Pakistan | పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో 36 గంటల పాటు నిఘా సమాచారం ఆధారంగా జరిపిన వరుస ఆపరేషన్లలో 60 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని భద్రతా అధికారులుతెలిపారు. దేశ వాయువ్య ప్రాంతంలోని ఉత్తర వజీరిస్తాన్, బన్నూ జిల్లాల్లో ఈ ఆపరేషన్లు జరిగాయి. ఉత్తర వజీరిస్తాన్లో మంగళవారం ఉదయం నుంచి ప్రారంభించిన ఆపరేషన్లలో నలుగురు కీలక కమాండర్లతో సహా 52 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, బన్నూలో జరిగిన పలు ఆపరేషన్లలో 10 మంది ఉగ్రవాదులు హతమవ్వగా 16 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఉత్తర వజీరిస్తాన్లో ఫిత్నా అల్-ఖవారిజ్ మిలిటెంట్లపై లక్షిత దాడికి ముందు భద్రతా దళాలు అనుమానిత ప్రాంతాలపై నిఘాను కట్టుదిట్టం చేశాయి. చెట్ల పొదల్లో దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించడానికి క్వాడ్ కాప్టర్లను వినియోగించి ఉగ్రవాదులను మట్టుబెట్టామని అధికారులు తెలిపారు. హతమైన వారిలో నలుగురు కీలక కమాండర్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ ఆపరేషన్లలో పలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని, భారీ పరిమాణంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సైనిక పరికరాలను స్వాధీనం చేసుకున్నామని భద్రతా దళాలు తెలిపాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు ఉగ్రవాదులపై ఆపరేషన్లు నిరంతరాయంగా కొనసాగుతాయని భద్రతా అధికారులు తెలిపారు.