బుధవారం 23 సెప్టెంబర్ 2020
Yadadri - Aug 15, 2020 , 00:39:34

క‌రోనాను జ‌యించారు

క‌రోనాను జ‌యించారు

  • l వైరస్‌ బారిన పడిన 30 మంది పోలీసులు 
  • l మనోధైర్యంతో పోరాడి గెలిచిన యోధులు 
  • l పదిమంది వరకు తిరిగి విధుల్లోకి.. 
  • l ఆరోగ్య నియమాలు, ఉన్నతాధికారుల భరోసాతో రికవరీ 
  • l వ్యాయామం, బలవర్థకమైన ఆహారంతో వైరస్‌ పరార్‌ 
  • l మనోధైర్యమే కరోనాకు విరుగుడంటున్న బాధిత పోలీసులు  

కరోనా వస్తే ఏమైతది.. అని మనోధైర్యం, గుండెనిబ్బరంతో వైరస్‌ను ఓడించారు పోలీసులు. విధి నిర్వహణలో జిల్లావ్యాప్తంగా 30 మంది పోలీసులు వైరస్‌ బారినపడ్డారు. కొందరు ఆస్పత్రుల్లో, మరికొందరు స్వీయ నిర్బంధం (హోంఐసొలేషన్‌)లో ఉన్నారు. ప్రభుత్వమందించిన కిట్‌, ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది సూచనలను చక్కగా పాటించి దాదాపు 10 మంది కోలుకొని తిరిగి విధులు నిర్వర్తిస్తున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, డీసీపీ నారాయణరెడ్డిలు ఎప్పటికప్పుడు బాధిత సిబ్బందిని వాకబు చేసి వారికి కొండంత భరోసా ఇచ్చారు. నిత్యం వ్యాయామం, యోగా, చక్కటి ఆహారం, డ్రైఫ్రూట్స్‌ తినడంతోపాటు డాక్టర్ల సూచనలు పాటించి కరోనాను ఓడించామని బాధిత పోలీసులు వెల్లడించారు. 

 -భువనగిరి క్రైం 

భువనగిరి క్రైం : కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ముందువరుసలో ఉండి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను సైతం ఈ వైరస్‌ వేధిస్తోంది. కరోనా నియంత్రణలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని సందర్భాల్లో వారు వైరస్‌బారినపడుతున్నారు.  జిల్లాలో  అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కరోనావైరస్‌ విజృంభణ మరింత పెరిగింది.నేరాల కట్టడితో పాటు వాహనాల తనిఖీలు, నేరాలకుపాల్పడ్డ వారిని అరెస్ట్‌ చేయడం, ట్రాఫిక్‌నిబంధనలు, అందరూ మాస్కు పెట్టుకునేలాచూడటం,ఇతరత్రా బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులు వైరస్‌కు గురవుతున్నారు. 

 జిల్లాలో 30 మంది వరకు...

జిల్లాలో 30 మంది  వరకు పోలీసులు కరోనా బారిన పడినట్లు తెసుస్తోంది.  ఇందులో 23 మంది కానిస్టేబుళ్లు,  ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఇద్దరు ఎస్సైలు, ఒక ఏసీపీ, ఒక సీఐ, ఒక ఆర్‌ఐ ఉన్నట్లు సమాచారం. ఇందులో పది మంది వరకు ఇప్పటికే కరోనాను జయించి తిరిగి విధులు నిర్వహిస్తున్నారు.మిగతా వారు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. అయితే కరోనా బారిన పడిన తర్వాత వీరు హోం ఐసొలేషన్‌లో ఉన్న సమయంలో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. దీంతో బాధితులు సైతం ఎప్పటికప్పుడు ధైర్యంగా ఉంటున్నారు. అయితే ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఎంత మాత్రం ఆత్మైస్థెర్యం తగ్గడం లేదు. వైరస్‌ వచ్చిందని తెలిసిన వెంటనే హోం ఐసొలేషన్‌కు వెళ్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని వైరస్‌ను జయించి  మళ్లీ విధుల్లో చేరుతున్నారు.   

మనోధైర్యం కోల్పోకుండా....

కరోనా బారినపడిన పోలీసులకు ఉన్నతాధికారులు మాత్రం ఎప్పటికప్పుడు భరోసా కల్పిస్తున్నారు. దీంతో వారు ఎట్టిపరిస్థితుల్లో కూడా తమ మనోధైర్యాన్ని కోల్పోకుండా వైరస్‌ను విజయవంతంగా  జయిస్తున్నారు. కరోనా బారిన పడిన సిబ్బందికి రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, డీసీపీ నారాయణరెడ్డి ఎప్పటికప్పుడు ఫోన్‌ చేస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. దీంతో వారి ఆరోగ్య పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వారికి డాక్టర్లతో సలహాలు సూచనలు ఇప్పిస్తున్నారు.  ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడంతో వారిలో మనోధైర్యం పెరుగుతోంది. రోజూ ఆహారం, వ్యాయామం, యోగా, మెడిటేషన్‌, రోగనిరోధక శక్తి, తదితర విషయాల మీద ఉన్నతాధికారులు, డాక్టర్లు సూచనలు ఇస్తున్నారు.\

మనోధైర్యమే  ప్రధానాయుధం 

కరోనా వచ్చిందని తెలిసిన వెంటనే మా ఆరోగ్యం గురించి  రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌తో పాటు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మాతో మాట్లాడారు.  మా ఆరోగ్యం, కుటుంబ సభ్యుల స్థితిగతులు తెలుసుకొని మాలో  ఆత్మైస్థెర్యాన్ని పెంచారు. మా కోసం ప్రత్యేకంగా డాక్టర్‌ను ఏర్పాటుచేశారు. కరోనాను జయించి తిరిగి విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది.   ఉన్నతాధికారులు మాకు అందించిన ధైర్యాన్ని ఎప్పటికీ మరువలేము. ప్రజలు కూడా కరోనా గురించి భయపడకుండా  లక్షణాలు కనిపించిన వెంటనే హోంఐసొలేషన్‌కు వెళ్లడం చాలా మంచిది. ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉంటే కొద్ది రోజుల్లోనే తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాం. 

-శంకర్‌, ట్రాఫిక్‌ ఏసీపీ, యాదాద్రి భువనగిరి


logo