Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన భార్య, సోదరి కలిశారు. తొమ్మిది నెలల తర్వాత ఇమ్రాన్‌ను కుటుంబ సభ్యులు కలిశారు. ఈ ఏడాది తొలిసారి. రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ ఖైదీగా ఉన్నారు. అయితే, ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం కొన్ని నెలలుగా అనుమతించలేదు. మధ్యలో ఆయన తరఫు లాయర్లు మాత్రమే కలిశారు. దీంతో ఆయన అనారోగ్యంపై చాలావార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆయనకు చికిత్స అందించాలని, కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఆయన సన్నిహితులు ఇటీవల పాక్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఇమ్రాన్‌ఖాన్‌ను వెంటనే జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. తగిన చికిత్స అందించాలని సూచించింది. ఇదే సమయంలో వారానికోసారి కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించింది. అలాగే, ఫోన్ల ద్వారా కూడా నిత్యం సంప్రదించవచ్చని తెలిపింది. దీంతో 9 నెలల తర్వాత ఇమ్రాన్ భార్య బుష్రా బిబి, ఇమ్రాన్ సోదరి నోరీన్ నాజి.. బుధవారం ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు. అడియాలాలోని జైలులో కలిసి దాదాపు 15 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆరాతీశారు. ఆయనను కోర్టు ఆదేశాల ప్రకారం షిఫా ఆస్పత్రికి తరలించే అంశంపై జైలు అధికారులతో మాట్లాడారు.
Alhamdulillah, Imran Khan has been transferred to Al-Shifa Hospital. pic.twitter.com/4Vvrvb0mA7
— Pakistani Aura (@Pakistani__aura) August 19, 2026
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. అక్కడ ఆయన సెప్టెంబర్ 16 వరకు ఉంటారని కోర్టు సూచించింది. పూర్తి చికిత్స అనంతరం వైద్యుల బృందం తగిన నివేదిక ఇవ్వాలని సూచించింది. అక్కడ చికిత్స సమయంలో ఇమ్రాన్ ఫ్యామిలీ వైద్యులు, లాయర్లను కూడా కలుసుకోనివ్వాలని ప్రభుత్వానికి సూచించింది. అవినీతి కేసులలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అక్కడి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 2023, ఆగష్టులో అరెస్టు చేసింది. అప్పటినుంచి మూడేళ్లుగా ఆయన జైలులోనే ఉన్నారు.