హనుమకొండ, నవంబర్ 25: బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం హనుమకొండకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్న దీక్షా దివస్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న నాటి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన దీక్షకు ప్రత్యేకత ఉందన్నారు. ఆనాడు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి అరవై ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఏటా 11 రోజులపాటు దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహిస్తున్నామని, హనుమకొండ, వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశంలో ముఖ్య కార్యకర్తలతో మమేకం కానున్నారని, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
కేసీఆర్ గాంధేయ మార్గంలో తెలంగాణను సాధించారని, ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారన్నారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రపంచమే అబ్బురపడేలా ప్రాజెక్టులు నిర్మించారని, మిషన్ భగీరథ, హరితహారం తదితర అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. దీక్షా దివస్ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరో పోరాటం చేస్తామని వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. సమావేశంలో కార్పొరేటర్లు చెన్నం మధు, రంజిత్‌రావు, సోదా కిరణ్, బొంగు అశోక్‌యాదవ్, పార్టీ నాయకులు హరి రమాదేవి, పులి రజినీకాంత్, జోరిక రమేశ్, పోలపల్లి రామ్మూర్తి, సల్వాజి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
జనగామలోనూ …
జనగామ (నమస్తే తెలంగాణ) : హనుమకొండలో సన్నాహక సమావేశం ముగిసిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనగామకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు యశ్వంతపూర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించే సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొననున్నారు.
ఫిరాయింపులే కడియం బ్రాండ్
అవసరాలకు అనుగుణంగా పార్టీ ఫిరాయించుడే కడియం శ్రీహరి బ్రాండ్. పిచ్చిపట్టినట్లుగా పూటకో మాట మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొకుతూ రాజ్యాంగాన్ని, స్పీకర్‌ను అవమానిస్తున్నాడు. డిపాజిట్ రాదని తెలిసే రాజీనామా చేయనని అంటున్నాడు. కాంగ్రెస్ నాయకులే ఆయనపై తిరగబడుతున్నారు. తాను నీతిమంతుడినని చెప్పుకునే శ్రీహరి దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల్లో మంచి పేరుందని కితాబిచ్చుకుంటున్న కడియం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరిగితే ప్రజలు పూలదండలు వేస్తారో.. చెప్పుల దండలు వేస్తారో తెలుస్తుంది. ఇప్పటి వరకు గ్రూపు రాజకీయాలు తప్ప చేసింది శూన్యం. నీవు నీతిమంతుడివైతే రెండేళ్లలో చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి. నాయిని రాజేందర్‌రెడ్డి దళితులతో గోక్కుంటున్నాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడుతాం, నిలదీస్తాం, హెచ్చరిస్తాం.
– డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి