గట్టే దీన్ని వెల్లుల్లితో పాటు పార్స్లీ, రోజ్మేరీ, థైమ్లాంటి దినుసులతో కలిపి చేస్తారు. ముందుగా వెన్న ముక్కను ఒక గిన్నెలోకి తీసుకుని మెత్తగా నలుపుకోవాలి. ఆ తర్వాత ముద్దలా చేసుకున్న వెల్లుల్లితో పాటు వివిధ దినుసుల మిశ్రమాన్నీ అందులో కలపాలి. ఫ్రిజ్‌లో నిలువ చేసుకుని వాడుకోవచ్చు.
కమ్మటి వెన్నపూసకు తియ్యటి రుచిని అద్దేలా బెర్రీ బటర్ తయారుచేస్తున్నారు. ఇందుకోసం బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీలను మిక్సీపట్టి, కొద్దిగా పంచదార కలిపి, వేడిచేసి దింపుకోవాలి. ఆ మిశ్రమానికి మెత్తగా చేసిన వెన్న జోడించి బాగా కలుపుకోవాలి. రవ్వంత ఉప్పు జోడించుకోవచ్చు.
పంప్కిన్ స్పైస్ బటర్‌ను చాలా మంది ఇష్టపడుతున్నారు. గుమ్మడికాయ గుజ్జును ప్యూరీలా చేసి వెన్నకు జోడించుకోవాలి. దాల్చినచెక్క, లవంగాలు లాంటి మసాలా దినుసులు జోడిస్తే రుచి పెరుగుతుంది.
“Black Food | నల్లగా ఉండే ఇలాంటి ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిదేనా?”