రఘునాథపాలెం, మార్చి 2 : ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేయడంతో నిలువనీడ కోల్పోయి ఖమ్మం నగరంలోని టీటీడీసీలో ఆశ్రయం పొందుతున్న తన మేనత్తను చూసేందుకు వచ్చిన 9వ తరగతి విద్యార్థి భరత్ వచ్చాడు. అత్త కొడుకును రోడ్డు మీద ఉయ్యాలలో ఉంచడా న్ని చూసి తట్టుకోలేకపోయాడు. చిన్నారి దుస్థితిని చూసి చలించిపోయిన భరత్.. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డాడు. ‘రేవంత్ సార్.. ఈ చిన్న బాలుడు మీకు ఏం అన్యాయం చేసిండు? వీడిని రోడ్డు మీదే వదిలి పెట్టారు. ఈ దుస్థితి తీసుకొచ్చిన మీకు బాధితుల ఉసురు తప్పక తగులుతుంది. మా మేనత్త ప్రేమ వివాహం చేసుకుందని ఇంట్లో నుంచి వెళ్లగొడితే వెలుగుమట్ల ప్రాంతంలో ఇల్లు కట్టుకొని ఉంటున్నది. ఆ ఇంటిని మీరు కూల్చితే వచ్చి టీటీడీసీలో ఆశ్రయం పొందుతున్నది. ఇప్పుడు ఇక్కడ కూడా ఉండొద్దని వెళ్లగొడుతుంటే ఎక్కడికి పోతారు సార్?’ అని కన్నీటి పర్యంతమయ్యాడు. ‘ఎక్కడికి పొమ్మంటారు.. అంటే చచ్చిపోవాల్నా? ‘రేవంత్రెడ్డి సార్.. మీకు ఒక్కటే మాట చెబుతున్నా ఇంతమంది పేదల ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది’ అంటూ ఆ బాలు డు శపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.