e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home యాదాద్రి అభివృద్ధి అనం(తం)తారం

అభివృద్ధి అనం(తం)తారం

అభివృద్ధి అనం(తం)తారం
  • పల్లెప్రగతితో సకల సౌకర్యాలు
  • చివరి మజిలీకి తీరిన ఏండ్లనాటి కష్టం
  • పారిశుధ్యంతో పరిశుభ్రం
  • పచ్చదానికి కేరాఫ్‌ పల్లె ప్రకృతివనం
  • ఆకర్షణీయంగా కనిపిస్తున్న నర్సరీ

భువనగిరి అర్బన్‌, మే 10 : గ్రామంలోని దశాబ్దాల వ్యథలు, గతుకుల రోడ్లు, పారిశుధ్య సమస్యలు తీరడంతో గ్రామ రూపురేఖలు మారాయి. పల్లెప్రగతితో ఏడాదిలోనే గ్రామంలో కొత్తశోభ సంతరించుకుని సకల సౌకర్యాలతో ఆకట్టుకుంటుంది. పల్లెప్రకృతి వనంలో ఏపుగా పెరిగిన మొక్కలు, సీసీ రోడ్లు, చివరి మజిలీ కార్యక్రమం సంతృప్తిగా జరిపించడానికి ఏర్పాటు చేసిన వైకుంఠధామంలో దహనవాటికలు, స్త్రీ, పురుషుల స్నానపు గదులు, సకల సౌకర్యాలు, పార్కును తలపిస్తున్నది. గ్రామంలో రోడ్లకు ఇరు పక్కల నాటిన మొక్కలతో స్వచ్ఛ పల్లెగా మారిన అనంతారం గ్రామం మండలంలో ఆదర్శంగా నిలుస్తున్నది.

మారిన గ్రామ రూపురేఖలు..
భువనగిరి మండలంలోని అనంతారం గ్రామం మండలంలో అతిపెద్ద గ్రామపంచాయతీ. 429 ఇండ్లు, 1986 జనాభా ఉండగా, 1778 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిధులు అందలేక అభివృద్ధికి నోచుకోలేక నిర్లక్ష్యానికి గురైంది. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలో తెలియక గ్రామస్థులు సమీపంలోని చెరువు వద్ద చేసే వారు. చెరువు గ్రామానికి సమీపంలోనే ఉండటంతో చుట్టు పక్కల ఇండ్లలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రస్తుతం గ్రామానికి అరకిలోమీటర్‌ దూరంలో వైకుంఠధామం ఏర్పాటు చేయడంతో గ్రామ ప్రజలకు చివరి మజిలీలో ఇబ్బందులు తప్పాయి. అందులో స్నానపు గదులు, వాటర్‌ట్యాంకు ఏర్పాటు చేశారు. పక్కన మొక్కలు నాటడంతో వైకుంఠధామం పార్కును తలపించడం గ్రామం ప్రత్యేకత. చెత్త ఎక్కడపడితే అక్కడ వేయడంతో మురుగు కాల్వల్లో కవర్లు, చెత్త, పేపర్లతో నిండి దుర్వాసన వెదజల్లేది. సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన పల్లెప్రగతితో ఏడాదిలోనే గ్రామ రూపురేఖలు మారాయి. ప్రతిరోజు పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికీ చెత్త సేకరణ నిర్వహిస్తుండటంతో గ్రామమంతా క్లీన్‌గా ఉండటంతోపాటు నాటిన మొక్కలతో గ్రీన్‌గా మారింది.

అభివృద్ధిలో ఆదర్శం…
పల్లె ప్రగతిలో భాగంగా అభివృద్ధిలో అనంతారం ఆదర్శంగా నిలుస్తున్నది. రూ.9.20లక్షలతో ట్రాలీతో కూడిన ట్రాక్టర్‌, ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు. ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులు రోజూ ఉదయాన్నే చెత్త సేకరించి ట్రాక్టర్‌లో డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. డంపింగ్‌ యార్డును చెత్తతో సేంద్రియ ఎరువు చేయడానికి చెత్తను హౌజ్‌లలో కులియబెట్టారు. వచ్చిన సేంద్రియ ఎరువును చెట్లు పెరగడానికి వాడుకోనున్నారు. రైతు సమస్యల పరిష్కారానికి మూడు గ్రామాలకు ఒకటిగా ఏర్పాటు చేసిన రైతు వేదికను గ్రామ సమీపంలో ఏర్పాటు చేశారు. రూ.13.50లక్షలతో గ్రామంలో ఆధునిక వైకుంఠధామం, రూ.3.50 లక్షలతో డంపింగ్‌ యార్డు షెడ్డును నిర్మించారు. గ్రామంలో శిథిలమైన ఇనుప విద్యుత్‌ స్తంభాలను తొలగించి నూతనంగా సిమెంట్‌ స్తంభాలు ఏర్పాటు చేశారు. అక్కడక్కడ ఉన్న లూజ్‌ వైర్లను సరి చేయడంతోపాటు 4 కిలోమీటర్ల మేర థర్డ్‌ వైరు వేశారు. హరితహారంలో రోడ్ల వెంబడి 300, శ్మశానవాటికలో 500, కళాశాలల్లో 1000, పల్లెప్రకృతి వనంలో 4000, చెరువుకట్టకు 300 ఈత చెట్లను నాటి హరితవనంలా గ్రామాన్ని మార్చుకున్నారు. ఇలా సకల సౌకర్యాలతో గ్రామం మండలంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో ఎలాంటి దొంగతనాలు, గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినా గుర్తించేందుకు వీలుగా, గ్రామాన్ని నేరరహిత గ్రామంగా మార్చడానికి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నా..
సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన పల్లె ప్రగతిని పకడ్బందీగా అమలు చేస్తూ పాలకవర్గ సభ్యుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను. అభివృద్ధి పనులను ప్రణాళికతో చేపడుతున్నా. వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశాం. పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటడంతోపాటు ఇంటింటికీ ఐదు మొక్కలు పంపిణీ చేసి సంరక్షించేలా చేస్తున్నా. పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా చేపట్టేలా చర్యలు చేపడుతూ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మార్చుకుంటున్నాం.

  • చిందం మల్లిఖార్జున్‌, అనంతారం, సర్పంచ్‌

గ్రామం రూపురేఖలు మారాయి
పల్లె ప్రగతిలో చేపట్టిన పనులతో గ్రామం రూపురేఖలు మారాయి. గ్రామంలో వర్షం పడితే చిత్తడిగా మారేది. సీసీ రోడ్లు ఏర్పాటుతో గ్రామంలో ఆ ఇబ్బందులు తప్పాయి. గ్రామంలో వైకుంఠధామం లేక చాలా ఏండ్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు పోయాయి. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పాలకవర్గ సభ్యులు, ప్రజల సహకారంతో ముందుకెళ్తున్నాం.

  • విఠల్‌ వెంకటేశ్‌, ఉప సర్పంచ్‌, అనంతారం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధి అనం(తం)తారం

ట్రెండింగ్‌

Advertisement