పాట్నా: నీట్ లీక్ వివాదంపై బీహార్‌లో విద్యార్థుల నిరసన సందర్భంగా ఒక పోలీస్ ఏకే-47తో కాల్పులు జరుపడంపై ‘రాజ్ భవన్ మార్చ్’కు ఆర్జేడీ పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (Tejashwi Yadav detained) గత నెలలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసనకు మద్దతుగా పాట్నాలో విద్యార్థుల నిరసనలు కొనసాగాయి. అయితే జూలై 25న సివాన్ జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏకే-47తో నిరసనకారులపై కాల్పులు జరిపిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బుధవారం ‘రాజ్ భవన్ మార్చ్’కు ప్రతిపక్ష ఆర్జేడీ పిలుపునిచ్చింది.
కాగా, తేజస్వీ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఆర్జేడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీలో ఒక వ్యక్తి నకిలీ ఏకే-47 గన్ పట్టుకుని కనిపించాడు. రాజ్‌భవన్ వైపు వెళ్తున్న నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. అలాగే తేజస్వీ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను విడిచిపెట్టారు.
అయితే విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, జైలుకు వెళ్లేందుకు కూడా భయపడబోమని తేజస్వీ యాదవ్ తెలిపారు. విద్యార్థుల హక్కులు, నిరుద్యోగ నిర్మూలన, పరీక్షా పత్రాల లీకేజీల అరికట్టడం, పరీక్షలలో పారదర్శకత కోసం ఎల్లప్పుడూ గళమెత్తుతామని చెప్పారు. ‘ఇదంతా సీఎం సామ్రాట్ చౌదరి ఆదేశాల మేరకే జరుగుతోంది. దీనివల్ల (వాటర్ క్యానన్ ప్రయోగం వల్ల) ఎలాంటి మార్పు ఉండదు. ప్రజలు చైతన్యవంతులై వీధుల్లోకి వచ్చారు. ఇక ప్రభుత్వం తలొగ్గక తప్పదు. ఇలాంటి ఎత్తుగడలు పని చేయవు’ అని ఆయన అన్నారు.
మరోవైపు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని పాదయాత్రలో ఆర్జేడీ ఎంపీ మీసా భారతి కూడా పాల్గొన్నారు. బీహార్‌లో పేపర్ లీక్‌లు, నిరుద్యోగం, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తారు.
‘విద్యార్థులపై ఏకే 47 ప్రయోగించినట్లు బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అంగీకరించిందని మేం విన్నాం. నిరసనలో ఏకే 47 వాడకానికి ఎవరు అనుమతి ఇచ్చారని బీహార్ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది’ అని ఆమె అన్నారు.
కాగా, సివాన్‌లో విద్యార్థుల నిరసనల సమయంలో పోలీస్ కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ ఏకే-47తో కాల్పులు జరుపడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కానిస్టేబుల్‌ను బీహార్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే సివాన్, భోజ్‌పూర్ జిల్లాల ఎస్పీలను బదిలీ చేసింది. సివాన్ ఎస్పీ పూరన్ కుమార్ ఝా పర్యవేక్షణలో ఏకే-47 రైఫిల్‌ను వినియోగించినట్లు ఆరోపణలు రావడంతో కొత్త పోస్టింగ్ కోసం ఆయనను వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారు.
Patna, Bihar: RJD leader Tejashwi Yadav was detained by the police during the march pic.twitter.com/Let1rdhnHU
— IANS (@ians_india) August 19, 2026
#WATCH | Patna | RJD MP Misa Bharti joins Tejashwi Yadav-led foot march towards Lok Bhavan, raising issues of paper leaks, unemployment and problems faced by students and youth in Bihar
She says, “We have heard that the Bihar government in the Supreme Court has admitted that the… pic.twitter.com/8CLyBvtR1r
— ANI (@ANI) August 19, 2026