HCA Funds | పెద్దల అవినీతి.. ప్రభుత్వ విభాగాలను దాటి, ఇప్పుడు కొత్తదారులు వెతుకుతున్నది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెగబడుతున్నది. అధికారబలంతో బెదిరించడం, వ్యవస్థలను లొంగదీసుకోవడం, ఆపై నిధులు కొల్లగొట్టడం.. అధికారపార్టీ అమలు చేస్తున్న కొత్త లూటీ విధానం. హెచ్‌సీఏలో జరిగిందిదే!
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): భూ కబ్జాలు, పోస్టింగ్‌లు, సెటిల్మెంట్లు దాటి ఇప్పుడు అధికార పార్టీ నేతల కన్ను నగదు నిల్వల మీద పడింది. ఎక్కడ ఖజానాలో నగదు ఉందని తెలిస్తే, అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. అధికార బలంతో వ్యవస్థలను తమ చెప్పుచేతల్లోకి తీసుకొని గల్లాపెట్టెను కొల్లగొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఉత్తర తెలంగాణ మంత్రి చేసిన నిర్వాకం ఇదేనని చెప్తున్నారు. 22 ఏండ్ల కిందటి ఫైల్‌ను అడ్డుపెట్టుకొని, పథకం ప్రకారం హెచ్‌సీఏ నుంచి రూ.69 కోట్లు తమ కంపెనీకి మళ్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత యువతలోని ప్రతిభను వెలికి తీసి, ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు దాచిన సొమ్మును తరలించుకుపోయారని హెచ్‌సీఏ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఉప్పల్‌లోని క్రికెట్ స్టేడియం నిర్మాణం జరిగే సమయంలో ‘విశాఖ ఇండస్ట్రీస్’ రూ.4.32 కోట్లు ఖర్చు చేసింది. ఇందుకుగాను ఉప్పల్ స్టేడియానికి కంపెనీ పేరుతో ‘విశాఖ’ స్టేడియం అని నామకరణం చేయటంతోపాటు, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో వాణిజ్య ప్రకటనలు, స్పాన్సర్షిప్, మ్యాచ్ టికెట్లలో వాటా హక్కులను తీసుకున్నట్టు హెచ్‌సీఏ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవ ఒప్పందం ప్రకారం కంపెనీ రూ.6.50 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా, రూ.4.32 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టిందని తెలిపాయి.
దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విశాఖ ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడారని, స్టేడియానికి కంపెనీ పేరుకు బదులు ‘రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం’గా నామకరణం చేసేందుకు ఒప్పించారని చెప్తున్నారు. నార్త్ ఎండ్ బాక్స్‌కు విశాఖ ఎండ్‌గా పేరు పెట్టాలని, మిగిలిన హక్కులు విశాఖ ఇండస్ట్రీకి యథాతథంగా ఉండేలా ఒప్పందం కుదిరినట్టు వెల్లడించారు. 2006 ఏప్రిల్ 25న హెచ్‌సీఏ, విశాఖ ఇండస్ట్రీ కలిసి ఈ మేరకు ఒప్పంద పత్రాలు రాసుకున్నట్టు హెచ్‌సీఏ వర్గాలు తెలిపాయి.
2008లో ఐపీఎల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హెచ్‌సీఏ, విశాఖ ఇండస్ట్రీస్ మధ్య వివాదం మొదలైంది. బీసీసీఐ నిర్వహించే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే విశాఖ ఇండస్ట్రీస్‌కు స్పాన్సర్షిప్ హక్కులు ఉన్నాయని, ఒప్పందం జరిగేనాటికి ఐపీఎల్ లేదు కాబట్టి ఈ మ్యాచ్‌లకు సంబంధించి విశాఖ ఇండస్ట్రీస్‌కు ఎలాంటి హక్కులు ఉండవని అప్పట్లో హెచ్‌సీఏ పాలక వర్గం నిర్ణయించింది. పైగా ఐపీఎల్ నిబంధనల ప్రకారం అంతర్గత ఒప్పందాలతో సంబంధం లేకుండా స్టేడియాన్ని క్లీన్‌గా అప్పగించాల్సి ఉంటుందని హెచ్‌సీఏ వర్గాలు తెలిపాయి. దీంతో స్టేడియాన్ని యథాతథంగా ఐపీఎల్‌కు లీజ్‌కు ఇచ్చినట్టు చెప్పాయి. అయితే అప్పుడు మంత్రి హోదాలో ఉన్న విశాఖ ఇండస్ట్రీస్ యజమాని ఈ విషయంలో అభ్యంతరం తెలిపారని, దీంతో ప్రతి సీజన్‌కు రూ.75 లక్షల చొప్పున మొత్తం 3 ఐపీఎల్ సీజన్స్‌కు కలిపి రూ.2 కోట్లకుపైగా చెల్లించినట్టు చెప్తున్నారు.
