కాజీపేట, జూన్ 12: కాజీపేట పట్టణంలో ప్రధాన రోడ్డుకు పక్కల ఉన్న చెట్ల కొమ్మలను గత మూడు, నాలుగు రోజుల క్రితం నరికి రోడ్డుపై పడేయడంతో వాహన దారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పట్టణంలోని బాపూజీ నగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని చెట్లు ఏపుగా పెరిగాయి. కాగా, కేబుల్ వైర్లకు అడ్డు తగలడంతో కేబుల్ యాజమాన్యం ఆదేశాలతో ఆయా సంస్థల సిబ్బంది చెట్ల కొమ్మలను నరికి రోడ్ల మీదనే వదిలేశారు.
మూడు, నాలుగు రోజులుగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోక పోవడం, ఆ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వాహన దారులు పాదచారులు మండి పడుతున్నారు. కేబుల్ యజమాన్యాలు రోడ్డుకు పక్కనున్న పచ్చటి చెట్లను ఇష్టరాజ్యంగా నరికి వేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా సంబంధిత అధికారులు పట్టించుకుని కేబుల్ యాజమాన్యం నరికి పడేసిన చెట్ల కొమ్మలను వెంటనే తొలగించి, స్థానికులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.