వరంగల్ : సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth ) పై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ ( Sushmita Patel ) మరోసారి సంచలన వ్యాఖ్యలు ( Sensational Comments ) చేశారు. పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్ స్టేట్మెంట్పై ఆమె ఘాటుగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా అలా చెప్పుకోలేదని పేర్కొన్నారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయావ్. ఆ విషయం మరిచిపోవద్దని సూచించారు.
బుధవారం మంత్రి కొండ సురేఖ జన్మదినం సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సీతాదయాకర్ ఏమి చేశారని, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇండ్ల పంపిణీలో బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటోను ఎందుకు పెట్టలేదని, బీసీలు అంటే అంత చులకనా? అంటూ నిలదీశారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ బీసీగా ఉండి ఏం చేస్తున్నారని,కొండా మురళీకి ఎందుకు పదవులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనేది బయపెట్టాలని డిమాండ్ చేశారు. పరకాలలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, ప్రకాశ్ రెడ్డి కాని, మీ తాత కానీ వచ్చి ఇక్కడ పోటీ చేయండని రేవంత్ కు సవాల్ విసిరారు. గడిచిన మూడేళ్లలో వేంనరేందర్ రెడ్డి రేవంత్ కి ఇచ్చిన సలహాలేంటో తెలియజేయాలని కోరారు. రేవంత్ తమ్ముడికి 200 కోట్ల షెల్ కంపెనీ పెట్టి లూటీ చేయటం నేర్పిస్తున్నాడని దుయ్యబట్టారు.