బెంగుళూరు: బెంగుళూరులో నకిలీ నందిని నెయ్యి(Fake Nandini Ghee) అమ్మిన రాకెట్ గుట్టు తేలిన విషయం తెలిసిందే. ఆ కేసులో సూత్రధారులుగా భావిస్తున్న భార్యాభర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఆ జంటను శివకుమార్, రమ్యగా గుర్తించారు. మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించిన ఆ దంపతులు.. నందిని బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి అమ్మారు. నందిని బ్రాండ్.. కర్నాటక సహకార పాల ఉత్పత్తి సమాఖ్యకు చెందిన విషయం తెలిసిందే. సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ నకిలీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ భారీ, హై టెక్ మెషీన్లను గుర్తించారు. నకిలీ నెయ్యి తయారు చేసేందుకు ఆ మెషీన్లు వాడినట్లు తెలుస్తోంది.
చాలా అత్యాధునిక పరిశ్రమ పరికరాలతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నెయ్యి ఉత్పత్తి కోసం వాడిన అన్ని ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. ఈ రాకెట్లో నిమగ్నమైన నలుగురు వ్యక్తులను గతంలోనే అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ భారత దేశంలో నందిని పాల ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉన్నది. ఆ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యక్తులు నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.
సరఫరా చేస్తున్న విధానంలో అనుమానాలు రావడంతో ఇంటర్నల్ చెకింగ్ నిర్వహించారు. దీని ఆధారంగా క్రైం బ్రాంచ్ స్క్వాడ్‌తో పాటు కేఎంఎఫ్ విజిలెన్స్ వింగ్ రహస్య సమాచారం ద్వారా నకిలీ యూనిట్‌పై దాడి చేశారు. చామరాజపేటలో ఉన్న కృష్ణ ఎంటర్‌ప్రైజస్‌కు చెందిన గోడౌన్లు, షాపులు, వాహనాలను తనిఖీ చేయడంతో రాకెట్ గుట్టు బయటపడింది. స్వాధీనం చేసుకున్న కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అన్న కోణంలో విచారిస్తున్నారు.