హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అత్యవసర సేవలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు నిలిచిపోకుండా సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య చెక్ పవర్ తగాదాలు తలెత్తకుండా సర్కార్ కీలక ఆదేశాలు జారీచేసింది. కారణం లేకుండా చెకులపై సంతకాలు నిరాకరించే ఉప సర్పంచ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ దివ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉప సర్పంచ్ ఏడు పనిదినాల్లోగా సరైన కారణం లేకుండా చెకుపై సంతకం చేయడానికి లేదా డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఆమోదించడానికి నిరాకరించినట్టు ఫిర్యాదులు వస్తే, కలెక్టర్ వెంటనే దానిపై విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఉపసర్పంచ్ సరైన కారణం లేకుండా నిరాకరించినట్టు రుజువైతే, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెకులపై సంతకాలు చేసే అధికారాలను ఇతర చట్టబద్ధ అధికారులకు(పంచాయతీ కార్యదర్శి/ ఎంపీవో/ఎంపీడీవో మొదలైనవారికి) అప్పగించాలని పేర్కొన్నారు.