హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటరుకు నోటీసు జారీ అయితే వారు ఈఆర్వో కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో)ఓటరు ఇంటికి వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని పునరుద్ఘాటించారు. వాటిని ఈసీఐనెట్‌లో అప్లోడ్ చేసి, తదుపరి నిర్ణయం కోసం ఈఆర్వో/ఏఈఆర్వోకు సమర్పిస్తారని తెలిపారు.
ఫామ్-6తోపాటు ఇచ్చే డిక్లరేషన్ ఫామ్‌ను కేవలం ‘సర్’ ప్రక్రియ జరిగే రాష్ర్టాల్లోనే వినియోగించాలని సూచించారు. సాధారణ సమయంలో ఈ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటర్ల నమోదు, సవరణ, పరిశీలన ప్రక్రియను సులభతరం చేసేందుకు తీసుకున్న పలు నిర్ణయాలను హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో గురువారం సీఈవో మీడియాకు వివరించారు.
అరుదైన, మినహాయింపు పరిస్థితుల్లో మాత్రమే ఈఆర్వో/ఏఈఆర్వోల నిర్ణయం మేరకు ఆన్లైన్ ద్వారా పూర్తిచేస్తారని తెలిపారు. ఓటరు స్వయంగా హాజరుకాలేని పరిస్థితుల్లో తమ కుటుంబంలోని వ్యక్తి హాజరుకావచ్చని పేర్కొన్నారు. ధ్రువపత్రాలు లేని నిరుపేదలు, అమాయకులైన ఓటర్ల విషయంలో ఈఆర్వోలు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తారని చెప్పారు. నోటీసుల పరిషార వివరాలను ప్రతిరోజూ ఈఆర్వో కార్యాలయాల నోటీస్ బోర్డులో పెడుతారని, రాజకీయ పార్టీలతోపాటు మీడియాకు కూడా షేర్ చేస్తారని వెల్లడించారు.