ఖిలావరంగల్: దేశంలో ప్రతి వ్యక్తికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించడానికి మన రాజ్యాంగమే ప్రధాన ఆధారం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్య శారద అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు.
మన రాజ్యాంగం అందించే హక్కులు, అవకాశాల ద్వారానే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం సమానత్వానికి, న్యాయసూత్రాలకు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీపీవో కల్పన, డీబీసీడీవో పుష్పలత, ఆర్డీఓలు సుమ, ఉమారాణితోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.