హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సంబంధించి ఈ ఏడాది అర్హులైన బీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పేర్కొంది.
ఈ పథకం ద్వారా లబ్దిదారుల సంఖ్యను సంవత్సరానికి 300 నుంచి 700 పెంచినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇందులో 500 మంది బీసీలకు, 200 మంది ఈబీసీలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. స్ప్రింగ్ అండ్ ఫాల్ సెషన్‌కు 250 మంది బీసీలకు, 100 మంది ఈబీసీలకు చొప్పున కేటాయించామని పేర్కొన్నారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారి కుటుంబ వార్షిక ఆదాయం అన్నీ కలిపి రూ.5 లక్షల కన్నా తకువగా ఉండాలి. దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి వయస్సు 35 ఏండ్లు నిండకూడదు. డిగ్రీలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు ఉండాలి. జీఆర్ఈ-260 మారులు లేదా జీ మ్యాట్- 500 మారులు ఏదైనా ఒక పరీక్షలో సాధించి ఉండాలి. టొఫెల్ 60 మారులు లేదా ఐఈఎల్టీఎస్-60 మారులు లేదా పీటీఈ-50 మారులు ఏదైనా ఒక పరీక్షలో సాధించి ఉండాలి.