తరచూ వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్షిప్ హక్కులను రద్దు చేయాలని హెచ్‌సీఏ పాలక వర్గం నిర్ణయించి, 2011లో అమలు చేసినట్టు చెప్తున్నారు. దీనిపై విశాఖ ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్లగా ఆర్బిట్రేషన్‌కు అప్పగించినట్టు వెల్లడించారు. అదే సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోనే ఒకరు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, ఆ సమయంలో ఒప్పందాలకు సంబంధించిన ఫైళ్లలో కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు, ఒప్పంద పత్రాలు తారుమారు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
హెచ్‌సీఏ హక్కులను సమర్థించే కొన్ని అనుబంధ ఒప్పంద పత్రాలను మాయం చేశారన్న ప్రచారం జరిగింది. ఆర్బిట్రేషన్‌లో వాదనల అనంతరం హెచ్‌సీఏ రూ.14.5 కోట్లు చెల్లించాలని సూచించినట్టు చెప్తున్నారు. ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించడానికి హెచ్‌సీఏ సిద్ధమైనా విశాఖ ఇండస్ట్రీస్ యా జమాన్యం తీసుకోకుండా తాత్సారం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత ఆ ర్బిట్రేషన్ నిర్ణయించిన డబ్బుకు 18శాతం వడ్డీ కోరుతూ మళ్లీ కోర్టులను ఆశ్రయించినట్టు హెచ్‌సీఏ వర్గాలు తెలిపాయి. వాదనల అనంతరం చివరికి రూ.68.73 కోట్లు చెల్లించేలా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు.
గ్రామీణ ప్రాంతంలోని యువ క్రికెటర్లను గుర్తించి, వారి ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు వినియోగించాల్సిన నిధులను తరలించినా ము ఖ్యనేత స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డిమాండ్ చేస్తున్నా లెక్కచేయకపోవడంపై హెచ్‌సీఏ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యనేతకు తెలిసే రూ.69 కోట్ల బదిలీ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విశాఖ ఇండస్ట్రీస్ గతంలో కోర్టులను ఆశ్రయించిన సమయంలోనే.. ఏదో జరుగబోతున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ హన్మంతరావు ముందుగానే పసిగట్టారు. విశాఖ ఇండస్ట్రీస్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఎవరు పడితే వాళ్లు ఇష్టానుసారం అసోసియేషన్ డబ్బులు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏమిటని నిలదీశారు. ఆ డబ్బుతో వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో స్టేడియాలు నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. అయినా విశాఖ ఇండస్ట్రీస్ యాజమాన్యం పట్టించుకోకుండా అప్పుడు కోర్టులకు వెళ్లిందని విమర్శలున్నాయి.
ఇప్పుడు దాదాపు రూ.69 కోట్లను కంపెనీ ఖాతాకు మళ్లించేందుకు ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి పక్కా ప్లాన్ వేసి, అమలు చేసినట్టు చెప్తున్నారు. గతంలో ఉన్న హెచ్‌సీఏ అధ్యక్షుడు నిధుల విడుదలకు ఒప్పుకోలేదని, అందుకే ఆయనపై అవినీతి ముద్ర వేసి, నిబంధనలకు విరుద్ధంగా పదవి నుంచి తొలగించారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 2న కొత్త హెచ్‌సీఏ అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఆయన ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి మనిషని, అందుకే పదవిలోకి వచ్చిన వారం రోజుల్లోపే విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన ఎంపికే చట్టవిరుద్ధమని కోర్టుల్లో వాదనలు సాగుతున్న సమయంలోనే, దిల్‌సుఖ్‌నగర్‌లోని కెనరా బ్యాంక్‌లో ఉన్న హెచ్‌సీఏ ఖాతా నుంచి రూ.68.73 కోట్లు విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించినట్టు చెప్తున్నారు. మొత్తం ఆరు డీడీల రూపంలో ఫిబ్రవరి 9న బదిలీ జరిగినట్టు సమాచారం.