శనివారం 06 జూన్ 2020
Zindagi - May 19, 2020 , 23:01:41

నలుగురి కోసం.. మూడునెలల జీతం!

నలుగురి కోసం.. మూడునెలల జీతం!

సాధించక ముందు సమాజ జపం చేసి.. సాధించాక మరిచి పోయేవాళ్లు చాలామందే. సమాజానికి ఎంతో కొంత తిరిగి  ఇవ్వాలనే ఆలోచన కొందరిలోనే చూస్తుంటాం. వారిలో ఒకరు ఈ ఓరుగల్లు బిడ్డ. కష్టపడి చదివి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించి.. వరుసగా మూడు నెలల సంపాదనని ఇచ్చి జీతం కన్నా జీవితాలు ముఖ్యమని నిరూపించింది! 

మానవాళి ఇంతకు మునుపెన్నడూ ఎదుర్కోని ఆపద కరోనా. మనుషుల్నే కాదు.. మనసుల్ని కూడా కదిలించింది ఈ విపత్తు. బుక్కెడు బువ్వ మాత్రమే దొరికే అమ్మలు కూడా ఆ బుక్కలో నుంచి కొంత పక్కవాళ్లకు పంచిన సంఘటనలు చూస్తున్నాం. ఒక యువతి తన శక్తికి మించిన సాయం చేసి సమాజం పట్ల బాధ్యతను చాటుకుంది. 

ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన ఆశ్లేష కష్టపడి చదువుకుంది. డాక్టర్‌ కావాలన్నది  ఆమె లక్ష్యం. కానీ కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో, ఆ ఖరీదైన కలని వదులుకున్నది.  పది మందికి సాయం చేసే వైద్య రంగంలో స్థిరపడాలనే ఆకాంక్ష విషయంలో మాత్రం రాజీపడలేదు. తీవ్ర పోటీలో నెగ్గుకొచ్చి 2018లో స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగానికి ఎంపికయ్యింది. మూడు నెలల క్రితం హైదరాబాద్‌ ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో  విధుల్లో చేరింది. 

కదిలించిన కరోనా : కరోనాపై మనిషి చేస్తున్న పోరాటాన్ని చూసి చలించిపోయింది ఆశ్లేష. కరోనా వల్ల పేదల జీవితాలు ఏ విధంగా ఆగమయ్యాయో ప్రత్యక్షంగా చూసింది. తన వంతు సాయంగా  ఏమీ చేయలేనా అన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ను సంప్రదించి, తన మూడో నెల జీతం రూ. 70, 308 విరాళంగా అందజేసింది. ఆ డబ్బుతో నగరంలోని పెయింటర్లకు నిత్యావసర సరుకులు అందజేయాలని కోరింది. ఆశ్లేష సేవా భావాన్ని మెచ్చిన వినయ్‌ భాస్కర్‌ నగరంలోని పెయింటర్లు, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు బియ్యం, ఉప్పూ పప్పూ అందజేశారు.  

కాలేజీకి మొదటి జీతం : ఆశ్లేషకు బాల్యం నుంచీ సేవాగుణం అధికం.  ఏదో ఒక రూపంలో తాను చదువుకున్న కాలేజీ రుణం తీర్చుకోవాలని అనుకున్నది. మొదటి నెల జీతం.. రూ.70, 308 వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజ్‌కి అనుబంధంగా ఉన్న నర్సింగ్‌ కళాశాలకు అందజేసింది. ఇక్కడే ఆమె బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసింది. 

  ఊరికి రెండో జీతం : ఆశ్లేష తండ్రి సత్యనారాయణ హనుమకొండలో పెయింటర్‌. తల్లి జ్యోతి టీచర్‌గా పనిచేస్తున్నారు. తాను పుట్టి.. పెరిగిన సొంతూరు వెంకటాపురానికి కూడా ఏదైనా చేయాలి అనుకున్నది ఆశ్లేష. తన రెండోనెల జీతం రూ. 70, 308 గ్రామ అభివృద్ధికి విరాళంగా ఇచ్చింది. 

కన్నీళ్లు తుడవాలని:  కష్టపడి చదివి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించినా. డబ్బుది ఏముంది, ఎలాగో ఉద్యోగం ఉంది కదా? ఇవాళ కాకపోతే రేపు సంపాదిస్తా. కానీ కరోనా లాంటి విపత్తు వల్ల ఎందరి జీవితాలు ఇబ్బంది పడుతున్నాయో కళ్లారా చూస్తున్నా. ఈ సమయంలో  వాళ్ల కన్నీళ్లను తుడిచి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో జీతం డబ్బులు విరాళంగా ఇచ్చాను. మిగతా రెండు నెలల జీతాలు కూడా ఇదే బాధ్యతతో ఇచ్చినవే. నాకు జీతం కన్నా  జీవితాలు ముఖ్యం.   - అశ్లేష 


logo