న్యూఢిల్లీ: ఒక ఫామ్ ద్వారా అర్హత ఉన్న పౌరులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చాలని దరఖాస్తు చేసుకోవచ్చు. మరో ఫామ్ ద్వారా నమోదైన ఓటర్లు ఒకరి పేరును చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు లేదా ఒకరి పేరును తొలగించాలని కోరవచ్చు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో లక్షలాది పేర్లు తొలగించడంతోపాటు, మరోవైపు లక్షలాది పేర్లు చేర్చిన నేపథ్యంలో ఈ రెండు ఫామ్‌లు ప్రస్తుతం వివాదానికి కేంద్రంగా మారాయి.
ఫామ్ 6కు సంబంధించిన వివాదం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో కోరుతున్న అదనపు డిక్లరేషన్ చుట్టూ నెలకొన్నది. ఫామ్ 7కు సంబంధించి కర్ణాటకలో ముస్లిం ఓటర్లపై పెద్దసంఖ్యలో అభ్యంతరాలు దాఖలు చేశారన్న ఆరోపణలు, అలాగే బెంగాల్లో పేర్లు చేర్చేందుకు, తొలగించేందుకు వచ్చిన దరఖాస్తుల నిష్పత్తుల్లో భారీ వ్యత్యాసం ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ విమర్శల్లో.. నిబంధనలు అర్హులైన పౌరులు ఓటర్లుగా నమోదు చేసుకోవడాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయా అనే అంశంతోపాటు, సరైన ఆధారాలు లేకుండా దాఖలు చేసే అభ్యంతరాల వల్ల ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్నవారు తమ పేర్లను కోల్పోయే ప్రమాదం ఉన్నదా అనే అంశం కూడా ప్రధానంగా ఉన్నది.
ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఫామ్-7ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై క్రిమినల్ దర్యాప్తుతో సహా సమగ్ర విచారణ జరిపించాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ బుధవారం కోరారు. బీజేపీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నదని ఆరోపిస్తూ శివకుమార్ ఒక వీడియో సందేశంలో ‘ఈ విషయంలో చట్టపరమైన పరిధిలో సమగ్ర దర్యాప్తు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉన్నది’ అని అన్నారు. గోవాలో చిరునామా మార్పు కోసం దాఖలు చేసిన దరఖాస్తులను ప్రాసెస్ చేయలేక.. వారిని తిరిగి నమోదు చేసేందుకు ఫామ్ 6ను ఉపయోగించాలనడం ప్రశ్నలను లేవనెత్తింది. ఫామ్ 8(చిరునామా మార్పు కోసం) సమర్పించిన ఒక కుటుంబాన్ని, ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్‌లోని పరిమితుల కారణంగా కొత్త ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవాలని ఎందుకు కోరుతున్నారని బాంబే హైకోర్టు గోవా బెంచ్ ప్రశ్నించింది.
ఫామ్ 6.. అదనపు నిబంధనతో ఇక్కట్లు
ఫామ్ 6.. కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన ఈ దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు, వయస్సు రుజువు, సాధారణ నివాసం, పౌరసత్వం, అలాగే దరఖాస్తుదారు ఇప్పటికే మరెక్కడైనా ఓటరుగా నమోదై ఉన్నారా అనే విషయాలకు సంబంధించిన డిక్లరేషన్లు కోరుతారు. దరఖాస్తుదారుల తల్లిదండ్రులు లేదా తాతయ్య, అమ్మమ్మలు గతంలోని ‘సర్’ ఓటర్ల జాబితాలో ఉన్నారా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని ఫామ్ కోరదు. కానీ ‘సర్’లో చేర్చిన ఈ అదనపు నిబంధన ఇప్పుడు వివాదానికి కారణమైంది.
పార్లమెంట్ నుంచి స్పష్టమైన అనుమతి లేకుండా ఫామ్‌ను మార్చలేరని ప్రతిపక్ష నేతలు, ఎన్నికల మాజీ కమిషనర్లు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈ నిబంధన యువత ఓటరుగా నమోదు చేసుకోవడాన్ని కష్టతరం చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. సీఈసీ రాజ్యాంగ సంప్రదాయాలు, విధానాలను మాత్రమే కాకుండా, పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని కూడా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని అన్నారు. ఈ మార్పు చట్టవిరుద్ధంగా జరిగిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ మార్పు చేయాలని ఈసీఐ తరఫున టీసీఎస్‌ను ఎవరు ఆదేశించారు? టీసీఎస్‌లో దానికి ఎవరు ఆమోదం తెలిపారు?, దాన్ని అమలు చేయడానికి కంపెనీపై ఒత్తిడి తెచ్చారా అని రాహుల్ ప్రశ్నించారు.
