వరంగల్, మే 12: చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పక్కా ప్రణాళికలతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అడుగులు వేస్తోంది. రోజు రోజుకు విస్తరిస్తూ 10 లక్షల జనాభా కలిగిన నగరంలో మానవ వర్థ్యాల శుద్ధిపై జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రూ. 5.5 కోట్ల నిధులతో నగర శివారులోని అమ్మవారిపేటలో చేపట్టిన 150 కేఎల్డీ ఎఫ్ఎస్టీపీ పనులు వేగంగా సాగుతున్నాయి. మరో రెండు నెలల్లో ప్లాంట్‌ను ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2 లక్షల 50 వేల గృహాలు ఉన్న గ్రేటర్ పరిధిలోని 1.75 లక్షల గృహాల్లో సెప్టిక్ ట్యాంకులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మిగిలిన గృహాల్లో స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్మాణం చేసిన పిట్ మరుగుదొడ్లుగా అధికారులు లెక్కలు చెబుతున్నారు. సెప్టిక్ ట్యాంకును ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి క్లీనింగ్ చేసేలా అధికారులు ఆస్కీతో కలిసి ప్రణాళికలు చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే 15 కేఎల్డీ, 10 కేఎల్డీ సామర్థ్యం కలిగిన రెండు ఎఫ్ఎస్టీపీలు ఉన్నాయి. తాజాగా 150 కేఎల్డీ సామర్థ్యం కలిగిన మూడో ప్లాంట్ నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. నగర పరిశుభ్రతే లక్ష్యంగా మానవ వ్యర్థ్యాల శుద్ధీకరణపై పక్కా ప్రణాళికలతో గ్రేటర్ పాలకులు అడుగులు వేస్తున్నారు.
రాష్ట్రంలో తొలి ఎఫ్ఎస్టీపీ గ్రేటర్‌లోనే..
రాష్ట్రంలో తొలి మానవ వర్థాల శుద్ధీకరణ ప్లాంట్ నగర శివారు అమ్మవారిపేటలో ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల కిత్రం 2018లో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన15 కేఎల్డీ సామర్థ్యం కలిగిన మానవ వ్యర్థ్యాల శుద్ధి కేంద్రం రాష్ట్రంలోనే తొలి ప్లాంట్‌గా నిలిచింది. అనేక మున్సిపాలిటీ పాలకవర్గాలతో పాటు అధికారులు ఇక్కడి వచ్చి ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గ్రేటర్ ఎఫ్ఎస్టీల ఏర్పాటుపై దృష్టిపెట్టింది. తొలి ప్లాంట్ ఏర్పాటు చేసిన ఏడాదికి 10 కేఎల్డీ సామర్థ్యం కలిగిన రెండో ప్లాంట్‌ను నిర్మించారు. రోజు రోజుకు విస్తరిస్తున్న నగరంలో ప్రస్తుతం మూడో ప్లాంట్‌ను నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రెండు ఎఫ్ఎస్టీపీలు ఉన్న అమ్మవారిపేటలోనే 1.5 ఎకరాల స్థలంలో రూ. 5.5 కోట్ల నిధులతో 150 కేఎల్డీ సామర్థ్యం కలిగిన ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన మిలియరేట్ సంస్థ సహకారంతో ఇజ్రాయిల్ టెక్నాలజీతో మానవ వ్యర్థ్యాల శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.
పురోగతిలో పనులు
ఇప్పటికే సివిల్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రహరీ నిర్మాణం పూర్తి చేశారు. అడ్మిస్ట్రేషన్ రూంతో పాటు రోడ్లు, మానవ వ్యర్థ్యాలను శుద్ధి చేసే షెడ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ టెక్నాలజీ యంత్రాలను పుణె నగరం నుంచి తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. షెడ్ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే యంత్రాలు అమర్చనున్నారు. మిలియరేట్ సంస్థ 10 సంవత్సరాలు పాటు నిర్వహణ చేసేలా గ్రేటర్ అధికారులు ఒప్పందం చేసుకున్నారు.
మూడు జోన్లుగా నగరం
మానవ వ్యర్థ్యాల శుద్ధికి గ్రేటర్, ఆస్కీ సంయుక్తంగా పక్కా ప్రణాళికలు రూపొందించారు. నగరాన్ని మూడు జోన్లుగా విభజించారు. గ్రేటర్ పరిధిలోని 2 లక్షల 50 వేల గృహాలను మూడు జోన్లుగా విభజించి ప్రతి సెప్టిక్ ట్యాంకు మూడు ఏళ్లకు ఒకసారి క్లీనింగ్ చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఒక జోన్‌కు 85 వేల గృహలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏడాది కాలంలో ఒక జోన్‌లోని గృహాల సెప్టిక్ ట్యాంకులను క్లీనింగ్ చేయనున్నారు. ఇలా మూడేళ్లలోనిబంధనల ప్రకారం గ్రేటర్‌లోని ప్రతి సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ ప్రకియ పూర్తి చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే 20 సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ ట్యాంకర్లకు లెసెన్స్ ఇచ్చారు. మూడో ప్లాంట్ ప్రారంభమైతే మరో 15 ట్యాంకర్ల అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మానవ వ్యర్థాలతో ఎరువు ఉత్పత్తి
మావన వ్యర్థాలతో ఎరువులు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం రెండు ఎఫ్ఎస్టీపీలలో ఉత్పత్తి అవుతున్న ఎరువులను రైతులకు ఉచితంగా అందజేస్తున్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో వినియోగిస్తున్నారు. దీంతో పాటు ఎస్ఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మానవ వ్యర్థాలతో తయారవుతున్న ఎరువుతో ఇటుకల తయారీపై పరిశోధన చేస్తున్నారు. మూడో ప్లాంట్ ప్రారంభమైతే పెద్ద ఎత్తున మానవ వ్యర్థాల శుద్ధితో తయారయ్యే ఎరువుతో ఇటుకల తయారీకి ప్రణాళికలు చేస్తున్నారు.
చాలా మార్పు వచ్చింది
మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసిన తర్వాత చాలా మార్పు వచ్చింది. గతంలో ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకు క్లీనర్స్ మానవ వ్యర్థాలను నగర శివారు ప్రాంతాల్లోని చెరువులు, ఖాళీ ప్రాంతాల్లో వేసేవారు. గ్రేటర్ ఎఫ్ఎస్టీపీలను ఏర్పాటు చేసి, సెప్టిక్ క్లీనింగ్ ట్యాంకర్లకు లైసెన్స్ ఇవ్వడంతో ప్రతి రోజు మానవ వ్యర్థాలు ఎఫ్ఎస్టీపీలకు వస్తున్నాయి. నాలుగేళ్లలో 50 లక్షల లీటర్ల మానవ వ్యర్థాలను శుద్ధి చేశాం. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న 150 కేఎల్డీ ప్లాంట్ గ్రేటర్ గృహాలకు సరిపోతుంది. అదనంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసి పక్కాగా మానవ వ్యర్థాలు ప్లాంట్‌కు తీసుకెళ్లేలా ప్రణాళికలు చేశాం.
రాజ్‌మోహన్, ఆస్కీ ప్రతినిధి