Atlee | హాలీవుడ్ డైరెక్టర్, ఆస్కార్ విజేత క్రిస్టఫర్ నోలన్ తీసిన ‘ది ఒడిస్సీ (The Odyssey)’ సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చూసిన ప్రతిఒక్కరూ అద్భుతమని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆ జాబితాలో రాకా డైరెక్టర్ అట్లీ కూడా చేరారు. అల్లు అర్జున్, దీపికా పదుకొణెతో రాకా సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాను ఐమ్యాక్స్‌లో చూశారు. తాను ఇటీవల చూసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా అద్భుత అనుభూతిని ఇచ్చిందని అన్నారు. నోలన్ కథనం, విజువల్స్, సినిమాటోగ్రఫీ, లుడ్విగ్ గోరాన్సన్ సంగీతం తనను అబ్బురపరిచాయని ప్రశంసలు కురిపించారు. హోమర్ రచించిన ప్రాచీన గ్రీకు ఇతిహాసాన్ని నోలన్ తెరకెక్కించిన తీరు నభూతో నభవిష్యత్ అన్న చందంగా ఉందని కొనియాడారు. ఈ సినిమాను పెద్ద స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుందని అన్నారు.
లీనమయ్యే సినిమా
ఈ సినిమా గురించి అట్లీ సోషల్ మీడియాలో (Social Media) సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేశారు. మీరు చూసే సినిమాలు కొన్ని ఉంటాయి. మీరు మెచ్చుకునే సినిమాలు ఇంకొన్ని ఉంటాయి. కానీ చాలా అరుదుగా మిమ్మల్ని పూర్తిగా వేరే లోకానికి తీసుకెళ్లే సినిమాలు మరికొన్ని ఉంటాయి. ది ఒడిస్సీ అలాంటి సినిమా అని రాసుకొచ్చారు. నోలన్ చిత్రణ తనదైన భాషలో మాట్లాడినట్లు అనిపించింది. కథలో కెమెరా మరో ముఖ్య పాత్ర పోషించినట్లుగా ఉంది. ఇక సంగీతం విజువల్స్‌కు తగ్గట్టుగా భౌతిక అనుభూతిని, ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. థియేటర్ అనుభవాన్ని గొప్పగా ఈ సినిమా చూపించిందని, ఐమ్యాక్స్‌లోనే ఈ సినిమాను చూడాలని కోరారు. కొన్ని సినిమాలు చూడటానికే ఉంటే, లీనమైపోయి అందులో జీవించే సినిమా కోవలో ది ఒడిస్సీ ఉందని ముగించారు. అట్లీ వ్యాఖ్యలు ఈ సినిమా భారీ విజువల్స్, లీనమయ్యే యాక్షన్ సీన్స్‌పై నోలన్ ఎంతగా దృష్టిపెట్టారో అని పేర్కొంటున్నాయి.
ట్రోజన్ యుద్ధం తర్వాత ఒడిస్సియస్ (మాట్ డామన్) ఇంటికి తిరిగి వెళ్లే ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ది ఒడిస్సీ చెబుతుంది. తన భార్య పెనెలోప్ (అన్నే హాత్వే), కుమారుడు టెలిమాకస్ (టామ్ హాలాండ్)ల వద్దకు వెళ్లే తీరును ఆకట్టుకునే విధంగా తీశారు.