Abhilasha Chatterjee | ఒకప్పుడు ఊళ్లోనే చదివేవాళ్లం. చుట్టుపక్కలే ఉద్యోగం చేసుకునేవాళ్లం. ఇప్పుడు కేజీ అయినా పీజీ అయినా వేరే ప్రాంతానికి వెళ్తున్నాం. వెళ్లిన చోట భాషాపరమైన సమస్యలు తప్పవు. అలాంటి ఇబ్బందులు రాకుండా ఇన్స్టాగ్రామ్ ద్వారా దక్షిణాది భాషల్ని నేర్పిస్తున్నది అభిలాష చటర్జీ.
విద్యా ఉద్యోగాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర నగరాలకు వెళ్లే వారికి ఆయా భాషలు బోధిస్తూ .. కొండంత ధైర్యాన్ని నింపుతున్నది అభిలాష. అలా అని తను తెలుగమ్మాయో, కన్నడ కస్తూరో కాదు. పక్కా బెంగాలీ యువతి.
BhashaWithAbhilasha Posted ‘Auna’ Video
21,006 Likes 267 Comments 3,43,823 Plays
ఈ వీడియోలో అభిలాష ‘అవునా!’ అనే మాటను ఎన్ని రకాలుగా, ఎన్ని సందర్భాల్లో వాడతారో వివరించింది. వ్యక్తీకరణకు తగినట్టు హావభావాలు ప్రదర్శిస్తూ.. భాష నేర్చుకోవాలనే ఆసక్తిని రేకెత్తించింది. కొన్ని సెకన్ల నిడివి వీడియోనే అయినా, ‘అవునా’ అనిపించేంత గొప్పగా సాగింది విశ్లేషణ.
BhashaWithAbhilasha Posted ‘Picchekkiddam’ Video
13,030 Likes 200+ Comments 10000+ Plays
ఈ వీడియో ‘పిచ్చి’ చుట్టూ తిరుగుతుంది. ‘పిచ్చెక్కిద్దాం’, ‘పిచ్చిలేస్తుంది’, ‘పిచ్చి పిచ్చిగా ఉంది’ వంటి వేర్వేరు అర్థాలనిచ్చే పదాలను ఎక్కడెక్కడ, ఎలా వాడాలో నేర్పించింది.
BhashaWithAbhilasha Posted ‘Bokkallu’ Video
77,516 Likes 946 Comments 13,75,800 Plays
ఈ వీడియోలో ‘బొక్క’ అన్న మాటను విశ్లేషించింది. కొన్ని ప్రాంతాల్లో బొక్క అంటే ‘ఎముక’, మరికొన్ని చోట్ల రంధ్రానికి పర్యాయ పదం. ‘ఫిదా’లో సాయిపల్లవిలా ‘బొక్కలిరగ్గొడ్తా’ అని తిట్ల దండకం ఎత్తుకునే అమ్మాయిలూ ఉన్నారు. ఈ తేడాలన్నీ చక్కగా వివరించింది అభిలాష.
..ఇవే కావు. ఇలాంటి ఎన్నో వాడుక పదాలను నేర్పిస్తుంది అభిలాష. ఐదేండ్ల క్రితం, ఉద్యోగం నిమిత్తం కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్లింది తను. మొదట్లో భాషాపరమైన సమస్యలు ఎదుర్కొన్నది. ఎలాగోలా కన్నడం ఒంటబట్టించుకున్నది. అక్కడ తెలుగువాళ్లు, తమిళులు, మలయాళీలూ ఎక్కువే. దీంతో దక్షిణాది భాషలన్నీ పరిచయం అయ్యాయి. అప్పుడే, దేశమంతా తిరిగి ప్రాంతీయ భాషలను అధ్యయనం చేయాలనే ఆలోచన వచ్చింది. ముందుగా తెలుగు, తమిళ, కన్నడ భాషలపై పట్టు సంపాదించింది. గత ఏడాది BhashaWithAbhilasha పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీని ప్రారంభించింది. ఆశ్చర్యకరంగా, రాత్రికి రాత్రే ఆమె వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిలాషను దాదాపు లక్షమంది ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ కాకుండా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 112 వీడియోలు పోస్ట్ చేసింది. ఫాలోవర్స్ నుంచి పాజిటివ్ సందేశాలు వెల్లువెత్తుతుంటాయి. ఒక తమిళ యువతి తన అత్తగారికి దగ్గర కావడానికి అభిలాష దగ్గర తెలుగు నేర్చుకున్నది. ఓ గుజరాతీ మహిళ తన కాబోయే కోడలితో పరిచయం పెంచుకోవడం కోసమే తెలుగు పదాలు తెలుసుకున్నది. తానేం పండితురాలు కాదని, ఎవరితో అయినా కమ్యూనికేట్ చేయడానికి సరిపడా భాష మాత్రమే నేర్పిస్తున్నాననీ స్పష్టం చేస్తున్నది అభిలాష. ఇంతమాత్రం భాషాసేవ ఎవరు చేస్తున్నారు మేడమ్!
తాతయ్య స్ఫూర్తితోనే ఈ స్థాయికి వచ్చా.. నా సక్సెస్‌కి ఆయనే కారణమంటున్న దీపికా రెడ్డి”