Telangana Sangeetha Nataka Academy Chairperson Deepika Reddy | పుట్టి నిమిషమైనా కాలేదు. చారెడు కళ్లు అటూ ఇటూ తిప్పుతూ నేత్రాభినయం చేసింది. ‘ఈ అమ్మాయికి డ్యాన్స్ నేర్పండి. గొప్ప కళాకారిణి అవుతుంది’ అని నవ్వుతూ సలహా ఇచ్చారు పురుడుపోసిన డాక్టరమ్మ. ఆ మాటే నిజమైంది. ఆ చిన్నారి కూచిపూడి నృత్యకారిణిగా గొప్ప పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ నృత్యమే శ్వాస, ధ్యాస. తాజాగా తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ అధ్యక్షురాలైంది కూడా! ఆమె పేరు దీపికా రెడ్డి. తాతయ్య నూకల రామచంద్రా రెడ్డి, కాకతీయ యోధురాలు రుద్రమదేవి.. తనను అపారంగా ప్రభావితం చేశారంటూ.. బుడిబుడి అడుగుల నుంచి అంతర్జాతీయ ప్రదర్శనల వరకూ తన కూచిపూడి నృత్య ప్రస్థానాన్ని వివరిస్తున్నారామె.
మా అమ్మ రాధారెడ్డి కూచిపూడి నృత్యకారిణి. రవీంద్ర భారతి ప్రారంభోత్సవ వేడుకలో ‘చిత్రాంగద’ కూచిపూడి బ్యాలేలో ప్రధాన పాత్ర ధరించింది. పెండ్లి తర్వాత నృత్యానికి దూరమైంది. అలా అని, అమ్మ ఎప్పుడూ నృత్యం నేర్చుకోమని నన్ను బలవంతపెట్టలేదు. ఇంట్లో నేర్పే ప్రయత్నమూ చేయలేదు. నేను మా తాత నూకల రామచంద్రారెడ్డిగారి దగ్గర పెరిగాను. నడక నేర్చుకునే సమయానికే తోచినట్టు అడుగులు కదిపేదాన్నట. దీంతో సుమతీ కౌశల్ దగ్గర శిక్షణ ఇప్పించారు. తాతగారు మంత్రిగా ఉన్న రోజుల్లో హైదర్‌గూడలో ఉండేవాళ్లం. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆర్థిక మంత్రిగానూవ్యవహరించారు. గాంధేయవాది. విలాసాలకు దూరం. నన్ను కూడా అలాగే పెంచారు. కూచిపూడి క్లాసుల కోసం హైదర్‌గూడ నుంచి హిమాయత్ నగర్‌కు నడిచే వెళ్లేదాన్ని. అబిడ్స్ గ్రామర్ స్కూల్‌కు సైకిల్ రిక్షాలో వెళ్లేదాన్ని. కొన్నాళ్లకు ఇల్లు మారాల్సి వచ్చింది. దీంతో సిటీ బస్సులో ప్రయాణించాను.
పదకొండేండ్ల వయసులో రవీంద్ర భారతిలో అరంగేట్రం చేశాను. సభలో అక్కినేని నాగేశ్వరరావుగారు ‘ఈ పాప కళ్లు నాకే ఉంటేనా? నేనింతకంటే బాగా నటించేవాణ్ని! తను గొప్ప నాట్యకారిణి అవుతుంది. బాగా ఆలోచించి పెండ్లి చేయండి’ అని మా పెద్దలకు సూచించారు. మా అత్తగారి ఫ్యామిలీకి, మా కుటుంబానికి ఎప్పటినుంచో స్నేహం. నా చిన్నప్పటి నుంచీ ‘మా వాడికి మీ అమ్మాయిని ఇవ్వాలి’ అని మా అత్తగారు అడిగేవారు. అనుకున్నట్లే తన కోడల్ని చేసుకున్నారు. బీఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు కాకముందే, శ్యాంగోపాల్ రెడ్డితో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముందే ఆయనతో నా డ్యాన్స్ కెరీర్ గురించి మాట్లాడాను. వెంపటి చినసత్యంగారి దగ్గర కూచిపూడి నేర్చుకోవాలని ఉందని చెప్పాను. పెళ్లి తర్వాత చినసత్యం గారి దగ్గర శిక్షణకు పంపారు. ఆ సమయంలో గురువుగారి ఇంట్లోనే ఉండేదాన్ని. ఆయన భార్య వండిపెట్టేవారు. చాప మీద పడుకోవడం, ఉదయం అయిదు గంటలకే నిద్ర లేవడం, బావిలో నీళ్లు చేదుకుని స్నానం చేయడం.. అన్నీ నాకు కొత్త అనుభవాలే. సాధారణ మధ్యతరగతి జీవితం ఎలా ఉంటుందో అక్కడే నాకు అర్థమైంది. ‘సాధన… సాధన.. సాధన’ ఇవే శిష్యులకు ఆయన చెప్పే విజయ సూత్రాలు.