ఫామ్ 7.. అభ్యంతరానికి ఆధారాలు అవసరం
ప్రతిపాదిత ఓటరు నమోదుపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి, ఇప్పటికే ఉన్న నమోదును తొలగించాలని కోరడానికి లేదా దరఖాస్తుదారు తన సొంత పేరును తొలగించాలని కోరడానికి ఫామ్ 7 ఉపయోగించవచ్చు. మరణం, వయసు అర్హత లేకపోవడం, శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోవడం, ఒకటికంటే ఎక్కువసార్లు నమోదు కావడం, భారత పౌరసత్వం లేకపోవడం వంటి కారణాలను ఇందులో పేర్కొన్నారు. ఫారం దాఖలు చేయడం అనేది చర్య తీసుకోవాలని చేసే దరఖాస్తు మాత్రమే.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుదారు సంబంధిత నియోజకవర్గంలో నమోదై ఉండాలి. అలాగే అభ్యంతరానికి ఆధారాలను సమర్పించే బాధ్యతా దరఖాస్తుదారుపైనే ఉంటుంది. కర్ణాటకలోని పలు నియోజకవర్గాల్లో 4,000కు పైగా పేర్లను తొలగించాలని దరఖాస్తులు అందించారు. వీటిలో ఎక్కవ పేర్లు ముస్లిం ఓటర్లకు సంబంధించినవే. బాబలేశ్వర్లో సెప్టెంబర్ 22న ఫామ్ 7 దరఖాస్తులు 1,373 అందగా, వాటిలో 1,363 దరఖాస్తులను 10 మంది వ్యక్తులు సమర్పించారు. భాల్కిలో సెప్టెంబర్ 23న 30 మంది వ్యక్తులు 1,700కు పైగా పేర్లను తొలగించాలని కోరారు. ఇవి తొలగింపు కోసం వచ్చిన అభ్యర్థనలు మాత్రమే, వాస్తవంగా తొలగించబడిన పేర్ల సంఖ్య కాదు. బుధవారం ప్రత్యేక ప్రకటనలో శివకుమార్ నియోజకవర్గాల వారీగా ఫామ్ 7 అభ్యంతరాల వివరాలను కోరారు. ఈ ప్రక్రియకు సంబంధించి క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు తేలినవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
ముసాయిదా జాబితాలో 81.79 కోట్లకు తగ్గిన ఓటర్లు
సర్‌లో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితాలను ప్రచురించిన రాష్ర్టాలు, కేంద్ర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఓటర్ల సంఖ్య 2015 నాటి స్థాయికి పడిపోయింది. 2014లో ఈ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 76.6 కోట్లుగా ఉంది. సర్ నిర్వహించడానికి ముందు ఈ సంఖ్య 2024లో 92.8 కోట్లకు, ఆ తర్వాత 95.2 కోట్లకు పెరిగింది. అయితే సర్‌లో భాగంగా పేర్ల తొలగింపు అనంతరం ఓటర్ల సంఖ్య 81.1 కోట్లకు తగ్గినట్లు సమాచారం. 2015లో ఓటర్ల సంఖ్య 81.69 కోట్లుగా ఉండేదని తెలిసింది. బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం 2024 లోక్‌సభ ఎన్నికలు, సర్ ప్రక్రియకు ముందు ఉన్న కాలం మధ్య 21 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య పెరగగా 10 ప్రాంతాల్లో తగ్గుదల నమోదైంది.
అయితే, ఈ రెండు వర్గాలకు చెందిన ఏడు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలగించిన ఓటర్ల సంఖ్య ఆయా ప్రాంతాల మొత్తం ఓటర్ల సంఖ్యలో 10 శాతం కంటే ఎక్కువగా ఉందని పత్రికా కథనం పేర్కొంది. కొన్ని రాష్ర్టాల ఉదాహరణలను ప్రస్తావిస్తూ ఈ కాలంలో మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య 5.6 శాతం పెరిగినప్పటికీ సర్ తర్వాత ముసాయిదా జాబితాలో 21 శాతం మంది ఓటర్లను తొలగించారని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల ముసాయిదా ఓటర్ల జాబితాల్లో కూడా పెద్ద సంఖ్య పేర్ల తొలగింపులు నమోదయ్యాయయని తెలిపింది. ఇందుకు ఉదాహరణగా యూపీ (18.6 శాతం), ఉత్తరాఖండ్(10.4 శాతం), పంజాబ్‌లో(9.6 శాతం) తొలగింపులను ప్రస్తావించింది.
ఎన్నికల సంఘం ఏమంటున్నది?
‘సర్’ సమయంలో ఫామ్ 6కు జతచేసిన డిక్లరేషన్‌ను ఎన్నికల సంఘం సమర్థించింది. సుప్రీంకోర్టు దాన్ని సమర్థించిందని ఈసీ తెలిపింది. అయితే ఈ పరిశీలన బీహార్‌లో ‘సర్’ జరుగుతున్న సమయంలో.. అంటే ఈ ప్రక్రియ మొదటిసారి అమలు చేసిన రాష్ట్రంలో సుప్రీంకోర్టు చేసినదని, ఆ తర్వాత ఫామ్‌లో మార్పులు చేశారని ఇతరులు పేర్కొన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను కూడా ఎన్నికల సంఘం కొట్టిపారేయలేదు. అయితే వాటిని తగ్గించి చూపుతూ భిన్నాభిప్రాయాలు సంస్థాగత చర్చల్లో భాగమని పేర్కొన్నది. ఈ నిర్ణయాలు, ఏకగ్రీవంగా తీసుకున్న సమావేశాల మినిట్స్‌ను బహిరంగపరచాలని ఎన్నికల సంఘం విమర్శకులు డిమాండ్ చేశారు.