New Delhi : డేటింగ్ యాప్ స్కాంలో ఒక 67 ఏళ్ల వృద్ధుడు చిక్కుకున్నాడు. ఇద్దరు యువతుల చేతితో మోసపోయాడు. రూ.1.30 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో ఇటీవల జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఉండే ఒక వృద్ధుడికి డేటింగ్ యాప్ ద్వారా ఇద్దరు అమ్మాయిలు పరిచయమయ్యారు. ముందుగా 26 ఏళ్ల జ్యోత్స్న పరిచయమైంది. అతడితో పరిచయం పెరిగాక.. తన స్నేహితురాలు మాన్సి అనే మరో అమ్మాయిని కూడా అతడికి పరిచయం చేసింది.
వారు ఇటీవల అతడితో కలిసి ఒక రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లారు. అక్కడ వృద్ధుడి ఫోన్ దొంగిలించి, యూపీఐ ద్వారా డబ్బు తమ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అలా, రూ.1.30 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ విషయంలో మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు దీనిపై స్తానిక సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. డబ్బు తమ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకున్న యువతులు ఆ తర్వాత డబ్బును ఇతర అవసరాలకు వాడుకునేందుకు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, భారీ మొత్తంలో డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే కేవైసీ సహా పలు డాక్యుమెంట్లు బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది.
అలా సమర్పిస్తున్న సమయంలో ఆ ఇద్దరు యువతుల్ని గుర్తించారు. జ్యోత్స్న (26), మాన్సి్ (21)ని అరెస్టు చేశారు. వారిని విచారించగా కీలక విషయాలు తెలిపారు. ఒక డేటింగ్ యాప్‌లో ఇద్దరూ ఫేక్ ఐడెంటితో అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నట్లు, వాటి ద్వారా మోసానికి పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితులు బాధితుల్ని కలిసేందుకు వారికి బదులుగా వేరే అమ్మాయిల్ని పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డేటింగ్ యాప్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.