ఇరవై రెండేండ్ల క్రితం.. ‘దీపాంజలి’ పేరుతో కూచిపూడి శిక్షణ సంస్థను ప్రారంభించాను. ఇప్పటివరకూ వేలమందికి నృత్యం నేర్పాను. ఆసక్తితో ఎవరొచ్చినా కాదనను. సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతం మాది. పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, సినిమా ప్రముఖుల పిల్లలతోపాటే వాచ్మెన్ల పిల్లలు, డ్రైవర్ల పిల్లలూ శిక్షణ తీసుకుంటారు. ఒక డ్రైవర్ తన ఆరేళ్ల కూతురికి కూచిపూడి నేర్పమంటూ వచ్చాడు. నేర్పించాను. తనూ శ్రద్ధగా నేర్చుకున్నది. ఇప్పుడు నాతోపాటు విమానాల్లో తిరుగుతూ దేశమంతా ప్రదర్శనలు ఇస్తున్నది. ధారాళంగా ఇంగ్లిష్ మాట్లాడుతుంది. కళను ప్రేమించేవాళ్లను ఎప్పుడూ వదులుకోలేను. నా పిల్లల్నీ అలాగే పెంచాను. నాకు కవలలు.. శ్లోక, అభినవ్. ఇద్దరికీ కూచిపూడి నేర్పాను. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. టెన్నిస్ బాగా ఆడతారు. అభినవ్ జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించాడు. శ్లోక కూచిపూడిలో రాణిస్తున్నది. చదువే జీవితం కాదు. అన్నిట్లో అవగాహన ఉండాలి. ఇష్టమైన దాంట్లో ముందుండాలి. ఈమాటే నా పిల్లలతోనూ చెబుతాను.
వెంపటి చినసత్యం, శోభానాయుడు.. కూచిపూడిలో వీరిద్దరే నాకు స్ఫూర్తి. కళతో సామాజిక చైతన్యం తీసుకురావచ్చు. నా లక్ష్యం కూడా ఇదే. కొవిడ్ సమయంలో కొంతమంది ఇంటి యజమానులు నర్సులను గడపతొక్కనివ్వలేదు. ఆ సంఘటన బాధ కలిగించింది. నా కూతురుతో కలిసి, ఇంట్లోనే రికార్డు చేసి కొద్దిపాటి నిడివితో ‘ట్రైబ్యూట్ టు హెల్త్ కేర్ వర్కర్స్’ బ్యాలే చేశాను. ఆ వీడియోను కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో చాలామందితో షేర్ చేసుకున్నారు. తెలుగు, ఇంగ్లిష్ చానల్స్ కూడా ప్రసారం చేశాయి. సమాజంలో శక్తిమంతులైన మహిళలను చూసినప్పుడు, పురాణాల్లో చరిత్రలో చదివినప్పుడు.. అలాంటి పాత్రలు చేయాలనిపిస్తుంది. రుద్రమదేవి నాకు ఇష్టమైన పాత్ర. తరాలనాడే ఓ మహిళ అంతటి కీర్తిని సాధించడం గొప్ప విషయం. సామాజిక అంశాలతోనూ నేను అనేక ప్రదర్శనలు ఇచ్చాను. ఓ కాన్ఫరెన్స్‌లో ‘నమస్కార్ ఇండియా’ పేరుతో భారతీయ సంప్రదాయ నృత్యరీతులన్నీ ప్రదర్శించాను. అది చూసి ‘అద్భుతమైన ప్రదర్శన మేడం’ అంటూ కేటీఆర్ మెసేజ్ చేశారు.
పర్యావరణం, సామాజిక సంక్షేమం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇతివృత్తాలుగా నృత్యాంశాలను రూపొందించాను, ప్రదర్శించాను. తాతయ్య ప్రభావం, సమాజంపట్ల అవగాహన.. ఈ రెండూ లేకపోతే ఇలాంటి ఆలోచనలే వచ్చేవి కాదేమో! ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు నన్ను తెలంగాణ సంగీత, నాటక అకాడమీ అధ్యక్షురాలిగా నియమించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దశాబ్దాల నృత్యసేవకు గుర్తింపు ఇది. ఈ పదవి ద్వారా.. కళల అభివృద్ధికి కృషి చేస్తాను. చిన్నచిన్న పట్టణాల్లో కూడా నృత్యశిక్షణలు, ప్రదర్శనలు జరిగేలా చర్యలు తీసుకుంటాను. యువతను ప్రోత్సహిస్తాను.
…✍ నాగవర్ధన్ రాయల, 📷 గడసంతల శ్రీనివాస్
“అమ్మాయిల తనువులపైనే అద్భుతమైన చిత్రాలు.. హైదరాబాదీ కళాకారిణి ఎందుకిలా చేస్తుంది?”