హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): వేములవాడలోని దర్గా తరలింపు వ్యవహారంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు వక్స్బోర్డు సీఈవో, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ, వేములవాడ ఆలయ కార్యనిర్వహణాధికారికి నోటీసులు జారీ చేసింది. వేములవాడ దర్గా తరలింపు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో నజీమా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వేములవాడకు భక్తుల తాకిడి అధికమవడంతో అక్కడ సౌకర్యాల కల్పనలో భాగంగా ఇతర మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలను మరో ప్రాంతానికి తరలించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రజాభిప్రాయం ప్రకారమే ఈ ప్రక్రియ చేపడుతున్నామని, ఏ మతానికి విరుద్ధంగా చర్యలు తీసుకోవడంలేదని చెప్పారు. దీంతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయమూర్తి.. దర్గా తరలింపునకు సంబంధించిన చర్యలు కోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.