హనుమకొండ చౌరస్తా, మార్చి 17: చారిత్రిక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో రుద్రేశ్వరస్వామికి ఏకాదశి రుద్రాభిషేకం సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించి రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామి వార్లకు ఉత్సవమూర్తులకు మాస కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈనెల 19న ఉగాది ఉత్సవం, శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాల ఉదయం 10 గంటలకు విష్ణు ఆలయంలో సీతారామచంద్రస్వామి లక్ష్మణ సహిత ఉత్సవ విగ్రహ ప్రతిష్టాపన దేవతాహ్వానం, విష్వక్సెనాపూజ, అంకురారోపణ, ఋత్విగ్వరణం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్టాపన, భేరిపూజ, నవగ్రహ రుద్ర మహా సుదర్శన హోమం ప్రారంభమవుతుందని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
సాయంత్రం 5 గంటలకు మంగళవాయిద్య సేవ సముద్రాల శఠగోపాచార్య సంస్కృత పండితుడిచే పంచాంగ శ్రవణం, తాడూరి రేణుక బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు, కవి సమ్మేళనం నిర్వహించబడుతాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిచే ఉత్సవం ప్రారంభమవుతుందని, ప్రతినిత్యం సీతారామచంద్రస్వామి వారికి ఉదయం, సాయంకాలం పూజా కార్యక్రమాలు ప్రసాద వితరణలు, సుదర్శన హోమం నిర్వర్తించుకునే భక్తులు రూ.2016 చెల్లించి రశీదు పొందగలరని ఆలయ కార్య నిర్వాహణ అధికారి డి.అనిల్‌కుమార్ తెలిపారు. ఉగాది, శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవముల ప్రచార కరపత్రాలను, పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేందర్ శర్మ, సందీప్‌శర్మ, మణికంఠశర్మ అవధాని, ఆలయ సిబ్బంది మధుకర్, ఉత్సవ దాతలు పాల్గొన్నారు.