హైదరాబాద్, మార్చి 2 (నమస్తేతెలంగాణ): ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని నిరుద్యోగులు నిలదీస్తరనే ఆయన రాక సందర్భంగా సర్కార్ నిర్బంధకాండకు దిగిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ఇంతియాజ్ అహ్మద్, బొమ్మెర రామ్మూర్తి, ఫయాజ్, గాంధీనాయక్‌తో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, తుక్కుగూడ, చేవెళ్ల, వరంగల్, కామారెడ్డి డిక్లరేషన్ల పేరిట అలవిగానీ హామీలిచ్చిన రాహుల్‌గాంధీ రాష్ట్ర ప్రజలను మోసగించారు’ అని ధ్వజమెత్తారు. అసలు ఆయన ఏ ముఖం పెట్టుకొని, ఏం ఉద్ధరించిండని తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిండని ప్రశ్నించారు. పోలీసులను అడ్డంపెట్టుకొని సర్కార్ ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులకు పాల్పడిందని మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాడు ఓట్ల కోసం కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లన్నీ డెత్ డిక్లరేషన్లుగా మారాయని విరుచుకుపడ్డారు. విద్యాభరోసా కార్డులు మంజూరు చేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులను దగా చేశారని విమర్శించారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగులతో ‘చాయ్ పే చర్చ’ చేసిన రాహుల్‌గాంధీ.. అధికారంలోకి వచ్చాక నట్టేటా ముంచారని ఎర్రోళ్ల శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. గోడు చెప్పుకొందామని అపాయింట్మెంట్ అడిగిన నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేయించడం శోచనీయమని పేర్కొన్నారు. రెండేండ్లలో 60 వేలు ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు. ఆయన చెప్పింది, ఉద్యోగాలిచ్చింది నిజమే అయితే రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగులకు చెప్పాలని సవాల్ విసిరారు. ఆయనకు ఎలాంటి హాని తలపెట్టకుండా చూసే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని స్పష్టంచేశారు. రేవంత్ సర్కార్ నుంచి రూ.1,000 కోట్ల వసూలుకే రాహుల్ రాష్ట్రానికి వచ్చారని, రాష్ట్ర సర్కారు ఇస్తున్న అవినీతి సొమ్ముతోనే ఏఐసీసీని, రాష్ట్ర కాంగ్రెస్‌ను నడుపుతున్నారని ఆరోపించారు.