Gudimalla Ravikumar | హనుమకొండ చౌరస్తా, జూలై 5 : తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయిన ఉద్యమకారులను ఓదార్చడానికి ఆగస్టు నుంచి ఉద్యమకారుల ఓదార్పు యాత్ర చేపడతామని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ తెలిపారు.
ఆదివారం హనుమకొండ కాకతీయకాలనీలోని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ర్ట అడ్‌హక్ కమిటీ సభ్యుడు ఓడవపెల్లి శ్యామకృష్ణ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం నాటి విలీన కాలం నుంచి నిన్నటి వేర్పాటు వరకు ఆరు దశాబ్దాల పాటు వేలాది మంది ఉద్యమకారులు పోరాడి అమరులయ్యారని, మరికొందరు జైలు పాలై కేసులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా అమరులు కాని, జైలు పాలుకాని, కేసులు ఎదుర్కొనకపోయినా తమ సర్వస్వాన్ని కోల్పోయి రాష్ర్ట సాధన కోసం పోరాడిన ఉద్యమకారులు వేలాదిమంది ఉన్నారని, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో ఉద్యమకారులకు 240 గజాల స్థలం, 25,000 పెన్షన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ, రెండున్నరేళ్లవుతున్నా ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేదని మండిపడ్డారు. కేశవరావు కమిటీ ఏర్పాటు స్వాగతించదగ్గదే కానీ కమిటీ పేరుతో కాలయాపన చేస్తే ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు కూడా సరిపోవని హెచ్చరించారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. 250 గజాల స్థలం కేటాయించాలి, రూ.10 లక్షలు ఉద్దీపన ఇవ్వాలి, రూ.25 వేల పెన్షన్ అందించాలన్నారు.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో సంక్షేమ భవనాలు నిర్మించాలని, కేశవరావు కమిటీని కలిసి వివిధ వర్గాల ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తొలిదశలో ఉద్యమకారుల సన్మానం..
తొలిదశలో పోరాడిన 10 మంది ఉద్యకారులను సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఉద్యమకారుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులను ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ గుడిమళ్ల రవికుమార్ అన్నారు. ఈ సమావేశంలో సందేళ సునీల్, ఎండి.చాంద్‌పాషా, బొలిశెట్టి అశోక్, అనుముల రమేశ్, చెన్నూరి నటరాజ్, మనోహర్‌రావు, మొగసాల దేవేందర్‌రెడ్డి, మీర్జా అంజాద్, రాంకుమార్, మొలంగూరి నెల్సన్, గోపన్నబోయిన రాజు, బరిగాల కృష్ణమూర్తి, ఇమాడిశెట్టి రాజు, ఖాదీర్, స్వర్ణ, పద్మ, ఉద్యమకారులు పాల్గొన్నారు.
